... జీహెచ్ఎంసీ ఎన్నికలు

వంశీ వ్యూ పాయింట్ // ... జీహెచ్ఎంసీ ఎన్నికలు //
********************************************
            జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్టగా మారాయి తెరాసతో పాటుగా, భాజపాకు కూడా. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడిని పెంచింది. కాంగ్రెస్, తెదేపాలకు కలిసి గానీ లేక విడివిడిగా గానీ పోటీ చేసినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది సమయంలో భాజపా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంతకాలం ముందుగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని సాగిన ప్రయత్నాలు, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత మారిపోయాయి - 'మధ్యంతర ఎన్నికలు' అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. అయితే నగరంలో నిజంగా భాజపా అంత పట్టు సంపాదించిందా లేక తెరాస గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయిందా అన్నది ముఖ్య విషయం.
            ముందుగా తెరాసకు ప్రతికూలాంశాలు పరిశీలిస్తే అత్యంత ముఖ్యమైనవి రెండు - ఇటీవలి భారీ వర్షాలకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికార వ్యవస్థ స్పందించిన తీరు; రెండవది కరోనా పరిస్థితుల్లో అధికార వ్యవస్థ మరియు ప్రభుత్వం తీరు. కరోనా పట్ల ప్రభుత్వ తీరును అనేకసార్లు హై కోర్ట్ కూడా తప్పు పట్టింది. కరోనా నివారణ అన్నది ప్రస్తుతానికి ఎవరి చేతుల్లో లేకపోయినప్పటికీ, దాన్ని వీలైనంతవరకూ అదుపు చేయడంలో అనేక ప్రభుత్వాలు సమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ, తెరాస ప్రభుత్వం లెక్కలేనివిధంగా వ్యవహరించడం అన్నది విమర్శలకు లోనవడమే కాకుండా - ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసింది. ఇటీవలి భారీ వర్షాలకు ఎదురైన పరిస్థితులు కూడా ప్రజల్లో అసహనం పెరిగేలా చేశాయని చెయ్యవచ్చు. అయితే ఇవన్నీ బల్దియా పీఠాన్ని తెరాస నుండి దూరం చేసేంతవరకూ ఎదిగాయా అన్నది కీలకమైన అంశం. గత సార్వత్రిక ఎన్నికల ముందునాటికి కూడా తెరాస పరిస్థితి ఇలానే ఉంది, అయితే ఫలితాలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చాయి. ఇక దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రవ్యాప్తంగా తామిక పుంజుకున్నట్టే, తెరాసకు ప్రత్యామ్న్యాయం కాదు తెరాసను ఇప్పటికిపుడు కూల్చెయ్యగలిగే స్థాయికి ఎదిగామనుకుంటున్న భాజపాది వాపా? బలుపా? దుబ్బాక ఉప ఎన్నికల్లో పని చేసిన అంశాలు, బల్దియాలో పని చేస్తాయా? అయితే భాజపా మాత్రం పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది - ఎంతగా అంటే అంత పెద్ద ప్రాధాన్యత లేని ఒక నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాని, జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రులు గట్రా రంగంలోకి దిగడం వారి ఆతృతను తెలియజేస్తోంది. అలానే స్థానిక అంశాలు, సమస్యలకంటే కంటే ఎక్కువగా సున్నితమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం వ్యూహంగా సాగుతున్నారు.
            నా అభిప్రాయంలో జీహెచ్ఎంసీ పీఠం మరోమారు తెరాసకే సొంతమయ్యే అవకాశాలు అధికం, అది కూడా పూర్తి ఆధిక్యతతో. రాష్ట్రంలో భాజపా తెరాసకు ప్రత్యామ్న్యాయంగా ఎదిగినట్టే అని ఈ ఎన్నికల ద్వారా స్పష్టం కావచ్చు. అలానే భాజపా వాపును చూసి, బలుపు అనుకోకూడదు - ఇది ఉత్తరాది రాష్ట్రాల వ్యవహారం లాంటిది కాదని అర్థం చేసుకోవాలి. ఇక తెరాస తన ఒంటెద్దుపోకడలు తగ్గించుకోవడంతో పాటు, ఇతర అంశాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింహాన్ని వేటాడాలంటే నిశ్శబ్దంగా మాటు వెయ్యాలి, సప్పుడు సేస్తే అది మనకన్నా రెండడుగులు ముందుంటుంది. కెసిఆర్ ని దెబ్బ కొట్టాలంటే గుంపుగా ఇలా పడిపోకూడదు. ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాని, జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రులు వస్తున్నారంటే అది ఖచ్చితంగా కెసిఆర్ స్థాయిని మరింత పెంచడమే. రేపుకాస్త ఇటూ ఇటూ అయి తెరాస  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  ఓడిపోయినా కూడా వీళ్ళు కెసిఆర్ స్థాయిని ఇప్పటికే పెంచేశారు. ఇపుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా సరే కెసిఆర్ ను జాతీయ స్థాయికి భాజపా లాగినట్టే. ఇక కెసిఆర్ ఓపిక. 

Comments

  1. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా సరే కెసిఆర్ ను జాతీయ స్థాయికి భాజపా లాగినట్టే. ఇక కెసిఆర్ ఓపిక. 👍

    ReplyDelete
  2. బీజేపీ ప్రచారం జోరు పెంచినప్పిటికీ రెండు వ్యూహాత్మక పొరపాట్లు చేసారు.

    1. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద నగరంలో అభిమానం మెండు. బీజేపీ ప్రచారంలో ఆయన పేరు ప్రస్తావన దాదాపు సున్నా కావడం నిజంగా ఆశ్చర్యకరం.

    2. బీద బిక్కీ ప్రజలను & బడుగు వర్గాలను పూర్తిగా విస్మరించారు. ప్రచారం మొత్తం ధనిక అగ్రకులాలను మాత్రమే ఫోకస్ చేసారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన