పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ...

వంశీ కలుగోట్ల // పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ... //
*****************************************************
వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మంచివాడే కావచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానంలో ప్రతి అడుగు ప్రస్నార్ధకంగానే ఉంది, అనుమానానికి తావిచ్చేదిగా ఉంది. ప్రశ్నించే మీరు సమాధానాలు కూడా చెప్పడం నేర్చుకోవాలి ... ప్రయత్నించండి. 

- ఇచ్చిన హామీల గురించి మోడీ గారిని, వెంకయ్య నాయుడు గారిని విమర్శించారు. మరి అసలు హామీలు అంటేనే చిర్రెత్తుకొచ్చేలా హామీల వర్షం కురిపించిన చంద్రబాబు గారిని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అవును కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలి, ఇచ్చారు రెండున్నర సంవత్సరాల కాలం. కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తించాలి కదా? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించానన్న ప్రతిసారీ తెల్లారి చంద్రబాబు గారిని కలవడం 'అపోహలు తొలగాయి, ఆయన మీద నమ్మకం ఉంది' అనటం. అదేదో మోడీ గారిని కూడా ఒకపూట కలిస్తే ఆయన మీద కూడా నమ్మకం వస్తుంది కదా, ఎందుకు వెనుకాడుతున్నారు?

- మరో విషయం - ప్రతిసారీ నా దగ్గర డబ్బుల్లేవు, డబ్బుల్లేవు అంటూ బీద అరుపులు ఎందుకు? మిమ్మల్ని ఎవరు అడిగారు డబ్బులున్నాయా అని? అలా అంటే మోడీ గారి దగ్గర ఏమున్నాయని? ఆయన తన తిండి ఖర్చు తానే భరిస్తున్నారని అంటారు, అంతే కాదు ఆయన మంత్రివర్గ సహచరుల మీద ఉన్నాయేమో కానీ ఆయన మీద అవినీతి ఆరోపణలున్నట్టు నా పరిమిత జ్ఞానానికైతే తెలీదు. మరి డబ్బుంటేనే రాజకీయాల్లోకి రావాలి అని అన్యాపదేశంగా చెప్తున్నారా లేక డబ్బు కోసం డిమాండ్ (అన్యాపదేశంగా మరో రకంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ లాంటిది) చేస్తున్నారా? 

- మీరు వేటిని ప్రశ్నిస్తారు, ఎప్పుడు ప్రశ్నిస్తారో అర్థం కాక తికమక పడుతున్నాం. వ్యవసాయం అంటే ప్రాణం అనే మీరు అభివృద్ధి పేరు, రాజధాని పేరు చెప్పి వేలాది ఎకరాలు ఉత్తమ శ్రేణికి చెందిన పొలాలు నాశనమవుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు? ఒక రాజధానికి అది ప్రపంచ స్థాయి రాజధాని అయినా ముప్ఫయి వేల ఎకరాలకు పైగా అవసరమా? ఈ ప్రశ్న అడిగి వదిలేయడం కాదు, అడిగి పోరాడాల్సింది పోయి రైతులకు పరిహారం ఇప్పించడంలో కూడా చెప్పినా మాట మీద నిలబడలేదే! 

- అవును ఎంపీలు కారం పూసుకుని వెళ్ళాలి. మరి ఎన్నికల సమయంలో మీరు హామీ అంటూ నిలబడి ఓట్లు అడిగి వేయించారు కదా? ఈ రెండున్నరేళ్లు మీరేమి చేస్తున్నారు? సమయం ఇచ్చారా? సమయం ఇవ్వడం అంటే ఏమిటి? ఏమి జరిగినా చూస్తూ ఉండటమా? బెదిరించో, భయపెట్టో, బ్లాక్ మెయిల్ చేసో, ఆశ చూపో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార పక్షం లాగేస్తుంటే అది సబబుగా తోచిందా? వారి చేత రాజీనామా చేయించి, మళ్ళీ ఈ పార్టీ గుర్తు మీద ఎన్నికయ్యాక చేర్చుకోమని చెప్పలేకపోయారా? 

- మా గుండెల్లోని మాట చెపుతానంటున్నారు. ఎవరి గుండెల్లోని మాట? ఇన్నాళ్లుగా మేమూ మీకంటే గట్టిగానే ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాకపొతే తమరికి ఉన్న గుర్తింపు లేకపోవడం వల్ల పట్టించుకోవటం లేదు. ప్రతిపక్షం అంటే కేవలం పార్టీ మాత్రమేనా? ఏ పార్టీ కి చెందని నాలాంటి వారు కూడా ప్రతిపక్షమే. 

- రాష్ట్రంలోని 98% శాతం మీడియా బాకా ఊదటం తప్ప, ప్రభుత్వం లోపాలను జనాలకు తెలిసేలా చెయ్యటం లేదు. 

- ప్రభుత్వాధికారులను కొట్టడం, నాయకుల పిల్లలు అసభ్య ప్రవర్తనకు పాల్పడుతుంటే వదిలెయ్యటం - వీటన్నింటినీ ప్రశ్నించరా? లేక ఇవన్నీ మీరు ప్రశ్నించటానికి తగనివని మీ అభిప్రాయమా? రిషితేశ్వరి ఆత్మహత్య, కాల్ మనీ సెక్స్ స్కాండల్, ఎమ్మార్వోను కొట్టడం, అంగన్ వాడీ మహిళలను కొట్టించడం - ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ప్రశ్నించరా? అసలు విషయం మర్చిపోయాను 'ఓటుకు నోటు' గురించి అసలు మాట ఎత్తరే? ఏం, భయమా లేక అశక్తతా? అంతటి బేలతనం ఎందుకు? 

- బాధ్యత ఎవరిదో కూడా తెలియదా? అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం మానేసి, ప్రతిపక్షాల వారిని తిట్టడం ఎందుకు? హోదా కోసం ప్రతి పక్షాలు పోరాటం చెయ్యాలి అని అంటున్నారు. వారేం చేస్తున్నారో ఆ రెండు పత్రికలూ రాయవు; మీరు మిగతా పత్రికలు చదవరు. ఇంకెలా తెలుస్తుంది మీకు? ఇవ్వాళ జగన్ గారు చెప్పిన ఒక వాక్యం గమనించారో లేదో 'కేసీఆర్ వదిలేసి ఉంటే తెలంగాణా వచ్చేదా?' అంటూ. మరి అక్కడ చంద్రబాబు గారు 'ఇచ్చింది తీసుకుని పోరాడదాం' అంటూంటే పోరాటమెప్పుడు అని ప్రశ్నించరెందుకు? 

 - అయినా ఒక కార్యాచరణ అంటూ లేకుండా ఎదో పత్రికా సమావేశం పెట్టి అడిగి పారెయ్యగల ప్రశ్నల కోసం అంతటి ఖర్చుతో రెండు వారాల కంటే తక్కవ వ్యవధిలో రెండు సభలు అవసరమా? ఆ డబ్బేదో మంచి పనుల కోసం వినియోగించవచ్చు కదా?

ఒక వ్యక్తిగా, కథానాయకుడిగా మీరంటే చాలా అభిమానం. మొదటి అడుగు వేసినపుడు 'జనసేన'లో నేనూ ఒకడినవుదామనుకున్నాను. కానీ, మొదటి అడుగులోనే చేతులెత్తేసి అన్నయ్యే మేలనిపించేలా చేసి నీరు కార్చారు. అన్నయ్య 'నేను తెల్ల కాగితం లాంటి వాడిని. మీకేం కావాలో అది రాసేసుకోండి' అంటూ ఉండేవారు ఎన్నికల ప్రచార సభల్లో. ఇప్పుడు మీరు కూడా కార్యాచరణ అంటూ ఏమీ లేకుండా ఎదో మూడొచ్చినపుడు ఒక ప్రెస్ మీట్ నో లేకపోతే ఒక సభనో పెట్టేసి ప్రశ్నించేసి పక్కకెళ్ళిపోతే అన్నయ పరిస్థితే ఎదురవ్వొచ్చు. అంతకు మించి జనాలలో కొత్తగా వచ్చే నాయకుల పట్ల ఏర్పడే నిరాశాపూరిత భావనకు మీరు కారణమవుతారు అన్న సంగతి గుర్తు పెట్టుకోండి. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన