... 'అజ్ఞాతవాసి' సినిమా గురించి

వంశీ కలుగోట్ల // ... 'అజ్ఞాతవాసి' సినిమా గురించి //
*******************************************
కొన్ని సినిమాలు చూసినపుడు 'ఇది సినిమానా!' అని అబ్బురపోయేలా చేస్తాయి, అటువంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి.
కొన్ని సినిమాలు చూసినపుడు 'ఇదీ సినిమానేనా?' అని కుంగిపోయేలా, దాన్ని చూడటానికి ఎగేసుకుంటూ థియేటర్ కు వెళ్ళినందుకు బాధపడేలా చేస్తాయి.
          తాజాగా విడుదలైన 'అజ్ఞాతవాసి' చిత్రం ఏ కోవలోకి వస్తుందో చూసి, ఆ బాధను అనుభవించిన వారే నిర్ణయించుకోవచ్చు. ఇపుడు పవన్ కళ్యాణ్ ఒక మామూలు వ్యక్తి కాదు, కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, కేవలం రాజకీయ శక్తి కాదు - 'అతడు ఒక అద్భుతం, దేవుడు, మహానుభావుడు' అంటూ ఉప్పొంగిపోతున్న అభిమానులను నేల మీదకు తీసుకువచ్చేలా 'అజ్ఞాతవాసి' చిత్రం రూపొందించబడింది అని చెప్పటం తప్పు కాదని నా అభిప్రాయం. మొదట చెప్పబడిన అభిప్రాయాలు సరియైనవని అనిపిస్తే, నా రెండవ అభిప్రాయం కూడా సరియైనదే అవుతుంది. సరేలే, అభిప్రాయాలు పక్కనబెడదాం ... ఈ సంవత్సరానికి మొదటి అత్యంత భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుందాం. పవన్ రాజకీయంగా క్రియాశీలకంగా మారబోతాడని అనుకుంటున్న తరుణంలో విడుదలైన 'అజ్ఞాతవాసి' అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
          'అజ్ఞాతవాసి' కథ ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ని పోలి ఉందని స్వయంగా ఆ చిత్ర దర్శకుడే ట్వీటాడు, కాబట్టి ఆ పోలికల గురించి మనం మళ్ళీ చెప్పుకోవడం అనవసరం. కథ పరంగా వ్యాపార పరంగా ఉన్న శతృవుల కారణంగా ప్రతి పనిలో 'ప్లాన్ బి' సిద్ధంగా ఉంచుకునే గోవింద భార్గవ్ (బోమన్ ఇరానీ), తన పెద్ద కొడుకును అజ్ఞాతంలో పెంచుతాడు. విందాగా పాపులర్ అయినా గోవింద భార్గవ్, అతడి వారసుడిగా అనుకునే రెండవ కొడుకు చనిపోవడంతో అతడి రెండవ భార్య ఇంద్రాణి (ఖుష్బూ) అజ్ఞాతంలో ఉన్న పెద్ద కొడుకు అభిషిక్త భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను పిలుస్తుంది. తండ్రి, సోదరుడి హత్యల వెనుక ఉన్నవారిని బయటకు లాగి, సమస్యలను పరిష్కరించి ఏబి గ్రూప్ కి అభిషిక్త భార్గవ్ సీఈఓ ఎలా అయ్యాడన్నదే కథ. ఒక మామూలు దురాశ - పగలతో కూడిన కథ  ఇది. మామూలుగా త్రివిక్రమ్ గత చిత్రాలు కూడా గొప్ప కథా చిత్రాలు కాకపోయినా వాటికి త్రివిక్రమ్ తనదైన మార్క్ ను జోడించడంతో ఆదరణ పొందాయి. కానీ, అజ్ఞాతవాసి చిత్రం ఎక్కడా త్రివిక్రమ్ మార్క్ అంటూ లేకపోవడంతో నిరాశపరుస్తుంది. ఆఫీస్ లో కామెడీ పేరిట మురళీ శర్మ, రావు రమేష్ లతో పవన్ చేసే కామెడీ సన్నివేశాలు చిరాకు పుట్టిస్తాయి. వీటికి పవన్ స్వయంగా తానే పాడిన 'కొడకా కోటేశ్వరావా...' పాట అదనం, పుండు మీద కారం చల్లినట్టు. త్రివిక్రమ్ కలం కూడా మందగించింది ఈ సినిమాలో. డైలాగ్స్ లో త్రివిక్రమ్ మార్క్ కనబడలేదు, ఎక్కడో ఒకటీ రెండూ చోట్ల తప్పించి. ఏ పాత్రను కూడా (పవన్ పాత్రతో సహా) సరిగా రూపు దిద్దలేదు. కథానాయికల పాత్రలైతే మరీ దారుణం. మొదట్లో హీరో లేడీస్ టాయిలెట్స్ లోకి వెళ్తున్నాడా లేక లేడీస్ జెంట్స్ టాయిలెట్స్ లోకి వెళ్తున్నారా అర్థం కాదు, ఆ టాయిలెట్ సన్నివేశాలూ చిరాకెత్తించేవే. అభిషిక్త భార్గవ్ గా ఆఫీస్ లోకి ప్రవేశించే సమయంలోనైతే ఆ రోడ్డు దాటటానికి తన మనుషుల మీద కాళ్ళు పెట్టి, రోడ్డు దాటుతూ రావడం ఎవరి అభిరుచి మేరకు తీశారో కానీ, అసహ్యమనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి సన్నివేశాన్ని తిట్టాలనిపిస్తుంది. త్రివిక్రమా, నీకేమయ్యిందయ్యా అంటూ ఆవేదనంతా వెళ్ళగక్కాలనిపిస్తుంది. 
          నటీనటుల విషయానికి వస్తే మొదటగా పవన్ కళ్యాణ్, ఇలా వచ్చి ఆలా చేసేసి వెళ్లిపోయాడేమో. సెకండ్ టేక్ అనే ధైర్యం ఎవరికీ ఉన్నట్టు లేదు కాబట్టి చేసిందే గొప్ప అనుకున్నట్టున్నారు. కొన్ని సన్నివేశాల్లో మినహాయించి నిరాశపరుస్తాడు. ఇక హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ అసలెందుకు ఉన్నారా అని చిరాకు పుట్టిస్తారు కనబడినప్పుడల్లా. అక్కడికీ అను ఇమ్మాన్యుయేల్ తనకు తెలిసింది చెయ్యాలని ప్రయత్నించింది కానీ, పెద్దగా అవకాశం వచ్చినట్టు లేదు. కొంతలో కొంత ఆకట్టుకునేది అంటే ఒక్క ఆది పినిశెట్టి మాత్రమే. మిగతా అందరూ అసలేమీ అర్థం కాని కన్ఫ్యూషన్ స్థితిలో ఏదో చేశారు అంతే.
          ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే మొదటగా నిరాశపరచేది త్రివిక్రమ్ శ్రీనివాస్. అసలు చాలామంది ఈ సినిమాకు త్రివిక్రమ్ మీద నమ్మకంతోనే వెళ్ళారు అని చెప్పవచ్చు. కథ, దర్శకత్వం, దృశ్యానువాదం , సంభాషణలు ఇలా ప్రతి విభాగంలో నిరాశపరుస్తాడు. (బోమన్ ఇరానీ పైనుండి పడిపోతుంటే, ఉన్నట్టుండి ఎండుటాకుగా మారి అది ఖుష్బూ ఇంట్లోకి రావటం - ఈ సన్నివేశం మాత్రం మినహాయింపు). సంగీతం ముఖ్యంగా బీసీజీ అత్యంత నిరాశ పరుస్తుంది, ఈ కాంబినేషన్ లో దేవిశ్రీ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. పాటలకు పర్వాలేదనిపించే సంగీతం అనిరుద్ అందించినప్పటికీ తెరపై వాటిని చెడగొట్టారు. లిరిక్ కు, చిత్రీకరణకు అసలు సంబంధమే ఉండదు. అదీ కాక పాటల ప్లేసెమెంట్ కూడా చిరాకు పుట్టిస్తుంది. కెమెరా వర్క్ మాత్రం బాగుంది, ఎడిటింగ్ సరిగా చేసుంటే సగం సినిమా లేచిపోయుండేదేమో. దర్శకుడు, హీరో మీద అంతటి నమ్మకంతో డబ్బును ఇంతలా ఖర్చు పెట్టిన నిర్మాతను తలచుకుంటే జాలేస్తుంది. డబ్బు పెట్టి టికెట్ కొని థియేటర్ లో సినిమా చూసిన వారికి, నిర్మాతకు ఖర్చయిన డబ్బులో తేడానే తప్పించి ఫీలింగ్ లో కాదేమో. ఇంతకుమించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదేమో 'అజ్ఞాతవాసి' చిత్రం గురించి.
బలాలు: 
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఇమేజ్ 
ఫోటోగ్రఫీ
నిర్మాణ విలువలు
బలహీనతలు:
పైన పేర్కొన్న బలాలు తప్ప మిగతా అన్నీ

రేటింగ్: 1.5/5

Popular posts from this blog

వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం

వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'