వంశీ వ్యూ పాయింట్ - 'మహానటి'


వంశీ వ్యూ పాయింట్ - 'మహానటి'
*************************************
సావిత్రి చరిత్ర పతనం కాలేదు 
సావిత్రి పతనం చరిత్ర అయింది 

          'మహానటి' చిత్రంపై సమీక్ష లేదా నా అభిప్రాయం చెప్పే ముందుగా ఒక మాట - 'ఒక సినిమాపై సమీక్ష చేయబోయే ముందు, ముందుగా ఆ సినిమా రూపొందించిన వ్యక్తి ఉద్దేశం ఏమిటి?' అనేది మనం గ్రహించగలగాలి. రూపకర్త ముఖ్య ఉద్దేశం తెలుసుకోకుండా అలా ఉంది, ఇలా ఉంది అంటే అందులో అర్థం ఉండదు. ఒక శృంగార చిత్రం చూసి, అందులో భక్తి గీతాలు లేవు అంటే ఎలా ఉంటుంది? 'మహానటి' చిత్రం రూపొందించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య ఉద్దేశం తెలుగు, తమిళ చిత్ర రంగాలలో (దక్షిణాది సినిమా రంగంలో అని చెప్పవచ్చు) 'మహానటి' గా పేరు పొందిన సావిత్రి గారి జీవితాన్ని తెరపై (కొన్ని పరిమితులకు లోబడి) ఆవిష్కరించడమే కానీ సమాజానికి సందేశం ఇవ్వడమో లేక వినోదాన్ని అందించడమో కాదు. నాగ్ అశ్విన్ ఆ విషయాన్ని అర్థం చేసుకొని, ఎక్కడా సందేశం లేదా వినోదం వంటివి జొప్పించకుండా సావిత్రిగారి జీవితాన్ని ఒక జర్నలిస్ట్ పరిశోధనగా చూపాడు. జర్నలిస్ట్ నేపథ్యాన్ని చూపటానికి కూడా 80ల నేపథ్యాన్ని ఎంచుకోవడం ఆకట్టుకుంటుంది. ఎందుకంటే జర్నలిస్ట్ పాత్రను, సావిత్రి గారి జీవితం ప్రభావితం చేసిందనే కోణం చూపడం అన్నది సావిత్రి గారి జీవితం ప్రభావితం చేస్తుంది అన్ననాగ్ అశ్విన్ నమ్మకాన్ని చూపుతుంది.
          సావిత్రి గారి కోమా నుండి మరణం వరకూ మధ్యలో ఉన్న సమయంలో ఒక జర్నలిస్ట్ సావిత్రి గారి జీవితాన్ని విశ్లేషించడమే 'మహానటి'. సావిత్రి గారి జీవితం రహస్యం ఏమీ కాదు. దాదాపుగా తెరచిన పుస్తకమే, అలాంటి జీవితాన్ని సినిమాగా తియ్యాలనుకోవటం నాగ్ అశ్విన్ సాహసం. సినిమా జీవితం పరంగా సావిత్రి గారి గురించి చెప్పటానికి కొత్తగా ఏమీ లేదు, ఇక వ్యక్తిగత జీవితంలో కూడా తెలిసిన కథే అయినప్పటికీ - సావిత్రి గారి సంఘర్షణను చూపడం అన్న అంశం మీదే దృష్టి కేంద్రీకరించారు. చిన్నతనం నుండి అమాయకత్వం, మొండితనం, పట్టుదల, ప్రతిభ వంటివి కలగలసిన వ్యక్తిత్వంగా సావిత్రిగారిని ఆవిష్కరించడంలో నాగ్ అశ్విన్ విజయం సాధించాడు. సావిత్రి గారి జీవితంలోని కోణాలను వివాదాల జోలికి పోకుండా ఆవిష్కరించాడు. జెమిని గణేశన్ పాత్రను కూడా విలన్ లా చూపకుండా పరిస్థితుల ప్రభావం ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచిందనే విధంగా చూపడంలో నాగ్ అశ్విన్ కథకుడిగా పరిణితి చూపాడు. ఉపకథగా ఉన్న మధురవాణి - ఆంటోనీల ప్రేమకథపై అంతగా దృష్టి పెట్టినట్టు లేదు ... అయినా అది అంతగా పట్టించుకోవాల్సినది కాదు కూడా. సావిత్రి గారి జీవితాన్ని వివరించటానికి నరేష్, షాలిని పాండే తదితరుల పాత్రలను ఉపయోగించుకున్న తీరు బావుంది. ప్రతి భాగంలో కూడా వ్యక్తుల కంటే పరిస్థితులను విలన్ గా చూపటంలో నాగ్ అశ్విన్ నేర్పరితనం ఆకట్టుకుంటుంది. 
           'మహానటి' చిత్రం తారాగణం లిస్ట్ పెద్దది. అతి తక్కువ సినిమాలతో 'మహానటి' చిత్రంలో సావిత్రిగారి పాత్రను పోషించే అవకాశం దక్కించుకున్న కీర్తి సురేష్ నిజంగా అదృష్టవంతురాలు. సినిమాను ఎక్కడా చెడగొట్టకుండా, సావిత్రిగారికి ఉన్న 'మహానటి' స్థాయిని దిగజార్చకుండా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నం చేసిన కీర్తి సురేష్ అభినందనీయురాలు. ముఖ్యంగా సావిత్రి గారి సినిమా పాత్రలు చూపినపుడు అక్కడ సావిత్రి గారే ఉన్నట్టు లేదా ఒరిజినల్ సినిమాలోని సన్నివేశాలనే