(రాజకీయాల్లో) ఒకటి + ఒకటి = ???
వంశీ కలుగోట్ల // (రాజకీయాల్లో) ఒకటి + ఒకటి = ??? //
********************************************************
రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పటికీ రెండు కాదు అంటారు. తెలంగాణ ఎన్నికలలో 'చంద్రబాబు' ఫాక్టర్ పని చేసినట్టు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 'కెసిఆర్' ఫాక్టర్ పని చేయగలదా?
తెలంగాణాలో కేవలం చంద్రబాబు ఫాక్టర్ మాత్రమే కాదు, మరికొన్ని అంశాలు పని చేశాయి. నా అవగాహనమేరకు చిన్న విశ్లేషణ
-> చంద్రబాబు పట్ల తెలంగాణాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది కేవలం తెదేపా స్థాయిలో కాక, చంద్రబాబు అనే వ్యక్తి పట్ల ఉన్న వ్యతిరేకతగా గుర్తించిన కెసిఆర్ దాన్ని ఆయుధంగా మలచుకున్నాడు.
-> నాయకులు తమ అవసరార్థం పొత్తులు కలుపుకున్నంత సులువుగా కిందిస్థాయి క్యాడర్ కలిసిపోరు అనటానికి తెదేపా - కాంగ్రెస్ పొత్తు ఉదాహరణ. వారి పొత్తు ఒక చారిత్రిక తప్పిదంగా నిలిచిపోయింది. అంతేకాదు దానిద్వారా తన రాజకీయ అవసరార్థం ఎంతకైనా దిగజారగలరు అన్న అపప్రధను చంద్రబాబు మూటగట్టుకున్నారు.
-> ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ, నాయకుడిగా ఒక బలమైన వ్యక్తి లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం ప్రధాన బలహీనత అయింది. కూటమి గెలిస్తే పాలన ఢిల్లీ మరియు అమరావతిల నుండి సాగుతుంది అన్న అభిప్రాయం బలపడింది.
అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
-> ప్రస్తుతం జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు చెబుతున్నదాని ప్రకారం స్థానికంగా చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది.
-> తెలంగాణాలో తెదేపా - కాంగ్రెస్ పొత్తు అక్కడ దెబ్బ కొట్టటమే కాక, ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు పట్ల సానుకూలతతో ఉండే తటస్థులలో వ్యతిరేకతను కలిగించింది.
-> తెలంగాణాలో ప్రతిపక్షానికి (కూటమికి) బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం తీవ్రంగా దెబ్బతీసింది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, జగన్ రూపంలో ప్రతిపక్షానికి, ప్రభుత్వ వ్యతిరేకులకు ఒక బలమైన స్థానిక నాయకత్వం ఉంది.
-> ఇపుడు జాతీయ స్థాయిలో తెరాస నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ పట్ల జగన్ చూపుతున్న సానుకూలత, జగన్ పట్ల సానుకూలత ఉండే తటస్థులలో వ్యతిరేకతను కలిగించవచ్చు.
పై అంశాలను పరిశీలిస్తే, ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తటస్థులు గతంలో ఎన్నడూ లేనంత కీలకం కానున్నారని అర్థమవుతోంది.
-> తెదేపా - కాంగ్రెస్ పొత్తు లేదా లోపాయికారీ ఒప్పందం పట్ల చంద్రబాబు పట్ల సానుకూలత ఉండిన తటస్థులలో వ్యక్తమయ్యే వ్యతిరేకత
-> జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ పట్ల జగన్ సానుకూలత చూపడం వల్ల, జగన్ పట్ల సానుకూలత ఉండిన తటస్థులలో వ్యక్తమయ్యే వ్యతిరేకత
ఈ రెండింటిలో ఏది బలంగా వ్యక్తమవుతుందనేది ఎన్నికలలో జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశం అధికం.
ఒక విషం ఏంటంటే - స్థానికంగా తెదేపా లేదా తెరాస లేదా జగన్ పట్ల ఉన్న వ్యతిరేకత కంటే రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. ఆ రెండింటి పట్ల సానుకూలత ఎవరు చూపినా, ఆ వ్యతిరేకత వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది .
Comments
Post a Comment