... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు

వంశీ వ్యూ పాయింట్ // ... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు //
**********************************************************
తెదేపా 
              అవమానాల్ని, ఓటముల్ని తట్టుకోవటం తెదేపాకు, చంద్రబాబు గారికి అలవాటే. తట్టుకుని నిలబడ్డారు కాబట్టే, నేను అత్యంత సీనియర్ ని అని చెప్పుకోగలిగే స్థాయిని సంపాదించుకుని నిలబడ్డారు. ఈ ఓటమికంటే, ఈ శతృవు చేతిలో ఓటమి ఆయనను ఎక్కువగా ఆబాధిస్తున్నట్టుంది. అయినా అదంతా పక్కనబెట్టి, సభలో చక్కగానే వ్యవహరిస్తున్నారు. మరీ గొప్పగా అని చెప్పలేం కానీ, గత అయిదేళ్లతో పోల్చితే ఇపుడు వ్యవహరిస్తున్న తీరు బెటర్ అని చెప్పవచ్చు.తెదేపా అభిమానులను బాధిస్తున్న అంశం ఏంటంటే పార్టీ నాయకుల తీరు. గెలిచినా 23 మంది అయినా గట్టిగా పోరాడుతున్నారా అంటే లేదు, భాజపా తమతో 18 మంది టచ్ లో ఉన్నారు అన్నా కూడా ఎవరూ స్పందించటం లేదు. అంతేకాక సభలో చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య గారు, అప్పుడప్పుడు పయ్యావుల కేశవ్ మినహా మిగతావారు పెద్దగా నోరు మెదపట్లేదు. వారు భయపడుతున్నారా లేక పార్టీ వీడటానికి మంత్రాంగం నడుపుతున్నారా అన్నది చెప్పలేకపోయినప్పటికీ వారి మౌనం మాత్రం పార్టీ అభిమానులతో సహా బాబుగారిని ఇబ్బంది పెట్టేదే. తన సభ్యుల తీరు పట్ల ఆయన అభద్రతాభావంతో ఉన్నట్లున్నారు. 
             ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించి తీరాల్సిందే అన్న ధోరణి మంచిది కాదేమో. ఒకసారి ఈ తీరును బాబుగారు సమీక్షించుకుంటే బాగుంటుందేమో. బడ్జెట్ లో కొన్ని మంచి అనిపించినా అంశాలను మెచ్చుకోవాలి, అలాగే సభలో తమకు లభిస్తున్న సమయం పట్ల కూడా సంతోషించాలి. గతంలో ఇప్పటి తమ సభ్యుల కంటే మూడింతల సంఖ్యలో సభ్యులను కలిగి ఉన్నప్పటికీ కనీసం ఇంతటి సమయం కూడా తాము ఇవ్వలేదు.  ఇక అచ్చెన్నాయుడు గారికి అన్ని అంశాల పట్ల అవగాహన ఏర్పడేలా ఏవైనా శిక్షణాతరగతులు నిర్వహిస్తే మేలేమో. ఎందుకంటే ఇక మిగతావారిమీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్టు లేదు. ఇపుడు సభలో బాబుగారి పరిస్థితి తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు, ఈ సమయంలో తన పార్టీ సభ్యులకు కూడా తాను అండగా ఉంటానని నమ్మకం కలిగించగలగాలి. 
             ఇప్పటివరకూ సభలో తెదేపా తీరు, ఖచ్చితంగా అధికార పక్షాన్ని వ్యతిరేకించాల్సిందే అన్న ఫక్తు మూస ప్రతిపక్ష ధోరణిలో ఉంది తప్పించి నమ్మకం కలిగించేలా లేదు. అనేకమార్లు ప్రశ్నించే అవకాశం వచ్చినప్పటికీ, తమకు తగిన సమయం దొరికినప్పటికీ ప్రజాసమస్యలను ప్రస్తావించేకంటే తమ గత ప్రభుత్వ తప్పులను డిఫెండ్ చేసుకోవటానికి మొగ్గు చూపటం  మంచిది కాదు. మీరు చేసినవి తప్పులని నమ్మరు కాబట్టే ఓడగొట్టారు కాబట్టి, వాటిని పక్కనబెట్టి - ప్రజాసమస్యల కోసం అధికారపక్షాన్ని నిలదీయాలి. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడి సరిగా రెండు నెలలు కూడా కాలేదని గమనించి, వ్యవహరించాలి. లేకపోతే నవ్వులపాలయ్యి మరింతగా దిగజారే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో అందునా ఇప్పుడు సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరం  

*            *            *  

జనసేన
            ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఒక్క స్థానం అది కూడా అధినేత కాకుండా మరొకరు గెలవడంతో సరిపెట్టుకున్న జనసేన తీరు శాసనసభలో ఎలా వుంరాపాక వరప్రసాద్ గారు వుంటుందో అని ఆసక్తి ఉండేది. ఇప్పటివరకూ రాపాక గారు హుందాగానే ప్రవర్తిస్తున్నారు. కానీ, ఆయన ఎక్కువగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతోంది. అలాగని ఆయన తెదేపాపై విమర్శలేమీ ఎక్కువగా చెయ్యట్లేదు. ప్రతి సందర్భంలో వైఎస్సార్సీపీ పట్ల సానుకూలత చూపుతూ, అదే సమయంలో తన నియోజకవర్గ సమస్యలనూ ప్రస్తావిస్తూ స్పీకర్ తో కూడా ప్రశంసలందుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు రాపాక వరప్రసాద్ గారిని జనసేన ఎమ్మెల్యేగా గెలిపించారు, గుర్తిస్తున్నారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎన్నికలు ముగిశాక జరిగిన అనేక సమీక్షా సమావేశాలలో గెలిచినా ఏకైక ఎమ్మెల్యేకు స్థానం లేదు. ఆయన పిలిచినా రాపాక పోలేదా లేక పిలవలేదా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. 
            శాసనసభ సమావేశాలకు ముందుగా తమ పార్టీ అనుసరించవలసిన తీరు పట్ల రాపాక వరప్రసాద్ గారితో పవన్ గారు సమావేశమైనట్టు లేదు. అంటే రాపాక గారు వ్యవహరించే తీరు పార్టీ అధికారిక తీరుగా తీసుకోవాలి అనుకుంటే, పవన్ గారు కూడా వైఎస్సార్సీపీ పట్ల అంతటి సానుకూలత కలిగి ఉన్నట్లేనా. లేదా అతడి తీరు పట్ల సంతోషంగా లేకపోతే, పిలిపించి వివరణ అడిగారా? పార్టీ తీరుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఏమి చేస్తారు? లేదా అతడిని తమ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించట్లేదా? ఉన్న ఎమ్మెల్యే పట్ల ఇలా వ్యవహరించి, పోగొట్టుకుంటే అది తప్పుడు సందేశం ఇచ్చినట్లే. పాతికేళ్ళ సీరియస్ రాజకీయం చేయాలనుకుంటున్నాం అంటే ఇలా కాదు. ప్రజలు ఇంతకుముందే లైట్ తీసుకున్నారు, తీరు ఇలానే ఉంటే ఇక అసలు పట్టించుకోరు. రాపాక గారికి పెద్ద సమస్య ఏమీ ఉండదు, వైఎస్సార్సీపీ కాదంటే భాజపా కళ్ళకద్దుకుని మరీ చేర్చుకుంటుంది. కానీ, నష్టం పవన్ కే. ఇపుడు రాపాక పార్టీ వీడితే అది రాపాక తప్పు కాదు, ఖచ్చితంగా పవన్ తప్పే అవుతుంది. గెలిచినా ఒక్క ఎమ్మెల్యేకు పార్టీ విధి, విధానాల పట్ల దిశానిర్దేశం చెయ్యకపోవడమేంటి? గెలిచినా ఏకైక ఎమ్మెల్యేగా సమీక్షాసమావేశాలలో అతడికి ఖచ్చితంగా స్థానం కల్పించాలి. అలాగే పార్టీ నిర్మాణంలో అతడికి సముచిత స్థానం ఇవ్వాలి. ఇలా నిర్లక్ష్యం చేస్తే, అది ఖచ్చితంగా అతడిలో అభద్రతా భావం కలిగించగలదు. 
             ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తన ఏకైక ఎమ్మెల్యే రాపాక గారినే కాదు, మొత్తం పార్టీనే గాలికి వదిలేసినట్టున్నారు. రాష్ట్ర బడ్జెట్ పట్ల కానీ, కేంద్ర బడ్జెట్ పట్ల కానీ పార్టీ తరఫున స్పందన లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం రాష్ట్ర బడ్జెట్ ను విపరీతంగా మెచ్చుకుంటూ, ముఖ్యమంత్రిగారిని దేవుడితో పోల్చుతున్నారు. చెయ్యలేరు. జనసేనకు సమస్య వైఎస్సార్సీపీ తెదేపానో కాదు - అధినేత పవన్ కళ్యాణ్ తీరు. అది మార్చుకోకపోతే, మార్చుకున్నారన్న నమ్మకం పార్టీ అభిమానులలో కలిగించకపోతే - చెప్పేదేముంది సభకు నమస్కారం అంతే. 

ముక్తాయింపు: 
ఇది కేవలం ప్రతిపక్షాల తీరు గురించే, అధికార పక్షం తీరు గురించి మరొక వ్యాసంలో. అది అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనే అపోహలొద్దు. నేను ఎలా రాస్తానో అలానే ఉంటుంది. ఎలా రాస్తానో ప్రస్తుతానికి నాకే తెలీదు. ముద్రలేయటం అలవాటు ఉన్నవారికి చెప్పినా ఉపయోగం లేదు. మిగతావారికి మాత్రమే ఇది.  

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన