ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'జనతా గ్యారేజ్' గురించి ...
ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'జనతా గ్యారేజ్' గురించి ...
************************************************************************
'జనతా గ్యారేజ్' సినిమా వివరాల్లోకి వెళ్లేముందు ముగ్గురి గురించి చెప్పాలి. ఒకటి దేవిశ్రీప్రసాద్ - ఈ సినిమా చూశాక తనమీద నాకున్న అభిమానం, గౌరవం మరింత పెరిగాయి. సినిమాలో కొన్ని బలహీన సన్నివేశాలను తన సంగీతంతో పైకి లేపాడు. ముఖ్యంగా మోహన్ లాల్ ఉన్న చాలా సన్నివేశాలు పేలవంగా ఉన్నప్పటికీ తన నేపథ్య సంగీతంతో వాటికి ఊపిరి పోశాడు. మరోటి ఎక్కడా తన సంగీతం కథను మించకుండా చూసుకున్నాడు, చివరికి పాటలు కూడా. సినిమా చూడకముందు పాటలు విన్నప్పుడు తన మామూలు తరహాలో ఊపునిచ్చేలా లేదేంటి అనుకున్నాను. కానీ, మొదటి పాత చూడగానే అర్థమైంది ఎందుకలా అని. రెండో వ్యక్తి ఆ పేరు పెట్టుకున్నందుకు ప్రతిభతో ఆ పేరుకు న్యాయం చేసే సత్తా ఉన్న జూనియర్ తారక రామారావు. ఎక్కడా పాత్రను మించిపోలేదు, పాత్రకి లోబడి నటించాడు. తాను మారుతున్న తీరు చూస్తోంటే ముచ్చటేస్తోంది. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఎలాగైతే పరిణితి చెందిన నటనను ప్రదర్శించాడో ఈ చిత్రంలో కూడా అంతే. సంభాషణలు పలకడం దగ్గరనుండి ఆహార్యం, నటన అన్నింటిలో పరిణితితో పాటు పాత్రను తను మించిపోకుండా చూసుకున్నాడు. ఇక మూడవ వ్యక్తి కొరటాల శివ - ఈ చిత్రం గత రెండు చిత్రాల స్థాయికి తగ్గట్టు లేకపోయినప్పటికీ, కథ పాత చింతకాయపచ్చడిలాంటిదే అయినప్పటికీ మరొక సామాజిక కోణాన్ని ఎంచుకుని ప్రధాన పాత్రధారి ద్వారా అవగాహన కలిగించే ప్రయత్నం (చిన్నపాటిదే అయినా) చేసినందుకు.
ఇక ఇప్పుడు సినిమా విషయానికి వద్దాం. కథా పరంగా చూస్తే పాత చింతాకాయ పచ్చడి లాంటిదే అయినప్పటికీ ఆర్జీవీ అద్భుతాలలో ఒకటైన 'సర్కార్' సినిమాను కూసిన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. కాకపొతే అంతటి భావ గాఢత (ఇంటెన్సివ్ ఫీల్) లోపించింది. మోహన్ లాల్ లాంటి అత్యద్భుతమైన నటుడు ఉన్నప్పటికీ ఆయన చాలా సన్నివేశాలలో అచేతనంగానో అన్యమనస్కంగానో కనిపించాడంటే అది దర్శకుడిలోపమే అనుకోవాల్సి ఉంటుంది లేదా మరి యే ఇతర కారణాలేమైనా ఉన్నాయో తెలియదు. ఇక పర్యావరణ పరిరక్షణ (ప్రత్యేకించి మొక్కలు, పచ్చదనం) గురించి ప్రధాన పాత్రధారికి ఒక ఆశయం అంటూ ఏర్పరిచినప్పటికీ విశ్రాంతి తరువాత అసలు ఆ కోణమే ఉండదు. ఇక మోహన్ లాల్ తో కలిసిన తరువాత నటుడిగా జూనియర్ విశ్వరూపం చూపించినప్పటికీ గాఢత లోపించడంతో ఎదో కనెక్షన్ కట్ అయినట్టనిపిస్తుంది. కానీ ఊరట ఏంటంటే నేపథ్య సంగీతం. ఒకవైపు జూనియర్ మరోవైపు దేవిశ్రీ ఈ సినిమాను మోస్తూ శుభం కార్డు దాకా బోర్ కొట్టనివ్వకుండా తీసుకెళ్ళారు.
ఇక కథానాయికలు, ఎదో ఉండాలి కాబట్టి ఉన్నారు, ఉన్నారు కాబట్టి కాసిని పొట్టిబట్టలేసుకుని తమ పనేదో తాము చేసుకుని వెళ్లిపోయారు. అంతకుమించి వారి గురించి చెప్పుకోవడానికేమీలేదు. మిగతా పాత్రధారులలో మోహన్ లాల్ గురించి ముందే చెప్పాను, తనను ఉపయోగింన్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేకపోవడంతో తన గురించి ప్రస్తావించే అవసరం కథాపరంగా తప్పించి నటన పరంగా పెద్దగా రావట్లేదు, అందుకే కాస్త బాధగా ఉంది. దేవయాని, అజయ్, సురేష్ తదితరులందరూ ఒకే, అంతకుమించి చెప్పుకోవడానికేమీ లేదు. ప్రతినాయక పాత్రధారికి పెద్దగా పనేమీ లేకపోవడంతో అప్పుడప్పుడూ కనిపించి తనమీద తానే జాలిపడి మనకు విసుగు తెప్పిస్తుంటాడు. ప్రతినాయక పాత్ర సరిగా లేకపోవడంతో హీరోయిజం కూడా పండలేదు, అంతేకాక ప్రధాన పాత్రధారి పర్యావరణ పరిరక్షణ లక్ష్యం కూడా అటకెక్కడంతో ఎదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఒకే, కానీ మరికొంత జాగ్రత్త పది ఉంటే నిడివి తగ్గి బావుండేది.
ముందే చెప్పినట్టు ఒక సాదా సీదా, పాత చింతకాయ పచ్చడి కథను మళ్ళీ తీసాడనిపించున్నప్పటికీ కొరటాల శివ ఈ సినిమాకు జూనియర్ ని, దేవిశ్రీని ఎంచుకోవడంతో వాళ్ళిద్దరూ లోపాలన్నీ సినిమాను చంపెయ్యకుండా చూసుకుని కాపాడారు అటు నిర్మాతను, ఇటు ప్రేక్షకులను. చివరగా మొదటి సగభాగంలో జూనియర్ ప్రకృతి, పర్యావరణం గురించి ఆవేదన పడే సన్నివేశాలు, సంభాషణలు మన పెద్దాయనకు, ప్రభుత్వానికి చూపిస్తే బావుంటుందేమో అని నా అభిప్రాయం. మార్పు రాకపోయినా వస్తే బాగుండునని నా అత్యాశ. అది ఎలాగూ జరగదనుకోండి. ఇలాంటి సినిమాలు రావాలి, కాకపొతే దర్శకులు ఇలాంటి కథలను తెరకెక్కించేప్పుడు కాస్త ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది; ముఖ్యంగా నటీనటుల ఎంపిక, నిడివి, సంగీతం, చిత్రానువాదం తదితరాలలో. మంచి ప్రయత్నం, సినిమా గొప్పగా/అద్భుతంగా లేకపోయినా ఎక్కడా ఇబ్బంది పెట్టేలా అయితే లేదు.
చివరగా - ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలు ...
'మీ పిల్లలు మంచివాళ్ళయితే మీరిచ్చే డబ్బు గురించి పెద్దగా ఆశ పడరు, మీ పిల్లలు చెడ్డవాళ్లయితే మీరిచ్చే డబ్బును మిగిలించరు.'
'... పార్క్ జోలికి మళ్ళీ వస్తే చచ్చిపోతాడు... చెట్లను చంపేస్తే ఆక్సిజన్ సరిపోక'. చదువుకున్నవారు కదా మీరు అర్థమయ్యేలా చెప్పండి, కాస్త నిదానంగా అయినా పర్లేదు అర్థమవుతుంది'
Comments
Post a Comment