ఉపయోగించుకున్నారేమో అనిపించేంత సారూప్యతలు ఉన్నాయి (మరీ ముఖ్యంగా చూడటానికి). సావిత్రి గారి సినీ పాత్రలలో చూపినంత నటన, సావిత్రి గారి వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణను చూపటంలో పండలేదని లేదని చెప్పవచ్చు. బహుశా, సినీ పాత్రల విషయంలో మక్కీకి మక్కీ దించెయ్యాటానికి సావిత్రి గారి చిత్రాలు చూడవచ్చు ... కానీ, వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణను ప్రదర్శించటానికి కావలసినంత మెచ్యూరిటీ కీర్తికి ఇంకా లేదేమో (రాలేదేమో) అనిపించింది. మరీ ముఖ్యంగా సావిత్రిగారిలోని భోళాతనం లేదా జాలి గుణం చూపే సన్నివేశాలలో అది బాగా తెలిసింది. అందుకే కాబోలు ... అటువంటి సన్నివేశాలలో కాస్త లాంగ్ షాట్స్ ఎక్కువగా వాడుకున్నారు. ఇక జెమిని గణేశన్ గా నటించిన దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ తో సమంగా పాత్ర నిడివి దక్కించుకోవడంతో పాటు నటన కనబరిచాడు. ముఖ్యంగా సావిత్రి ఎదుగుతూ, తాను కెరీర్ లో తగ్గుతున్నపుడు ఆ పాత్రలోని సంఘర్షణను చక్కగా ప్రదర్శించాడు. ఇక అప్పుడప్పుడు కనిపించే ఇతర ప్రముఖ వ్యక్తుల పాత్రలలో నటించిన ప్రముఖులు అందుకు తగ్గట్టుగా నటించారు. ఉపకథగా సమంత - విజయ్ దేవరకొండల ప్రేమకథ ఏమంత ఆకట్టుకోదు. విజయ్ అయితే ఏదో ఊరికే పాత్ర ఉంది కాబట్టి తెరమీదకి అలా వచ్చి, వెళతాడు అంతే తప్పించి నటన ప్రదర్శించేంత స్థాయి ఉన్న పాత్ర కాదు. సమంత సో సో ... చెడగొట్టకుండా చేసింది. సమంత ఇబ్బందిని, నత్తి కవర్ చేసేసింది.  సమంత - విజయ్ మధ్య బంధం కూడా అంతగా పండలేదు. మిగతా కూడా ఎవరూ చెడగొట్టలేదు, అంతవరకూ నయం. 
            ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే అప్పటి నేపథ్యాన్ని బాగా చూపారు, 1940 ల నుండి 1980 ల వరకూ ఉన్న నేపథ్యాన్ని చెడగొట్టకుండా చూపగలిగారు. సంగీతం విషయంలో మాత్రం అసంతృప్తిగా అనిపించింది. మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు ... సన్నివేశాన్ని ఎలేవేట్ చెయ్యాల్సిన నేపథ్య సంగీతం పలు చోట్ల పేలవంగా అనిపించడంతో తేలిపోయినట్టనిపించింది. మిక్కీ జె మేయర్ మంచి సంగీత దర్శకుడే ... కానీ, ఈ సినిమాకు అతడి పనితనం సరిపోలేదో లేక అతడినుండి రాబట్టుకోలేకపోయారో మరి. పాటలు కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. ఇళయరాజా లేక మణిశర్మ లాంటి వారు అయితే అన్న భావన వెంటాడుతూనే ఉంటుంది. కూర్పు ఒకే. సంభాషణలు సందర్భోచితంగా అమరాయి. నటీనటవర్గంలానే సాంకేతిక విభాగాల వారు కూడా అద్భుతాలు సృష్టించకపోయినా ఎవరూ చెడగొట్టలేదు. 
             "ఒక కథ తెలుసుకుందామని వెళ్ళాను ... ఒక చరిత్ర తెలుసుకున్నాను" అన్న మధురవాణి మాటలు నాగ్ అశ్విన్ భావనకు అద్దం పడతాయి. అందరికీ తెలిసిన సావిత్రి గురించి తెలియని విషయాలు ఏవో చెప్పాలనే దుగ్ధ కంటే ప్రభావితం చెయ్యగలిగే వ్యక్తిత్వం ఉన్న 'మహానటి'గా  సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించాలనే తపనే ఎక్కువగా కనబడింది. నాగ్ అశ్విన్ తరువాతి చిత్రాలలో కూడా కథనే ప్రేమించే ఇటువంటి తపనే నిలబెట్టుకుంటే బావుంటుంది. తెలుగు సినిమా రంగంలో ఒక తలమానికంగా, ప్రతిభకు ఒక కొలమానంగా చెప్పగలిగే స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రి గారికి 'మహానటి' చిత్రం ఒక చక్కని నివాళి.

Comments

Popular posts from this blog

వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం

వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'