... కొన్ని క్షణాలు

వంశీ కలుగోట్ల // ... కొన్ని క్షణాలు //
**********************************
          దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో నిందితుడు సుబ్బయ్య చనిపోయాడు - అది హత్యనా లేక స్వీయ మరణమా అన్నది విచారణలో తేలుతుంది. ఏదో ఒక రకంగాఅత్యధికులు అతడి మరణాన్ని కోరుకున్నవారే. మరిప్పుడు, అతడు చనిపోయాడు - ఎలా అయితేనేం అనుకోవట్లేదు లేదా చట్టం తనపని తను చేసుకుపోతుందని అనుకోవట్లేదు. ముందు అతడి చర్యను విమర్శించిన వారు, ఇపుడు అతడి మరణం రీతినివిమర్శిస్తున్నారు. అతడిని ఉరి తీయాలి, నరికెయ్యాలి అంటూ ఊగిపోయినవారు అతడి మరణంలో కుట్ర కోణాన్ని వెదుకుతున్నారు. ప్రతిదీ మనం చెప్పినట్టే జరగాలి, మన వేలికొసన ప్రపంచం నడవాలి అనే ఆలోచన తీరుకు అది దర్పణం. (అయినా దాని గురించి మరొక వ్యాసంలో చర్చిద్దాం.)   
          ఈ ఘటనకు (ఇటువంటి ఇతర ఘటనలకు సంబంధించి) సంబంధించి పలువురి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు చదివాను. వాటన్నిటికంటే ఆలోచింపజేసిన ఒక విషయం/వాక్యం - దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య చివరిసారిగా తన బంధువులతో  కాల్ లో మాట్లాడాడు అని చెప్పబడిన ఒక వాక్యం '... అందరికీ మంచి చెప్పి బతికేవాడిని, కానీ అనుకోకుండా జరిగిపోయింది. నాకు చావడం ఒక్కటే మార్గం ... నేను చేయకూడని పని చేశాను. నా మొహం చూపెట్టుకోలేను. నేను చేసిన పనితో నా కొడుకు పరువు పోయింది. చావడానికే వెళ్తున్నాను'. ఆ మాటల్లో ఒకటి '... అనుకోకుండా జరిగిపోయింది...'. అవును, చాలా నేరాలు అనుకోకుండానే జరుగుతాయి. విచక్షణను, మానవత్వాన్ని, ఆలోచించే గుణాన్ని కొద్దికాలం పాటు కోల్పోవడం వల్లనే జరుగుతాయి. ఇపుడు ఆలోచించవలసింది శిక్షల గురించే కాకుండా, ప్రతి మనిషిలో 'ఆ కొద్దికాలం' ఎదురవకుండా ఏం చెయ్యాలి, ఏం చెయ్యొచ్చు అనే దిశగా ఆలోచించాలి. అపుడు ఇలా అనుకోకుండా జరిగే నేరాల సంఖ్యా తగ్గుతుంది. డబ్బులు సంపాదించే యంత్రాలుగా మాత్రమే కాకుండా, వ్యక్తిత్వాలను తీర్చి దిద్దే విద్యావిధానాన్ని రూపొందిచగలగాలి. వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను నిర్వహించాలి (వయసుతో సంబంధం లేకుండా). ఇప్పటి సమాజంలో ప్రతి ప్రాంతానికి శారీరక రుగ్మతలకు వైద్యం చేయగలిగే వైద్యుడితో సమానంగా మానసిక సంబంధమైన సమస్యలకు వైద్యం చెయ్యగలిగే వైద్యుడు అందుబాటులో ఉండటం అత్యంత ఆవశ్యకం. 
          నేరం చేసిన వారికి కఠిన శిక్షలు విధించడం ఒక రకమైన భయాన్ని కలిగించి, నేరాల తీవ్రతను తగ్గించగలిగే అవకాశం ఉంది అదే సమయంలో విచక్షణను కోల్పోయే 'ఆ కొద్దికాలం' మనిషిలోని మృగం నిద్దురలేచి ఆ భయాన్ని తొక్కిపెడుతుంది. ఇపుడు చట్టాలు, లేదా తీసుకోబోయే చర్యలు రెండు కోణాలలో ఉండాలి. ముందుగా అనుకున్నట్టు, అందరూ బలపరుస్తున్నట్టు ఇటువంటి నేరాలలో విధించే శిక్షలు కఠినంగా, భయం కలిగించేలా ఉండాలి. రెండవది - మానసికంగా లేదా వ్యక్తిత్వం పరంగా జనాలు ఎదగటానికి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించాలి. వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల నిర్వహణ వంటివి చేపట్టాలి. వ్యక్తిత్వవికాస తరగతులు అంటే చదువుకున్న వారికే అర్ధమయ్యే తరహాలోనో లేక ఉద్యోగం కోసం పనికొచ్చే విధంగానో మాత్రమే కాకుండా - వ్యక్తి సమాజంలో నడవడిక గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ వంటి వాటిపై అవగాహనా సదస్సులు తప్పనిసరిగా నిర్వహించాలి. ఇపుడు జరుగుతున్న నేరాలలో బాధ కలిగించేది - మైనర్ బాలురు మరియు వృద్ధులు కూడా నేరాలకు పాల్పడే వారిలో ఉండటం. అందుకే కేవలం శిక్షల విధింపు అనే అంశం కంటే నివారణ పరంగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంది. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన