ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'నేను లోకల్' గురించి

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'నేను లోకల్' గురించి
****************************************************
          'నేను లోకల్' అంటూ సహజ నటుడు (నాచురల్ స్టార్ అని కదా బిరుదు అందుకని) నాని మన ముందుకొచ్చాడు. గత కొద్దీ సినిమాలనుండి విజయపరంపర కొనసాగిస్తున్న నాని, తన విజయాలను కొనసాగిస్తూనే గతంలో లాగా వైవిధ్యభరితమైన చిత్రంగా 'నేను లోకల్' ఉండవచ్చునేమో అన్న ఆసక్తే ఈ చిత్రానికి మొదటి అమ్మకపు అంశం అయింది. మరి నాని ఆ అంచనాలను అందుకోగలిగాడా లేదా ... చూద్దాం.
          ముందుగా 'నేను లోకల్' చిత్ర కథ గురించి చెప్పుకోవాలంటే తేజ దర్శకుడిగా తెరంగేట్రం చేసిన నాటినుండి రుబ్బి, రుబ్బి వదిలేసిన అంశమే. కాకపొతే ఇటువంటి పాత చింతకాయ పచ్చడి లాంటి కథను సినిమాగా తియ్యాలనుకున్నప్పుడు ముందుగా జనాలను తన నటనలో ఈస్ తో కట్టిపడేసే నటుడిని ఎన్నుకోవాలి. ఈ సినిమాకు అది మొదటి విజయం. ఇక రెండవ అతిముఖ్యమైన అంశం దృశ్యానువాదం (స్క్రీన్ ప్లే) - సాగదీసినట్టు ఉండకుండా, బిగుతైన దృశ్యానువాదంతో చిత్రం పరుగులు పెట్టాలి. సురేందర్ రెడ్డి, ప్రసన్నకుమార్ బెజవాడ ద్వయం దృశ్యానువాదంలో తగిన జాగ్రత్త తీసుకున్నారు. ఆ రెండు అంశాలే ఈ మూస సినిమాను నిలబెట్టి నిర్మాత ముఖంపై నవ్వులు నింపుతాయి అనటంలో సందేహం లేదు. అంతకుమించి కథ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. 
          సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన నాని గురించి. ప్రతి సినిమాకు నటుడిగానే కాక స్టార్ గా కూడా ఎదుగుతున్న నాని ఈ సినిమాలో నటుడిగా ఎదగటానికి పెద్దగా అవకాశం లేకపోయినా స్టార్ గా మాత్రం మరొక మెట్టు పైకెదిగేలా అవకాశం కలిగింది. తనవరకూ ఇది వైవిధ్యభరితమైన చిత్రమే. సినిమాలోని మిగతా అంశాలన్నీ పక్కనబెట్టి కేవలం నటుడిని అంటే అదే స్టార్ ని మాత్రమే చూసి ఈలలేసే జనాలను ఆకట్టుకునే సకల లక్షణాలు ఉన్న పాత్ర లభిస్తే తానెలా రెచ్చిపోగలడో నాని చూపాడు. హావభావాలు, పోరాటాలు, నృత్యాలు ఒకటేమిటి అన్నింట్లోనూ తన మార్క్ చూపాడు. కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇక 'బాబు'గా నిలిచిపోయే స్టార్ గా ఎదగగల అన్ని లక్షణాలూ ఉన్న నటుడు నాని. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ గురించి, ఎదో సినిమాను నాని తన భుజాల మీదేసుకుని తీరానికి చేర్చాడు కానీ లేదంటే సినిమాకు మైనస్ పాయింట్ గా మిగిలిపోయే వాటిలో ముందు వరుసలో ఉండే అంశాల్లో తానూ ఒకటిగా ఉండేది. అటు గొప్ప నటన కానీ, ఇటు గ్లామర్ కానీ రెండింట్లో ఏదీ లేకుండా పాత్రను అలా నెట్టుకొచ్చింది. ఎలాగూ గ్లామర్ అంటే బెట్టు చేస్తోంది అంటున్నారు కాబట్టి కాస్త నటన మీద దృష్టి పెట్టగలిగితే కొన్నాళ్లపాటు ఉండొచ్చు. నాని కాకుండా సినిమాలో ఆకట్టుకునేది రావు రమేష్, రెండే సన్నివేశాల్లో కనిపించినా సినిమా మొత్తం కనిపించిన పాత్రలకన్నా తానే ఎక్కువగా రిజిస్టర్ అవుతాడు. ఒకరకంగా రెండవ హీరో లేదా విలన్ అనదగ్గ పాత్ర పోషించిన నవీన్ చంద్ర పర్వాలేదనిపించారు. కానీ, తను కాస్త వాచకం మీద దృష్టి పెడితే బావుంటుంది. పోసానికి అసలేమీ చెయ్యాల్సిన అవసరం రాలేదు. సచిన్ ఖేద్కర్ (హీరోయిన్ తండ్రి పాత్రధారి) బదులు వేరే ఎవరైనా తెలుగు నటులను ఎంపిక చేసుకుని ఉంటే బావుండేదేమో (కాశీ విశ్వనాథ్, రాజేంద్ర ప్రసాద్ గట్రా), తనవరకూ తను బానే చేశాడు. ఇక జబర్దస్త్ గ్యాంగ్, ఫిష్ శ్రీను గ్యాంగ్ తదితర ఇతరుల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. మిగతావారందరూ అలా వస్తూ పోతూ ఉంటారు.
          ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవలసింది సంగీత దర్శకుడు దేవి గురించి. ఇలాంటి సినిమాలకు తన సంగీతంతో ఊపిరి పొసే దేవి ఈ సినిమా విషయంలో కాస్త తడబడినా తప్పటడుగు మాత్రం వెయ్యలేదు. కానీ, ఇలాంటి తడబాట్లు తరువాత లేకుండా చూసుకోవాలి. పాటల్లో పరవాలేదనిపించేవే తప్ప కనీసం కొన్నాళ్ళైనా గుర్తుండే పాత ఒక్కటీ లేదు. నేపథ్య సంగీతం సో సో. కెమెరా వర్క్ కూడా పర్వాలేదు, మామూలుగా దిల్ రాజు బేనర్ అంటే కనిపించే రిచ్ నెస్ మాత్రం లేదు. ఎడిటింగ్ లో మరికాస్త పనితనం చూపి ఉంటే బావుండేది. ఇక దర్శకుడు త్రినాథరావు నక్కిన గురించి - మొదటి రెండు సినిమాలను స్క్రీన్ ప్లే తో పాటు రాజ్ తరుణ్ మరియు నాని లాంటి వారి మీద ఆధారపడి నెట్టుకొచ్చేశాడు. తరువాతి సినిమాలో కథ మీద, దర్శకత్వం మీద దృష్టి పెడితే బావుంటుంది. దర్శకత్వం అంటే నిజంగా చెప్పాలంటే తనను పెద్దగా తప్పు పెట్టాల్సింది కూడా ఏమీ లేదు. గొప్పగా కాకపోయినా చెత్తగా కూడా ఏమీ లేదు. కాకపొతే, ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కొన్ని సన్నివేశాలను హృద్యంగా, మనసుకు హత్తుకునేలా తియ్యగలిగే అవకాశం ఉన్నా అలా చెయ్యలేకపోయాడు లేదా చెయ్యనివ్వలేదో. పాత్రలుగా తల్లీ, తండ్రి లా ఉన్నారే తప్పించి ఆ పాత్రల మధ్య ఆ బంధాన్ని మాత్రం బలంగా క్రీయేట్ చేయలేకపోయారు, అది దర్శకుడి వైఫల్యమే. తరువాతి సినిమా చూపిస్త మావా, నేను లోకల్ విజయం సాధించాయని ఇక అదే మూస ధోరణిలో వెళితే ఇబ్బందే.
          ఈ సినిమా గురించి ముందే చెప్పుకున్నట్టు ఇంతటి నాసిరకం సినిమాను నిలబెట్టి, చూడొచ్చనిపించేలా చేసింది మాత్రం నానినే. కానీ, నాని ఇక తాను సినిమాను మోసెయ్యగలను అనే భావనను తలకెక్కించుకోకుండా వైవిధ్యభరితమైన చిత్రాలు చెయ్యగలిగితే బావుంటుంది. 'నేను లోకల్' చూసినందుకు జండూ బాం లేదా తలనెప్పి మాత్ర కొనుక్కోవాల్సిన అవసరం లేని సినిమా, టైం పాస్ చెయ్యొచ్చు తప్పించి మరేమీ ఆశించకూడదు. ఆశించి వెళితే నిరాశే.
'నేను లోకల్' అంటే సినిమాలో పాత్ర గురించేమో అనుకున్నా కానీ, సినిమా తియ్యటంలో అనుకోలేదు సుమీ. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన