... కత్తి మహేష్ గారికి కొన్ని ప్రశ్నలు
వంశీ కలుగోట్ల // ... కత్తి మహేష్ గారికి కొన్ని ప్రశ్నలు //
*****************************************************
-> పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు కేవలం 'కోడి గుడ్ల' దాడికే పరిమితం చేయటం ఏమిటి? బెదిరింపు కాల్స్ విషయం ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు? దాన్ని ఇంకొన్నాళ్ళు కొనసాగించే ఆలోచన ఉందా? ఇపుడు కోడిగుడ్ల దాడి వ్యవహారం సమసిపోయినట్టే, బెదిరింపు కాల్స్ వ్యవహారం కూడా సమసిపోయే అవకాశం ఉంది కదా.
-> ఇక కోడిగుడ్ల దాడి చేసినవారిపై గంటల వ్యవధిలో ఫిర్యాదును వాపసు తీసుకోవడం ఆనందమే కాదు కాస్త ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇక్కడ అర్థమవుతోందేమిటంటే సమస్య పవన్ కళ్యాణ్ తో కాదు, అతగాడి పేరు చెప్పుకుని (ఈ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి) చెడ్డపనులు చేస్తున్నవారితో అని. అంతే కదా, అటువంటప్పుడు బెదిరింపు కాల్స్ వ్యవహారంలో తాత్సారం ఎందుకు?
-> మరో విషయం - కోడిగుడ్ల దాడి ఘటన టీవీ9 స్టూడియో దగ్గరకు తమరు క్యాబ్ లో వచ్చినపుడు జరిగిన హఠాత్ పరిణామం కదా. అటువంటపుడు దాడి జరిగిన వెంటనే ఆ క్లోజ్ అప్ షాట్స్, అంతటి విపులమైన కవరేజ్ వీడియోస్ ఎలా సాధ్యమయ్యాయి? అంటే టీవీ 9 వారు మీరు క్యాబ్ దిగిన దగ్గరనుండి ప్రతి అడుగును లైవ్ లో లేదా ఎక్సక్లూసివ్ కవరేజ్ గా చూపాలని అనుకున్నారా? ముందే దాడి జరుగుతుందని అంచనా వేశారా లేక మరేమిటి?
-> దాడి జరిగిన సమయంలో మిమ్మల్ని కవర్ చెయ్యగలిగిన టీవీ 9 వారు దాడి చేసిన వారిని కవర్ చెయ్యలేకపోయారా? దాడి చేసినది, తరువాత 'మేమే చేశాం' అని చెప్పినవారే ఆ దాడి చేసినవారు అనటానికి ఆధారాలేమిటి? పోలీసులు విచారణ చేసి, ధృవీకరించారా లేక దాడి జరిగిన సమయంలో మీరు చూశారా లేక చూసిన మరెవరైనా చెప్పారా?
-> మరో అతి ముఖ్యమైన విషయం - అసలు దాడి చేసిన వారు పవన్ కళ్యాణ్ అభిమానులే అని చెప్పటానికి ఆధారాలేమిటి? అంటే ఎవడు పడితే వాడు దాడి చేసి 'నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్' అని చెప్తే సరిపోతుందా? రేపెవరైనా పవన్ బహిరంగసభలో (ఆర్నెల్లకోసారైనా చేస్తాడు కదా) చెప్పులు విసిరేసి 'నేను కత్తి మహేష్ ఫ్యాన్' అంటే? ఈ రోజుల్లో అభిమాన సంఘాలు రిజిస్టర్ చేసుకుని, గుర్తింపు కార్డులు తదితరాలు మైంటైన్ చేస్తున్నాయి. కోడిగుడ్ల దాడి చేసినవారి వద్ద అటువంటి గుర్తింపు కార్డులు ఉన్నాయా? లేక వారి ప్రాంత అభిమాన సంఘం వీరు అభిమాన సంఘంలో సభ్యులే అని ధృవీకరించిందా?
-> రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుగుతాడేమో అనే భయమో లేక తమ ఎదుగుదలకు అడ్డు కాగలడనే సందేహమే ఉన్నవారు తెరవెనుక నుండి 'అభిమానుల' పేరుతో ఇటువంటి ఆకృత్యాలు చేయించవచ్చు కదా. అంతేకాక నిన్నటి ఫిర్యాదు వాపసు తీసుకుంటున్నప్పుడు, దాడి చేసిన వారిలో ఒకరు 'దళితుడు' అని తమరే స్యయంగా చెప్పారు. ఒకవేళ అలా కాకపోయుంటే మీ స్పందన ఎలా ఉండేది?
-> మీరు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నారా లేక విధానపరంగానా? విధానపరంగా ద్వేషిస్తుంటే పవన్ పూణేలో ఏ హోటల్ లో ఉంటే ఏమిటి? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమిటి? ఎవరితో తిరిగితే ఏమిటి?
-> పవన్ పై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై మీ వద్ద తగిన ఆధారాలు ఉంటే, వాటిని ఎందుకు బయటపెట్టటం లేదు. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక మీకు బహిరంగంగా తన అభిమానుల చర్యలకు క్షమాపణ చెప్పాడనుకుందాం, అపుడు ఈ ఆధారాలను ఏమి చేస్తారు. అపుడు పవన్ కళ్యాణ్ పునీతుడు అయిపోయాడని చెపుతారా? ఆధారాలను ఎందుకు దాచి ఉంచుతున్నారు అన్నదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
-> పవన్ పై చేస్తున్న ప్రతి విమర్శకు మీ వద్ద ఉన్న ఆధారాలను బయటపెడితే కనీసం కొంతమంది అభిమానులైన పొరలు తొలగి మారిపోయే అవకాశం ఉంది కదా. అటువంటి మంచి పనిని మీరెందుకు చెయ్యటం లేదు?
--- నేను ఎలా చెయ్యాలో చెప్పటానికి నువ్వెవరు? నేను ఏది ఫిర్యాదు చెయ్యాలో చెప్పటానికి నువ్వెవరు? అంటారా? అయితే పవన్ కళ్యాణ్ ఏది, ఎపుడు ఎలా చెయ్యాలో చెప్పటానికి మీరెవరు?
--- ఇవన్నీ అడగటానికి నేనెవరు అంటారా లేక పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి ముద్ర వేస్తారా? వేసుకోండి అనేకానేక ముద్రలలో అదొకటి అంతే కదా.
ఇవన్నీ అడగటానికి నాకున్న హక్కు 'నేనూ ఒక సామాన్యుడినే'.
Comments
Post a Comment