ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'కబాలి రా'

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'కబాలి రా'
*****************************************
రజనీకాంత్ 'కబాలి' సినిమా నిన్న చూశాను. సినిమా ఎలా ఉంది అనే వివరణాత్మక విశ్లేషణలోకి వెళ్లేముందు ఒకమాట - ఈ సినిమా చూసిన తరువాత రజనీకాంత్ కూడా మనలాంటి మామూలు మనిషేనని అర్ధమయ్యి బాధేసింది. వయసు తెచ్చే మార్పులు రజనీకాంత్ ని అయినా సరే నెమ్మదింపజేస్తాయని తెలుసుకున్నాను కానీ అది నచ్చలేదు. ఇక సినిమా గురించి ...
'కబాలి' కథ గురించి - కథ పరంగా చెప్పాలంటే కథలో ఎటువంటి కొత్తదనం కానీ ఉపయోగం కానీ లేనిది ఇది. ఇప్పటికే ఎన్నో వందలసార్లు తెరకెక్కిన కథ. ఈ సినిమాలో కబాలీశ్వరన్ మలేసియాలో తమిళుల కోసం పోరాడతాడు, ఆ క్రమంలో పెద్ద డాన్ గా ఎదుగుతాడు. శత్రువుల కుట్రకు కుటుంబాన్ని పోగొట్టుకుని పాతిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు. అదే క్రమంలో పోయిందనుకున్న తన కుటుంబాన్ని తిరిగి పొందుతాడు. ఇటువంటి ఒక సాధారణ కథను రజని తరహాలో తెరకెక్కించాలన్న ప్రయత్నంలో దర్శకుడు పా రంజిత్ విజయం సాధించలేకపోయాడు. నత్త నడకన తెరకెక్కించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. కథాగమనాన్ని మలుపు తిప్పే అవకాశం పలుమార్లు వచ్చినా, అనవసరపు సన్నివేశాలతో విసిగించాడు తప్ప ఊపు తెప్పించలేకపోయాడు. ఎటువంటి హాస్యం, రొమాన్స్ లేకుండా సినిమాను తీసినప్పుడు సినిమా నడక పరిగెత్తించేలా ఊపునిచ్చేలా బిగుతైన దృశ్యానువాదంతో (టైట్ స్క్రీన్ ప్లే) ఉండాలి. కానీ, ఈ చిత్రం అటు ఊపునిచ్చేలా లేక ఇటు హాస్యం (ఎంటర్టైన్మెంట్) కానీ, రొమాన్స్ కానీ లేక విసిగెత్తించింది. అప్పుడప్పుడు రజని పాత్ర అయినా నవ్వుతుందేమో కానీ, చుట్టూ ఉన్న పాత్రలన్నీ ఏదో తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో లేని సీరియస్ నెస్ ని చొప్పించటానికి విఫలయత్నం చేస్తాయి. (రజని బాడీగార్డ్ జీవా పాత్ర అలాంటిదే.) దర్శకుడిగా, కథారచయితగా ఇది పా రంజిత్ వైఫల్యమే. వేగవంతమైన కథనం ఉండి ఉంటే ఈ సినిమా వేరేగా ఉండేది.
రజనికాంత్ - తన ప్రెజన్స్ తో కట్టి పడేసే రజనీకాంత్ లాంటి నటులకు ఇలాంటి పాత్రలు అసలు లెక్కే కాదు. పాచిపోయిన పాత కథని, పసలేని కథనాలనుంచి ప్రేక్షకులను రక్షించే ప్రయత్నం చేసాడు రజనీకాంత్ కానీ పూర్తి విజయం సాధించలేకపోయాడు. తాను పోరాడుతున్నది జనాలకోసమా లేక తనకోసమా అన్నది అర్థం కానీ గందరగోళం అడుగడుగునా కనిపిస్తుంటుంది. మొదటి పదిహేను నిమిషాలు మాత్రం పాత రజని కనిపిస్తాడు, ప్రేక్షకుల్లో ఒక ఊపును తీసుకువస్తాడు. ఆ తరువాత సినిమా గ్రాఫ్ పడిపోయింది, అంతే ఇక మళ్లీ ఆ ఊపు రాదు. రజనీకాంత్ కూడా డల్ గా అన్యమస్కంగా అనిపిస్తాడు. వయసు వల్లనో ఏమో తెలియదు కానీ మునుపటి వేగం లేదు, ఆ ఫోర్స్ లేదు. ముఖ్యంగా యువకుడిగా రజని పాత్రలో ఊపు తగ్గింది. అసలు పాత్రచిత్రణలోనే చాలా లోపాలున్నాయి, దానికితోడు పాత్ర చిత్రణలో దర్శకుడి వైఫల్యం అడుగడుగునా రజనీని వెనక్కి లాగుతూనే ఉంటుంది. పాత్రలో ఉన్న గందరగోళం వల్ల రజని కూడా పాత్రను కాపాడలేకపోయాడు.
రాధికా ఆప్టే - తనవరకూ బాగానే చెయ్యటానికి ప్రయత్నించినా ఆ పాత్రకు అసలు సరిపోలేదు. ఆ పాత్రకు తాను రాంగ్ చాయిస్, అందునా ధన్సికకు తల్లిగా ఉండే సన్నివేశాలలో అయితే మరీ తేలిపోయింది.
ధన్సిక - రజనికాంత్ కూతురుగా పర్వాలేదనిపించింది. టామ్ బోయ్ తరహా పాత్రను తనవరకూ బానే చేసింది కానీ ఎమోషనల్ కనెక్టివిటీ సరిగా లేదు. రజని లాంటి నటుడి పక్కన కాన్ఫిడెంట్ గా కనిపించి మార్కులు కొట్టేసింది. కానీ, రజనిని తన తండ్రిగా తెలుసుకునే సన్నివేశంలో కానీ రజనికి తాను కూతురని చెప్పే సన్నివేశంలో కానీ సరైన భావ గాఢత ప్రదర్శించలేకపోయింది.
జాన్ విజయ్ - అమీర్ పాత్రలో జాన్ విజయ్ బాగా చేశాడు. రజని లాంటి నటుడు/స్టార్ ముందు తన ప్రెజన్స్ ఫీల్ అయ్యేలా చేశాడు.
విన్స్టన్ చావో - పర్వాలేదు బానే చేశాడు. కానీ, ఆ పాత్ర ఎందుకు విలన్ అయిందో అర్థం కాదు. బహుశా కబాలిని (రజనీకాంత్) వ్యతిరేకించాడు కాబట్టేమో. ఎందుకంటే ఆ పాత్ర విలన్ అని చెప్పడం తప్ప విలనిజం చూపే సన్నివేశాలు అంతగా ఏమీ లేవు, కనీసం ఆహార్యం కూడా.
మిగతా పాత్రధారులందరూ పాత్రలకు తగ్గట్టు చేశారు.
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే

దర్శకుడిగా, కథా రచయితగా పా రంజిత్ వైఫల్యం ఇది. చిత్రానువాదంలో విఫలమయ్యాడు. నత్తనడకన తెరకెక్కించి సహనాన్ని పరీక్షించాడు. హాస్యం, రొమాన్స్ లేకుండా చెయ్యటం బహుశా ప్రయోగం అనుకున్నాడో ఏమో మరి. కానీ దానికి తగ్గట్టు బిగుతైన చిత్రానువాదాన్ని తయారుచేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.

సంగీతం - సంతోష్ నారాయణ్ సంగీతం బావుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా అంటే చాలా బావుంది.
ఫొటోగ్రఫీ - మురళీ వర్ధన్ సినిమాటోగ్రఫీ మూడ్ తగ్గట్టుగా చేశాడు. కానీ, కొన్ని క్లోజ్ అప్ షాట్స్ అవాయిడ్ చేసి ఉండవచ్చు. 

ఎడిటింగ్ - బహుశా దర్శకుడి నత్త నడక చిత్రీకరణ వల్ల ప్రవీణ్ ఎడిటింగ్ లో ఏమి చెయ్యాలో అర్థం అయినట్టు లేదు. కానీ, కనీసం ప్రవీణ్ కాస్త కత్తెరకి పని చెప్పి ఉండుంటే నిడివి అయినా తగ్గి బావుండేది. 

గత రెండు సినిమాలతో పోలిస్తే (లింగా, కొచ్చాడయాన్) ఈ సినిమా బెటర్ కానీ రజని ఫ్యాన్స్ కి జస్ట్ ఒకే అనిపించేలా ఉంది తప్ప వాహ్ అనిపించేలా లేదు, రజని ఫ్యాక్టర్ సరిగా ఎలివేట్ కాలేదు. ముఖ్యంగా ఇది దర్శకుడి వైఫల్యమే. ఇది టిక్కెట్ కొన్న నాలాంటి వాళ్ళ పరిస్థితి, మరి పంపిణీ చేసిన పరిస్థితి ఏమిటో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాలి.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన