వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్
వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్
*********************************
మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రిక చిత్రంగా చెప్పబడిన, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకడిగా, తెల్లవారిపై (కంపెనీ లేదా బ్రిటిష్ రాజ్యం) తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అందుబాటులో ఉన్న ఆధారాలకు కొంత కాల్పనికత జోడించి తీసిన సినిమాగా - ఎంతో ఉత్సుకతను రేకెత్తించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సినిమా ఎలా ఉంది అనేకంటే ముందు - దేశభక్తి భావనలు ఈ సినిమాద్వారా పెంచుకోవాలనుకునేవారు మరియు చిరంజీవి భక్తులకు ఒక మనవి - ఇక్కడితో చదవడం ఆపెయ్యండి లేదా మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది కేవలం నా వ్యూ పాయింట్. సినిమా ఎలా ఉన్నా, 'సైరా' ఖచ్చితంగా, తెలుగు సినిమా సాధించిన అద్భుత కమర్షియల్ విజయాలలో ముందువరుసలో ఉంటుంది అన్నదాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అన్నిటికంటే ముందుగా ఒక విషయం చెప్పుకుందాం - 'మనీ' సినిమాలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారు పెళ్ళి గురించి చెపుతూ, కొన్ని ఫోటోలు చూపుతూ - సేమ్ కార్డ్, ఫొటోస్ చేంజ్ అంటూ వివరిస్తాడు. 'సైరా' సినిమా గురించి చెప్పాలంటే అలాగే చెప్పాలేమో. అంటే బాక్గ్రౌండ్ మారినా, బేసిక్ కమర్షియల్ రూల్స్ మారకుండా తీశారు అన్నమాట. సర్లెండి ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ పక్కనబెట్టి సినిమా వివరాలేంటో చూద్దాం.
ముందుగానే చెప్పినట్టు ఇది 1840 ప్రాంతాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపై తిరుగుబాటు చేసిన, రేనాటి వీరుడు, పాలెగాడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం ఆధారంగా తీసిన చిత్రం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర గురించి పలువురు మేధావులు ఇప్పటికే ఫేస్ బుక్ సాక్ష్యంగా తీర్మానాలిచ్చేశారు, పుంఖానుపుంఖాలుగా రాసేశారు కాబట్టి అది పక్కనబెడదాం. ముందుగా కథ పరంగా చెప్పుకోవాలంటే రాయలసీమలోని ఒక ప్రాంతం, అందులో పాలెగాండ్రు లేదా చిన్న చిన్న రాజ్యాలకు (దుర్గాలకు) పాలకులుగా ఉన్న అనేకమంది పాలకులు కంపెనీ పాలనకు తలొగ్గి, వారికి సామంతుల్లాగా జీవనం గడుపుతుంటారు. అటువంటి సమయంలో కొన్ని అవమానాలెదుర్కొన్న నరసింహారెడ్డి, వారిపై తిరుగుబాటు చెయ్యటం, చాలామంది అతడితో కలిసి పోరాడటం, చివరకు అతడిని పట్టుకుని ఉరి తీయటం/చంపటం అన్నది ఈ చిత్ర కథ. ఈ కథలో ప్రేక్షకుడిని కట్టి పడేసేయ్యగల ముడిసరుకు చాలా ఉంది, కాలపరీక్షకు నిలబడిన కమర్షియల్ ఫార్ములా కావలసినంత దట్టంగా ఉంది, గుండెలను ఉప్పొంగించగలిగే దేశభక్తి భావన రేకెత్తించగలిగే భావోద్వేగాలు ఉన్నాయి, వావ్ అనిపించగలిగే పోరాటసన్నివేశాలు ఉన్నాయి, 'బాహుబలి' తర్వాత ఏర్పడిన క్రేజ్ ఉంది, వీటన్నింటికి తోడు 'మెగాస్టార్ చిరంజీవి' ఉన్నాడు. ఇన్ని పాజిటివ్ అంశాలను సక్రమంగా ఉపయోగించుకోగలిగి ఉంటే, సైరా నిజంగానే ఒక అజరామర చిత్రంగా నిలిచిపోయేది. అటువంటి అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. దాంతో ఒక సాధారణ కమర్షియల్ చిత్రానికి వెరైటీ కోసం చారిత్రకం అన్న బాక్గ్రౌండ్ చేర్చారేమో అనిపిస్తుంది. 'బాహుబలి' ఒక కాల్పనిక కథా చిత్రం, అందులో ఎలా పడితే అలా తియ్యటానికి ఆస్కారం ఉంది. అయినా కూడా అదొక చారిత్రిక చిత్రం అనిపించేలా తీయటానికి విపరీతంగా శ్రమించారు రాజమౌళి మరియు అతడి బృందం. ఒక చారిత్రిక చిత్రాన్ని, ఒక కల్పిత కథా చిత్రం అనిపించేలా తీశారు సురేందర్ రెడ్డి మరియు అతడి బృందం అనిపిస్తుంది సినిమా చూశాక.
ఏ కథైనా ప్రేక్షకుడికి పట్టాలంటే భావోద్వేగాలు పండాలి, అసలు ప్రేక్షకుడిని సినిమాకు కనెక్ట్ చేసి, కట్టిపడేసేవే భావోద్వేగాలు. అవి సరిగా లేకపోతే, ఎంతటి గొప్ప కథ ఉన్నా నిట్టూర్పులు మిగులుతాయి. చిరంజీవి కోసం, చిరంజీవి కల, చిరంజీవికి గిఫ్ట్ అంటూ ప్రస్తావిస్తుంటే ఏమో అనుకున్నా కానీ సినిమా చూసాక అర్థమయ్యింది. ఇది చిరంజీవి సినిమా, చిరంజీవి కోసం తీసిన సినిమా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరంజీవిలా ఉంటాడనిపించారు, చిరంజీవిని ఎలేవేట్ చెయ్యటంలో, భావోద్వేగాలను వదిలేశారు, పెద్దగా పట్టించుకోలేదు. ఎడిటింగ్ పై మరింత దృష్టి పెట్టి ఉంటే, కనీసం ఒక పావుగంట అయినా నిడివి తగ్గేదేమో. ఫస్ట్ హాఫ్ లో అధికభాగం ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అధికభాగం నరసింహారెడ్డి - లక్ష్మి - సిద్దమ్మ పాత్రల మధ్య కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయటానికి ఉపయోగించుకున్నారు కానీ నరసింహారెడ్డి పోరాటానికి తగిన బాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చెయ్యటంలో విఫలం అయ్యారు. తన మనిషికి గుండు కొట్టి పంపినదానికి నరసింహారెడ్డి స్పందించినట్టు చూపలేదు, అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం అదే నరసింహారెడ్డి పోరాటానికి ప్రధాన కారణం - అంటే అవమానం. (గుండు కొట్టించారో లేదో కానీ 'పెన్షన్ తీసుకునే బంటుకు బంటా, ఆ బంటునే రమ్మను' అన్నారని అంటారు) అలాగే ప్రజలకు, అతడికి మధ్య సరైన కనెక్టివిటీ కూడాఎస్టాబ్లిష్ కాలేదు. అలాగే అవమానాలు ఎదుర్కోవడం కంటే ముందే నరసింహారెడ్డి పాలెగాండ్రందరిని కలిపి, సమావేశం (జాతర సన్నివేశాలు) ఏర్పరిచినట్టు చూపటం స్క్రీన్ ప్లే లోపమో లేక అవగాహన లోపమో అర్థం కాలేదు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ముందే చెప్పినట్టు సరైన ముడిసరుకు ఉన్నప్పటికీ, దానిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు.
ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే - ముందుగా, ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి గురించి. 60 దాటిన వయసులో కూడా పాత్రను సమర్థంగా పోషించాడు. అంతగా నప్పని సన్నివేశాలను కూడా తన ఇమేజ్ బలంతో లాగేశాడు. ముఖ్యంగా అనేక సన్నివేశాల్లో శారీరక భాష కంటే, కంటితోనే హావభావాలను అద్భుతంగా పలికించాడు. తన వయసుకంటే, దాదాపు ఒక పాతిక సంవత్సరాలు తక్కువ వయసున్నట్టు కనిపించాడు. పోరాట సన్నివేశాల్లో చిరంజీవిని చూస్తుంటే, ఇదే గనుక ఒక ఫక్తు కమర్షియల్ సినిమా అయ్యుంటే బాస్ డాన్సస్ ఇరగదీసేవాడేమో అనిపిస్తుంది. కానీ, తమన్నాతో ఉన్న సన్నివేశాల్లో ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. పేరుకే రాయలసీమకు చెందిన రేనాటి సూర్యుడు అంటారు కానీ, అతడి భాషలో ఎక్కడా రాయలసీమ యాస కానీ, ఆనాటి వాడుక పదాలు కానీ వాడలేదు. ఇది సినిమా అంతా ఉంటుంది. సంభాషణలు అంటే నరుకుతా, చంపుతా, సవాళ్ళు విసురుతా అన్నట్టుగా రాసుకున్నారు. ఆంగ్లేయుల పాత్రలు పోషించిన వారికీ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ, ఒక మామూలు తెలుగువాడు మాట్లాడినట్టే ఉంటుంది. మన వాడే అయినా మోహన్ బాబు ఆంగ్లేయ పాత్రలో (తాండ్ర పాపారాయుడులో అనుకుంటా) సంభాషణలు పలకడంలో చూపిన వైవిధ్యం కూడా ఇందులో చూపలేదు. ఇక మిగతా వారి విషయానికి వస్తే తమన్నా పాత్ర, ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమన్నాకు ఇది మంచి పాత్ర. నయనతార ఉంది, ఉన్నంతలో బావుంది. అవుకు రాజుగా సుదీప్ కు కూడా మంచి పాత్ర పడింది, తను కూడా ఆకట్టుకుంటాడు. థియేటర్ నుండి బయటకొచ్చాక చిరంజీవి కాకుండా జనాలకు కాస్త గుర్తుండే పాత్ర అంటే సుదీప్ పోషించిన అవుకు రాజు పాత్రే. అమితాబ్ బచ్చన్ ఒకసారి నల్లగడ్డం, ఆ తరువాత తెల్లగడ్డంతో కనబడ్డం తప్ప పెద్దగా ఉపయోగం లేని పాత్ర - పేరుకు నరసింహారెడ్డికి గురువుగా చెప్పారు కానీ అతడిని ప్రభావితం చేసినట్టు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ వంటివారు ఉన్నంతలో తమ పరిధిమేరకు బాగా చేశారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఇలాంటి సినిమాకు ఎంతో బలంగా నిలవాల్సిన నేపథ్య సంగీతం సరిగా లేదు. పాటల విషయానికి వస్తే ఒక్క టైటిల్ సాంగ్ 'ఓ సైరా ...' తప్పించి మిగతావేవీ ఆకట్టుకునేలా లేవు నేపథ్య సంగీతానికి మణిశర్మను తీసుకుని ఉంటే చాలా బావుండేదనిపిస్తుంది. ఎడిటింగ్ విషయానికి ముందే చెప్పుకున్నట్టు, ఆ విభాగం సరిగా పని చేసి ఉంటే, కనీసం ఒక పావుగంట నిడివి తగ్గేది (ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో). ఫోటోగ్రఫీ విషయంలో రత్నవేలును అభినందించాల్సిందే. సినిమా ఎక్కువశాతం అడవులు, నైట్ ఎఫెక్ట్ (డల్ లైటింగ్ ఎఫెక్ట్ లో) లో సాగేదిగా ఉండటంతో - దానికి తగినట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు. కాస్ట్యూమ్స్ సరిగా లేవు, కూతురు అని చూడకుండా, వేరెవరైనా ప్రొఫెషనల్స్ కు ఆ విభాగం బాధ్యతలను ఇచ్చి ఉంటే బావుండేది అనిపిస్తుంది. నిర్మాణ విలువల పరంగా చెప్పుకోవాలంటే నిజంగా రామ్ చరణ్ గట్స్ కు హాట్స్ ఆఫ్. బహుశా, ఇలాంటి కొడుకుంటే బావుందనుకుంటారేమో చాలామంది. పిల్లల కోసం విపరీతంగా కష్టపడిన తండ్రులను చూశాం, తండ్రి కోసం రామ్ చరణ్ చేసిన ధైర్యం అభినందనీయం. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా తగ్గకుండా వ్యవహరించాడు.
'సైరా - నరసింహారెడ్డి' సినిమా ఒక చారిత్రక చిత్రంగా కంటే, ఒక స్వాతంత్ర్య సమరయోధుడి చిత్రంగా కంటే - ఒక చిరంజీవి చిత్రంగానే ఎక్కువగా గుర్తుండిపోతుంది అనటంలో సందేహం లేదు. అదే సమయంలో కల్పితం లేదా ఊహాజనితం అయిన సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, సిపాయి తిరుగుబాటుకంటే ముందుగానే జరిగిన తిరుగుబాటుల్లో ముఖ్యమైన పోరాటం గురించి జనాలకు తెలిసేలా చెయ్యటంలో ఈ చిత్రం విజయం సాధించిందని చెప్పవచ్చు. ముందుగానే చెప్పినట్టు ఇందులోని చారిత్రిక ప్రామాణికత గురించి చర్చించటం లేదు - ఎందుకంటే ఉన్న అయిదుపైసల చరిత్రకు, 50 పైసల కాల్పనికత జోడించి, 45 పైసల హీరోయిజం చేర్చి తీసిన సినిమా ఇది. ఒక ఫక్తు హీరో ఓరియెంటెడ్ కమర్షియల్ మూవీ (రెగ్యులర్ పాటలు, ఐటమ్స్ సాంగ్స్ మినహాయించి), కాకపొతే చారిత్రకత అన్న బాక్గ్రౌండ్ ఉంటుంది అంతే తేడా.
చివరగా ఒక్క మాట - బాహుబలికి పోటీగా చెప్పబడిన ప్రతి సినిమా రిలీజ్ అయ్యాక బాహుబలి మీద ఇష్టాన్ని, రాజమౌళి మీద గౌరవాన్ని పెంచుతున్నాయి (బాలీవుడ్ సినిమాలతో సహా). అప్పుడూ, ఇపుడూ నాకు బాహుబలి అంతగా నచ్చలేదనే చెబుతాను. కానీ, అందులో భావోద్వేగాలను పండించిన తీరు, పాత్రల మధ్య కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసిన తీరు కట్టి పడేస్తుంది. మరొక మాట - సైరా అద్భుతంగా లేకపోవచ్చు, అలాగని చెత్తగానో లేక ఇబ్బంది పెట్టేదిగానో కూడా కూడా లేదు. సినిమా చూడవచ్చు. అందునా చిరంజీవి కోసం అయితే మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. 'సైరా' చిరంజీవి సినిమా. ఒక్క డాన్సస్ మినహాయిస్తే, చిరంజీవి నుండి ఏమి ఆశిస్తారో అవన్నీ పుష్కలంగా అందించే సినిమా ఇది. ఇక సైరా లోని చారిత్రిక అసంబద్ధతల గురించి మరొక పోస్ట్ లో చర్చిస్తాను, ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ లో సైరాను కేవలం ఒక సినిమాగా మాత్రమే పరిగణించాను.
So much analysis not needed. They want their money. Audience wants its goosebumps. Both got it.
ReplyDeleteWhen History can be brutalized by romila thaper and Irfan Habib, yes cinematic liberties can be taken.
History can be bent any which way.
Audience goosebumps ani generalize chesi matladdam is a numbers game..entamandiki nachindi anedi box office chuskuntadi..individual ga evvariki emi nachindi..or nachhaledu cheppadam lo cinema ki or fans ki aah matakoste cinema tesina nipunulaki disrespectful ga teesukovalsina avasaram ledu..kavalante aah cinema enduku adhbutamo inko vyasam rasukovachu.
DeleteLiberties theskodam tappu kadu..avi andanga attukunnaya leda anedi kuda important. Edi idealistic or historical facts meeda battle kadu..screen play lo plausibility arc unda leda ane vishayam meeda vimarsa.
Cinema lo deesa bhakti anedi pradanamsam ani cheppukunnaru..daniki technology hangulu elevation kosam vadarani chepparu,music Dani elevate chestadi annaru. Kani aah mudinti meda dyasa ledu annadi nijam. Primary factor chiranjeevi commercial ga elevate cheyadame annatu ga undi.
Daani meaning movie lo em enjoy cheyaledani kadu.. naa varaku movie ni mukkalu mukkaluga raka rakala reasons ki enjoy chesa..kani as a whole Oka entity la ledu. Adi Valla goal ani kuda anipiyyaledu.
cinema Oka brave heart la ledu...Oka bahubali la ledu anadam is a fact rather than an attack.
It is a chiranjeevi movie. Ante adi takkuva stayi movie na..leda ekkuva stayi movie na..or just different genre movie na anedi chusevalla liberty.