... వోటింగ్ అయ్యాక

వంశీ వ్యూ పాయింట్ // ... వోటింగ్ అయ్యాక //
**********************************************
వోటింగ్ ప్రకియ ముగిసి అప్పుడే రెండు రోజులైంది. వోటింగ్ సరళిని గమనిస్తే % పరంగా మంచి సంఖ్యా నమోదైందని చెప్పవచ్చు. కొన్ని అంశాలు పరిశీలిస్తే 

-> ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన ముందరి అంచనాలకంటే వోట్లు ఎక్కువ తెచ్చుకునేట్టే కనబడుతోంది. కానీ, అది సీట్ల సంఖ్యాపరంగా ప్రభావం చూపేంత స్థాయిలో ఉంటుందా అన్నది మాత్రం అనుమానమే. అంచనాల ప్రకారంగా చూస్తే, ఒకటిరెండు సీట్లు పెరగొచ్చేమో, అదే సమయంలో కొన్ని చోట్ల ఇతరుల అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు. నేను స్వయంగా తెలుసుకున్న ప్రాంతాలలో ఈ వోట్ చీలిక అన్నది తెదేపా వోట్ బ్యాంకు నుండి జరిగినది కాబట్టి అది తెదేపాను దెబ్బతీసేదిగా ఉండొచ్చు. ఇది పవన్ కు ఖచ్చితంగా మంచి అంశమే. ఒకవేళ పవన్ కనుక గతంలోలా కాక నిబద్దతతో రాజకీయరంగానికి అంకితమై వుంటే, 2024 నాటికి రెండో ప్రధాన ప్రత్యామ్నాయం కాగలడు, అఫ్ కోర్స్ అది పవన్ వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది. 

-> ఇక పోలింగ్ ముగిసిన తరువాత నుండి చంద్రబాబు వ్యవహారశైలి, ఈసీపై విమర్శలు తెదేపా అవకాశాలపై ఇప్పటికే ఉన్న అనుమానాలను బలపరచే విధంగా ఉన్నాయి. తెదేపా అవకాశాలపై ఇప్పటికి కూడా 'ఏమీ చెప్పలేం' అని చాలామంది అనటం చంద్రబాబు మానేజ్మెంట్ పై నమ్మకంతోనే. చంద్రబాబు ఏమైనా చేయగలడు అన్న నమ్మకం అందరికీ ఉంది, చివరకు ప్రతిపక్షానికి కూడా. అందుకే అధికారికంగా ఫలితాలొచ్చేవరకూ ధీమాగా ఉండటానికి లేదు. వోటింగ్ సరళి అంత తేడా కొట్టేట్టు కనబడకపోయినా - ఎక్కువ వోటింగ్ శాతం, ఇతర ప్రాంతాల నుండి విపరీతంగా జనాలు వచ్చి వోట్ వేయడం, యువత మరియు మహిళలు ఎక్కవగా వోటింగ్ లో పాల్గొనడం తెదేపాను భయపెట్టే అంశాలు చారిత్రకంగా చూస్తే అధిక వోటింగ్ శాతం అన్నది ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నపుడు జరిగే అవకాశం ఎక్కువ. అంటే అధికార పక్షానికి దెబ్బకొట్టే అంశం అని విశ్లేషకుల అభిప్రాయం. చూడాలి 

-> ఇక వైఎస్సార్సీపీలో గెలుపు పట్ల పూర్తి ధీమా కనబడుతున్నప్పటికీ గుంభనంగా ఉన్నారు. 2014 లో లాగా విపరీత, ముందస్తు స్పందన లేదు. తన పార్టీ వర్గాలను అనేక కీలక సమయాలలో తన అభీష్టానికి అనుగుణంగా కట్టడి చేయడంలో జగన్ విజయం సాధించారు. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించేట్టే ఉన్నారు. గత ఎన్నికలకు, ఇప్పటికి పార్టీలో ఉన్న తేడా జగన్ లో వచ్చిన పరిణితి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎప్పటిలానే కొన్ని చోట్ల జగన్ మీదే ఆధారపడి, స్థానిక అభ్యర్థులు పెద్దగా పని చేయకపోవడం ప్రతికూలాంశమే. కానీ, అది సీట్ల విషయంలో ప్రభావం చూపేంతగా లేదని నా అభిప్రాయం. అధిక వోటింగ్ లభించే అంశమే కాగలదు. తమ సాంప్రదాయ వోట్ బ్యాంకు కాపాడుకున్నప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేక వోట్ ను పవన్ చీల్చడం అన్నది కొంత దెబ్బ తీయగలదేమో అన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకించి గోదావరి జిల్లాలు, కోస్తాంధ్ర ప్రాంతాలలో పవన్ ప్రభావం ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేనిది. పవన్ పట్ల ఎక్కువ మొగ్గు చూపినది యువత, అందులో ఎంతమంది పోలింగ్ బూత్ దాకా వచ్చారు, అసలెంతమందికి వోట్ హక్కు ఉంది అన్నది ప్రశ్న. ప్రస్తుతానికి అయితే వైఎస్సార్సీపీకి శకునములన్నీ మంచిగానే కనబడుతున్నాయి (కాగితాలపై) - నిజమైన ఆనందం కోసం మే 23 వరకూ ఎదురు చూడాల్సిందే. 

-> ఇక భాజపా, కాంగ్రెస్ ల గురించి చెప్పాలంటే భాజపా గతంలో తెదేపాకు పడిన తమ వోట్ బ్యాంకును చీల్చగలిగినట్టే లెక్క. కాంగ్రెస్ ఎక్కడా ఎటువంటి ప్రభావమూ చూపలేకపోయింది అని చెప్పవచ్చు. 

-> బయటకి కనబడినా, కనబడకపోయినా ఈ ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపిన కొన్ని అంశాలు - జగన్ పై అవినీతి ఆరోపణలు; తెదేపా తరువాతి నేతగా లోకేష్ ను ప్రోజెక్టు చేయడం; రాజధాని నిర్మాణం అంశం (ఇప్పటికీ ఒక్క శాశ్వత నిర్మాణం పునాదికి నోచుకోకపోవడం), పంటపొలాల పందేరం; తెదేపా నేతల విచ్చలవిడి అవినీతి, రౌడీయిజం; వ్యక్తిగా పవన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్; తెదేపా పట్ల పవన్ సానుకూలత; కాంగ్రెస్ - తెదేపా బంధం; విపరీతంగా ప్రచారం చేయబడిన జగన్ - తెరాస లోపాయికారి ఒప్పందం గట్రా. విచిత్రమేమిటంటే - ఎన్నికల ప్రకటన ముందువరకూ విపరీత ప్రచారానికి నోచుకున్న ప్రత్యేక హోదా అంశం ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవటం. ఎన్నికలకు రెండు రోజుల ముందు కెసిఆర్ ప్రత్యేక హోదాకు, పోలవరం ప్రాజెక్టుకు మద్దతిస్తామని వ్యాఖ్యానించడం కూడా ఖచ్చితంగా ప్రభావం చూపే అంశమే - అందుకే అది ఎల్లో మీడియాలో పెద్దగా కనబడలేదు. 

... పై అంశాలన్నింటినీ బేరీజు వేసుకున్న తరువాత నా అంచనాలు ఇవి  

తెదేపా -> 55 - 70 
వైఎస్సార్సీపీ -> 100 - 115
జనసేన కూటమి -> 3 - 5
ఇతరులు -> 0 - 2

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్స్ పరంగా 
తెదేపా -> 4 - 7 
వైఎస్సార్సీపీ -> 18 - 21 
జనసేన -> 0 - 1
ఇతరులు -> 0

Comments

 1. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి సైతం బరితెగించి గొడవలకు దిగడంతోనే పచ్చదండు అభద్రతా భావం కనిపిస్తుంది.

  ReplyDelete
 2. గులాం గ్యాంగ్ అరాచకాలేవైనా తక్కువా ? https://www.google.com/amp/s/m.timesofindia.com/city/hyderabad/former-speaker-gets-relief-in-contempt-case/amp_articleshow/68310432.cms

  ReplyDelete
  Replies
  1. గులాం గ్యాంగ్ అనటంలో మీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు కానీ, అసలు వార్తగా మొదట వచ్చినది ఏమిటంటే - తన వోట్ వేసాక గంటకు పైగా పోలింగ్ బూత్ లోనే కోడెల గారు ఉన్నారు. పోలింగ్ ఏజెంట్ కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆయన వోటింగ్ ని ప్రభావితం చేసే విధంగా అలా ఎలా ఉంటారు? రిగ్గింగ్ వంటి చర్యలకు పాల్పడుతూ, వోట్ వెయ్యనివ్వట్లేదని వోట్ వేయటానికి వచ్చినవారే దాడికి పాల్పడ్డారని మొదట వచ్చిన వార్త. ఆయన అటువంటి చర్యలకు పాల్పడుతున్నా పోలీస్ చర్యలు తీసుకోలేని స్థితిలో ఉండటంతో జరిగిందని టాక్ కానీ, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని నేను సమర్థించను. అలాగే ఆయన చర్యలను కూడా. ఇక మీరు ఏ ఆధారాలతో గులాం గ్యాంగ్ అన్నారో, ఆ గులాం ఎవరో నాకు తెలియదు. ఒకవేళ మీరు జగన్ ను ఉద్దేశించి అని ఉంటే గనుక, అప్పట్లో చంద్రబాబు గారు తుని ఘటనలో పులివెందుల రౌడీలు అన్న తీరున ఉన్నాయి మీ వ్యాఖ్యలు. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన మీదట అప్పట్లో తుని ఘటనలో స్థానిక యువకులు ముగ్గురో, నలుగురో అరెస్ట్ అయ్యారు. ఇక ఇందులో సాక్షాలు పరిశీలించనివ్వండి. అంతవరకూ బురద జల్లకుండా సంయమనంతో ఉండండి.

   Delete
  2. కోడెల ఫాక్షన్ నేపధ్యం ఇప్పటిది కాదు. వంగవీటి రంగా హత్య సమయంలో హోం మంత్రిగా ఉన్న ఇతగాడు అసమదీయులను కాపాడే విశ్వప్రయత్నం చేసాడని అంటారు. ఇతడి ఇంట్లో బాంబుల కర్మాగారంలో "ప్రమాదం" జరిగిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది.

   Delete
  3. పాతకథలు తవ్వుకుంటూ పోతే, కేసీఆర్ గారి టక్కుటమారాల నేపథ్యం కూడా ఇప్పటిది కాదు కదా. ఆయన దొంగపాస్‍పోర్టులు తయారు చేయించి మనుషుల్ని విదేశాలకు అక్రమరవాణా చేసేవాడనీ విన్నాం కదా.
   అన్నట్లు వైయస్ కుటుంబం ఫాక్షన్ నేపథ్యం కూడాిప్పటిది కాదు.
   ఏమంటారు?

   Delete
  4. రోకలిని ఇక తలకు గట్టిగా చుట్టడమే శ్రేయస్కరమేమో?

   Delete
  5. ఎవరికీ వీలైనది వాళ్ళు చేస్తారు, కాలం ఎవరికోసం ఏమీ ప్రత్యేకంగా చెయ్యదు మరియు ఆగదు ☺

   Delete
  6. రాజకీయనాయకులందరూ ఒక్క తాను ముక్కలే. మీరు కూడా నిరూపితం కానీ అంశాలను ప్రస్తావిస్తున్నారు. వారు అలా చేశారో లేదో నాకు తెలియదు. కానీ, ఒకవేళ తగిన ఋజువులు మీ వద్ద ఉంటే, ఇక్కడ కంటే పోలీస్ స్టేషన్ లేదా కోర్ట్ లలో ఇస్తే తగిన శిక్ష పడగలదు. అలా కాకుండా, ఎవరో అన్నారు ఇంకెవరో చెప్పారు లాంటి ఆరోపణలు ఇరువురికి సమయం వృధా. ఇక వైఎస్ కుటుంబ ఫ్యాక్షన్ అన్నది వారి తండ్రి రాజారెడ్డి కాలం నుండి మొదలైంది అన్నది అందరికీ తెలిసినదే. ఆ అంశాలకు ఈ వ్యాసానికి సంబంధం లేదు.

   Delete
 3. ఎవరైనా చచ్చిపోయినపుడు చల్లుతారే గులాం అని ఒక కలర్ గురించి మీకు తెలియదా ?

  @గొట్టిముక్కల ప్రతిసారీ పచ్చ బాకా ,పచ్చదండు అంటూ ఉంటారు.

  తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ రంగు గులాం అన్న సంగతి తెలుసా ?

  ఆంధ్రా స్పీకర్ గురించి ఆయన వ్రాస్తే తెలంగాణా స్పీకర్ గురించి నేను వ్రాసాను. అదికూడా అర్ధం కాలేదా ?

  ReplyDelete
  Replies
  1. ఒకే కానీ, నేను ఇక్కడ ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై నా అంచనాల గురించి. మీకు అది కూడా అర్థం కాక, సంబంధం లేని తెలంగాణ స్పీకర్ అంశం ఇక్కడకు ఎందుకు తెచ్చారు?

   Delete
  2. "ఎవరైనా చచ్చిపోయినపుడు చల్లుతారే గులాం అని ఒక కలర్"

   గులాం కాదు గులాల్. చావుకే కాదు అనేక సందర్భాలలో వాడతారు, ముఖ్యంగా హోలీలో.

   మధుసూధనాచారి మీది కేసు ఆయన అధికారిక చర్యల గురించి. ఇవే తరహా కేసులు యనమల & కోడెల మీదా ఉన్నాయి. కోడెల మీదున్న ఫాక్షన్ కేసుల లాంటివి చారి/యనమల వగైరాలపై లేవు.

   Delete
 4. >>>చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని నేను సమర్థించను. >>
  జైలులో 18 నెలలు గడిపి వచ్చినవాడిని సమర్ధించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో నాకు తెలియడం లేదు.


  ReplyDelete
  Replies
  1. మళ్ళీ మొదలెట్టారా? చూడండి మీకు చట్టం గురించి అవగాహన లేకపోతే, కావాలంటే గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. అతడు జైల్లో గడిపింది శిక్షగా కాదు, సాక్షులను ప్రభావితం చేస్తాడేమోననే అనుమానం సిబిఐ వ్యక్తం చేయటం వల్ల కోర్ట్ అతడిని రిమాండ్ లో ఉంచింది అంటే నిర్బంధం. దానికి, శిక్షకు తేడా తెలియకుండా మాట్లాడకండి. ఇక ఈ వ్యాసానికి, ఆ అంశానికి కూడా సంబంధం లేదు. నా వ్యాఖ్య చట్టానికి అనుగుణంగానే ఉంది. కాదని మీరు ప్రూవ్ చెయ్యగలిగితే చెయ్యండి. అభిప్రాయాలు కాదు, ఆరోపణలు కాదు. నిరూపిత నేరాల గురించి మాత్రమే మాట్లాడండి. చట్టప్రకారమే ...

   Delete
 5. TDP kevalam kula rajkiyyalu matrame chesthundhi

  ReplyDelete
 6. మళ్ళీ మొదలుపెట్టింది మీరే...చట్టం ఎవరికీ చుట్టం కాదు. 18 నెలలు కూర్చోబెట్టి మేపడానికి.
  ఇక్కడ స్పీకర్ గురించి ప్రస్థావన ఎందుకొచ్చిందో మీరు గొట్టిముక్కలగారిని అడగాలి.ఆయనకి సమాధానం ఇచ్చాను. పచ్చదండు అన్నదీ ఆయనే....ఆయనకే నా సమాధానం.

  వ్యాఖ్య వ్రాసే ముందు
  రంగులద్దేముందు
  ఒకింత పరికించుకోవాలి
  ఆకసానికి ఆకుపచ్చనీ
  గడ్డిపరకకు నీలాన్నీ అద్దకండి
  నవ్వుకూ కన్నీటికీ
  ప్రతి రంగుకూ ఓ భాష వుంటుంది
  కొంచెం గమనించండి.

  ఉన్నాయి కదా రంగులని
  ఊరికే అతిగా పులమకండి
  కోపం మరింత ఎర్రబడినా బాగోదు
  నవ్వులు తెల్లబడినా బాగోదు.

  ReplyDelete
  Replies
  1. same to you.
   ఒకసారి మీరు వ్రాసిన వ్యాఖ్యలన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకుని, నా పోస్ట్ కు సంబంధించినవే పెట్టారా లేదా అన్నది మీరే నిర్ధారించుకోవచ్చు.
   చట్టం ఎవరికి చుట్టం, ఎవరికి కాదు అన్నది నాకూ తెలీదు. కానీ, మీరు ప్రస్తావించిన వ్యక్తిని జైల్లో ఉంచింది కేవలం సాక్షులను ప్రభావితం చేస్తాడనే నెపం మీద రిమాండ్ ఖైదీగా. మీకింకా అనుమానాలుంటే గూగుల్ లో వెతుక్కుంటారో లేక డైరెక్ట్ న్యాయస్థానాలనే అడుగుతారో ట్రై చేసుకోండి. నేను చెప్పింది తప్పని ప్రూవ్ చేసి, ఆ తరువాత మళ్ళీ చెప్పండి. నేను నా అభిప్రాయాలూ చెప్పలేదు, చట్టప్రకారం ఏమి జరిగిందో చెప్పాను. ఉన్నాయి కదా ఊరికే పదాలన్నిటినీ వాడెయ్యకండి.

   Delete
  2. వంశీ కలుగోట్ల // వాడంతే ... //
   ****************************
   వాడేమీ సమాజానికీ
   సంకుచితాలకూ బందీ కాడు
   భావోద్వేగాలకు బంధువూ కాడు
   కులమతాలకూ, రాజకీయాలకూ తొత్తు కాడు
   అందరూ కలిసి ఒక కంచె కట్టి
   ఆ దడిలోనే వాడి భావాలను
   ఇమిడ్చి రాయమంటే ఎలా
   రాయకపోతే కవి కాదంటావా

   అయినా వాడేమీ ఇన్నాళ్ళూ
   నీ ఒప్పు కోసమో మెప్పు కోసమో రాయలేదు
   వాడిలో చలనం కలిగించే, బాధించే
   సంఘటనేదో జరిగినపుడు
   రాయాలనిపించే భావన కలిగినపుడు
   వాడే వాడికి తోచింది రాసుకుంటాడు

   నీకు నచ్చినట్టు రాయలేదని నిలదీస్తావెందుకు
   తెలుసుకో/గుర్తు పెట్టుకో
   వాడెప్పుడూ నువ్వు మెచ్చేది రాయలేదు
   వాడు రాసింది నువ్వు మెచ్చావు

   Delete

Post a Comment

Popular posts from this blog

వంశీ వ్యూ పాయింట్ - అరవింద సమేత వీర రాఘవ

... తెలుగోడి శతృవు