వంశీ వ్యూ పాయింట్ - 'శ్రీనివాస కళ్యాణం'

వంశీ వ్యూ పాయింట్ - 'శ్రీనివాస కళ్యాణం'
******************************************
            ఇపుడు వచ్చే ఏ సినిమా గురించైనా కథ గురించి చివరగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏవీ కొత్త కథలు కావు ... పాతవాటిని కాస్త అటూ ఇటూ తిప్పి, ఏదో కాసింత ఇంటరెస్టింగ్ పాయింట్ లేదా కాసింత థ్రిల్లింగ్ ఎలిమెంట్ జత చేసి తీసి పారెయ్యడమే. గతంలో ఎపుడో ఒకసారి రాజమౌళి అదే విషయాన్ని చెప్పాడు. నేనేమీ కొత్త కథలు తియ్యటం లేదు, పాత కథలను నా కోణంలో చెబుతున్నాను/తీస్తున్నాను నాయి చెప్పాడు. రాజమౌళి అనే కాదు, చాలామంది వివిధ సందర్భాలలో అలాంటి ప్రస్తావనే చేశారు. ఉన్న కొద్దిపాటి మూలకథలనే ఎవరికీ నచ్చిన కోణంలోంచి ఆలోచించి, వారికి తోచినట్టు తీస్తారు. ఎప్పుడైతే ఆ మూలకథకు ఒక బలమైన కథనం, కన్ఫ్లిక్టింగ్ పాయింట్, చిత్రీకరణ తోడైతాయో అపుడు అది ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది. 
            ఇటీవల వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' అలాంటిదే. కాకపొతే ఇంతటి పాత చింతకాయ పచ్చడి కథకు ఒక బలమైన కథనాన్ని సతీష్ వేగేశ్న అల్లుకోలేకపోయాడు. సంప్రదాయాలకు విలువిచ్చే మిగతా అందరూ కలిసి, పూర్తి బిసినెస్ మైండెడ్ వ్యక్తిని సంప్రదాయాల విలువ తెలిసొచ్చేలా చెయ్యటం. ఈ పాయింట్ ఇప్పటికి లెక్కలేనన్ని సినిమాల్లో చూపినప్పటికీ, దాని చుట్టూ సరైన కథనం అల్లుకోగలిగితే అది సెల్లింగ్ ఎలిమెంట్ యే. 'శతమానం భవతి' విషయంలో సక్సెస్ అయినా దర్శకుడు సతీష్, ఈ సినిమా విషయంలో తడబడ్డాడు. అల్లుకున్న సన్నివేశాల్లో బలం లేకపోవడంతో ఎంతో సమర్థవంతమైన నటీనటులు ఉన్నప్పటికీ వారందరూ కృతకంగా కనిపించారు. మరీ ముఖ్యంగా 'సహజనటి' జయసుధ కూడా తేలిపోయేలా కనిపించిందంటే అది సతీష్ వేగేశ్న లోపమే. అలాగే ఎటువంటి సన్నివేశాన్నైనా ఆకట్టుకునేలా చేసే ప్రకాష్ రాజ్ కూడా చివరి సన్నివేశంలో ఏదో నాటకీయంగా అలా చేసుకుపోయాడు తప్పించి, అందులో ఫీల్ మిస్ అయ్యిందనిపించేలా ఉంది. 
            నటీనటుల విషయానికి వస్తే అతి మంచివాడిగా కనిపించిన నితిన్ కు ఇది 'అ ఆ' సినిమా పాత్రకు కొనసాగింపులా అనిపిస్తుంది. తనవంతు లోపం లేకుండా చేశాడు, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ లో డైలాగ్స్ లోని బరువును బాగానే పలికించాడు. కాకపొతే జయసుధ, నితిన్ ల మధ్య ఉన్న గాఢత డైలాగ్స్ లో ఉంది కానీ, సన్నివేశాల పరంగా నటన పరంగా పండలేదు. ఇక రాశి ఖన్నా పాత్రకు మొదటి నుండి ఏదో కన్ఫ్యూషన్ ఉన్నట్టే ఉంటుంది. తనవరకూ పర్వాలేదు. అందంగా కనబడటంతో పాటు, నటన పరంగా కూడా బాగానే చేసింది. నా అనుభవంలో మొదటిసారి జయసుధ 'సహజ నటన'ను మిస్ అయినట్టనిపించింది. రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటివారూ అంతే - అలవాటైన పాత్రల్లో అలా వచ్చి పోతుంటారు. ఈ సినిమాలో నా అభిప్రాయంలో అందరికంటే బాగా ఆకట్టుకునేది నందితా శ్వేత. చక్కటి హావభావాలతో పాటు, అందంలో/స్క్రీన్ ప్రెసెన్స్ లో కూడా రాశి ఖన్నాను డామినేట్ చేసింది. కొన్ని మంచి పాత్రలు వస్తే, చక్కటి పోసిషన్ కు చేరగలిగే అన్ని అర్హతలు ఉన్న అమ్మాయి నందితా శ్వేత. మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ పెద్దగా లేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. దాదాపుగా మొత్తం ఇండోర్ లొకేషన్స్ లోనే ఉన్న ద్వితీయార్ధంలోనూ తెరమీద సమీర్ రెడ్డి ప్రతిభ బోర్ కొట్టే సన్నివేశాల నుండి కాసింత ఊరటనిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతం సో సో. సాగదీసినట్టున్న సన్నివేశాలను చూస్తుంటే ఎడిటింగ్ విభాగం సరిగా పని చేయలేదేమో అనిపిస్తుంది. 
            మొత్తానికి 'శ్రీనివాస కళ్యాణం', విజయం కోసం నిరీక్షిస్తున్న నితిన్ కు మరోసారి నిరాశను అందించేలా ఉంది. సంస్కృతి సంప్రదాయాలను చూపాలి, వాటి గొప్పతనాన్ని (???) తెలియజెప్పాలనే ప్రయత్నం గొప్పదే అయినప్పటికీ - బలమైన కథనం, పాత్రల మధ్య సరియైన సంఘర్షణ లేకపోతే అది చిరాకు తెప్పిస్తుంది. ఈ సినిమా అలానే ఉంటుంది మరి. ఒక కథను తయారు చేసుకునే ముందు ముందుగా డిజైన్ చేసుకోవలసింది అందులోని నెగటివ్ పాయింట్/పాత్ర అంటే విలన్. అవి ఎంత బలంగా ఉంటే కథ అంత బాగా ఎలివేట్ అవుతుంది. ఏమో కానీ, ఈ సినిమా చూసొచ్చాక, 'బ్రహ్మోత్సవం' గుర్తొచ్చింది. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన