వంశీ వ్యూ పాయింట్ - అరవింద సమేత వీర రాఘవ
వంశీ వ్యూ పాయింట్ - అరవింద సమేత వీర రాఘవ
******************************************************
ఓటమి ఎదురైనపుడు, నైరాశ్యంలో ఉన్నపుడు కొందరు విరామం తీసుకుంటారు, తమను తాము సమీక్షించుకోవటానికి. మరికొందరు ఇతరులు విజయం సాధించిన మార్గం దిశగా తమ పయనాన్ని మార్చుకుంటారు. ఇప్పటికే కాపీ దర్శకుడు అనే అపప్రధ మోస్తున్న త్రివిక్రమ్, ఇపుడు బోయపాటిలా సినిమా (అంతకంటే హింసాత్మకంగా కూడా) సినిమా తీశాడని అనిపించుకోవడం బోయపాటి విజయమా లేక త్రివిక్రమ్ వైఫల్యమా? అజ్ఞాతవాసి వంటి ఘోర వైఫల్యం తరువాత మళ్ళీ ఇటువంటి చిత్రం తీయడం త్రివిక్రమ్ సత్తా మీద సందేహం వచ్చేలా చేస్తుంది. అజ్ఞాతవాసి చిత్రానికి ఫ్రెంచ్ దర్శకుడు బహిరంగంగా విమర్శలు చేయడంతో, అజ్ఞాతంలోకి వెళ్లిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ చొరవతో బయటపడ్డట్టున్నారు. అయినా కూడా ది ఫామిలీ అనే ఆంగ్ల చిత్రం; మిర్చి, ఆది లాంటి సినిమాలు కలగలిపి సినిమా తీసేశాడని అనిపించుకున్నాడు. (డా. వేంపల్లి గంగాధరం గారు, ఏ కారణాల చేతనో తన పోస్ట్ తీసెయ్యటం వలన నేను ఇక్కడ దానిని ప్రస్తావించటం లేదు)
గతంలో ఎపుడో ఒకసారి రాజమౌళి గారు ఒకమాట చెప్పారు, 'నేను కొత్త కథలు తీయటంలేదు, తెలిసిన కథనే కొత్తగా నాకు తెలిసిన/నచ్చిన విధంగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను' అని. ఆయన చెప్పాడు, మిగతా వాళ్ళు చెప్పటం లేదు కానీ అందరూ అదే చేస్తున్నారు. అలానే చాలామంది అరగదీసి ఫ్యాక్షన్ నేపథ్యాన్ని త్రివిక్రమ్ తనకు తెలిసిన రీతిలో చెప్పాలని ప్రయత్నించాడు. అదే 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం. విషయానికి వస్తే, మన తెలుగు తెర మీద విసుగు పుట్టేలా అరగదీసి ఫ్యాక్షన్ కథ ఇది. ఈ చిత్రంపై జనాల్లో ఆసక్తి కలగటానికి కారణం జూనియర్ ఎన్టీర్, మేధావి దర్శకుడిగా పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఈ చిత్రం రూపొందటం. సినిమా కథ ఎలా ఉంది అనే చర్చ అనవసరం - అన్ని ఫ్యాక్షన్ కథల్లానే రెండు వర్గాలు/గ్రామాలు మధ్య గొడవలు తరతరాలుగా కొనసాగుతూ అనేక ప్రాణాలను బలి తీసుకుంటుంటాయి. అటువంటి సమయంలో ఆ పరిస్థితిని మార్చటానికి నడుం బిగించిన ప్రధాన పాత్రధారి ప్రతినాయకుడిని మాటలతో సమాధానపరచటానికి ప్రయత్నిస్తాడు. ఎలాగూ ప్రతినాయకుడు వినడు కాబట్టి, అతన్ని చంపేసి సీమలో శాంతిని నెలకొల్పుతాడు. ఎవరు ఫ్యాక్షన్ అంశంతో సినిమా తీసినా ఇదే కథ. ఇందులోనూ అదే కథ. కొన్నేళ్ళ క్రితం వచ్చిన ప్రభాస్ మిర్చి చిత్రంలానే ఉంటుంది ఈ చిత్రం, ఏవో కొన్ని మార్పులు, చేర్పులు తప్పించి. కాకపొతే, కొరటాల శివ 'మిర్చి' చిత్రం చాలా బాగా తీశాడు.
'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం కథనం విషయానికి వస్తే - సినిమా ప్రారంభం అయిన పది నిమిషాలకే పొరపాటున మనం బోయపాటి శ్రీను తీసిన సినిమాకు వచ్చామా అనిపిస్తుంది, ఇంకో పది నిమిషాలు గడవగానే 'ఇదేంటి, ఈ దర్శకుడు బోయపాటి కన్నా ఘోరంగా/దారుణంగా హింసను/రక్తపాతాన్ని చూపుతున్నాడు' అని భయాందోళనలకు లోనవుతాం. ఇక అక్కడినుండి అంతే ... బోయపాటిని ఎలాగైనా దాటెయ్యాలనే ప్రయత్నమే అడుగడుగునా ఈ చిత్ర కథనంలో. అజ్ఞాతవాసి చిత్రం దారుణ పరాజయం నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న త్రివిక్రమ్, కాస్త కలం పదును చూపగలిగాడు కానీ తీతలో మాత్రం మరింత దిగువకు జారిపోయాడనే అభిప్రాయం కలుగుతుంది.
ఇక సంభాషణల్లో మాత్రం అజ్ఞాతవాసి నుండి బయటకొచ్చి, తన పూర్వపు స్థాయికి దగ్గరకు వచ్చాడనిపిస్తుంది. కాకపొతే ఈ సినిమా తీయటానికి ముందు రాయలసీమ యాస మీద అధ్యయనం చేశానని చెప్పుకున్న త్రివిక్రమ్ గారికి రాయలసీమలో రెడ్డికి, అయ్యకు తేడా తెలియకపోవడం విచిత్రం. వీర రాఘవ రెడ్డిని అందరూ 'చిన్నయ్యా' అని పిలుస్తారు, 'చిన్న రెడ్డి' అని కాదు. ఇక బసిరెడ్డి (అదే జగపతిబాబు పాత్ర) మారుస్తావ్ అన్న పదాన్ని మారుచ్చావ్ అని మాటి మాటికీ అంటూంటే లేచి బయటకొచ్చేద్దాం అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే - ఇది జూనియర్ ఎన్టీఆర్ మరియు జగపతిబాబు సినిమా అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కు ఇదేం కొత్త కాదు, ఆది సినిమా రోజుల్లోనే ఇలాంటి పాత్రలను ఔపోసన పట్టాడు, అలవోకగా చేసుకుపోయాడు. రాయలసీమ యాసగా త్రివిక్రమ్ రాసిన కొన్ని (లా బదులు ల్యా అనడం లాంటివి) పలకడంలో మాత్రం సాధికారికత కనబడలేదు. అలాగని తప్పుగా పలకలేదు. ఈ మధ్యన వైవిధ్యభరిత చిత్రాలను చేస్తున్న ఎన్టీఆర్ మళ్ళీ ఈ చిత్రం చేయటం అవసరమా అనిపిస్తుంది. ఇక ప్రధాన ప్రతినాయకుడిగా జగపతిబాబు బసిరెడ్డి పాత్రకు ప్రాణం పోశారు. ఒక్క సీమ యాస సంభాషణలు వదిలేస్తే, జగపతిబాబు ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు అని చెప్పవచ్చు. కానీ, ప్రకాష్ రాజ్ పాత్ర (అంతఃపురం చిత్రంలో) ఛాయలు/అనుకరణ కనబడుతూనే ఉంటాయి. నవీన్ చంద్ర ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ పరవాలేదు. చాలా రోజుల తర్వాత సహాయక పాత్రలో కనిపించిన సునీల్ ఆకట్టుకుంటాడు. ఇక పూజా హెగ్డే గురించి, ఏంటి అందరి గురించి చెప్పాక తన గురించి అనుకుంటున్నారా? పేరైతే ఆ పాత్ర పేరు మీద పెట్టారు కానీ, తన పాత్ర ప్రాధాన్యత అంతకుమించి లేదు మరి. తనవరకూ గ్లామర్ షో లేకుండా కూడా ఆకట్టుకోగలను అనే నమ్మకాన్ని సంపాదించుకుంది ఈ సినిమా ద్వారా. ఇక ఈషా రెబ్బా అసలు ఈ సినిమా ఎందుకు చేసిందబ్బా? ఇక త్రివిక్రమ్ సినిమా అంటే ఉండే మామూలు బ్యాచ్ అందరూ బానే చేశారు.
తమన్ పాటలకు ఎలాంటి సంగీతం ఇచ్చినా నేపథ్య సంగీతం మాత్రం దడ పుట్టేలా అదరగొట్టాడు. వీర రాఘవ రెడ్డి అదే ఎన్టీఆర్ చేతిలోకి కత్తి రాకముందే తమన్ సంగీతం భయం పుట్టిస్తుంది. పి ఎస్ వినోద్ ఛాయాగ్రహణం చాలా బావుంది. ఎడిటర్ కు కాస్త స్వేచ్ఛ ఇచ్చి ఉంటే, మనకు కాస్త తక్కువ నిడివి సినిమా చూసే అదృష్టం ఉండేది. హారిక హాసిని నిర్మాణ విలువలు బావున్నాయి. ఇక సందేశం అంటారా, ఈ సినిమాలో ఫ్యాక్షన్ మానెయ్యాలనే సందేశం ఉంది అనే మేధావి బుర్ర నా ... లకు, తమరు దయచేసి మరొక్కసారి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, చెన్నకేశవరెడ్డి, సీమసింహం, రణం, అంతఃపురం ... గట్రా సినిమాలన్నీ యూట్యూబ్ లో చూసుకుని తరించండి, దయచేయండి. థియేటర్ నుండి బయటకు వచ్చాక ఒక సందేహం వెంటాడుతుంది 'త్రివిక్రమ్ ఈ సినిమాను హింసాత్మకంగా తియ్యాలనుకున్నాడా లేక హింసించాలని తియ్యాలనుకున్నాడా?' ... ఏమో శివయ్య ఏటనుకుంటన్నాడో ఎవరికెరుక. అదీ సంగతి మరి.
Comments
Post a Comment