... తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రకటనపై సమీక్ష

వంశీ కలుగోట్ల // ... తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రకటనపై సమీక్ష //
***********************************************************
          ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం కెసిఆర్ కు లాభిస్తుందా లేక దెబ్బ తింటాడా? పైపైన చూస్తే కెసిఆర్ కు గెలుపు అతి సులువు అన్నట్టే కనబడుతోంది. కానీ, చిన్న సంశయం కూడా. ఒకసారి కెసిఆర్/తెరాస బలాబలాలు సమీక్షించుకుంటే

అనుకూలతలు
-> తెరాస ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి లేదు. ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గాడిన పడటానికి ఇంకా సమయం అవసరమని అధికులు భావిస్తున్నారు. 
-> అద్భుతంగా ఉందని అనకపోయినప్పటికీ విభజన తరువాత పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఎన్నోరెట్లు మెరుగ్గా ఉంది. దీన్ని ఆర్థిక వనరుల దృష్ట్యా చెప్పడం లేదు. పాలన తీరు గురించి. కెసిఆర్ ఎంతటి సమర్థనాయకుడో, తెరాసలో ఉన్న ద్వితీయస్థాయి నాయకత్వం బలమేంటో తెలిసివస్తోంది.
-> ప్రతిపక్షాలకు సరియైన, ప్రజాకర్షక నాయకుడు లేకపోవడం అన్నది ఖచ్చితంగా తెరాసకు అనుకూలించే మరొక విషయం. అంతేకాదు, విపక్షాల మధ్య ఐక్యత కూడా లేదు. ముందస్తు వల్ల అభ్యర్థులను హడావుడిగా ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి గందరగోళం సృష్టించేలానే ఉంది. ప్రతిపక్షాలలో కాంగ్రెస్ మినహా మిగతా ఎవరూ బలంగా లేరు. కాంగ్రెస్ తో కలిస్తే లాభపడతారో లేదో తెలియని స్థితి.
-> కాంగ్రెస్ - తెదేపా కలిస్తే ఖచ్చితంగా అది కూడా కెసిఆర్ కు లాభించే అంశంగానే అనిపిస్తోంది. సాంప్రదాయ, సిద్ధాంత శత్రువులైన కాంగ్రెస్ - తెదేపాల కలయిక నాయకులు ఒప్పుకోవలసివస్తుందేమో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల స్థాయిలో అది వికటించేదిగానే ఉంటుందని అనిపిస్తోంది. అది తెరాసకు ఖచ్చితంగా లాభించే అంశమే.
-> మరో విషయం, ఖచ్చితంగా భాజపా సహాయం లోపాయికారీగానైనా లభిస్తుంది. ఎందుకంటే, సార్వత్రిక ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ బలం పుంజుకోవడం భాజపాకు ఇష్టం లేదు. అందునా, తెలంగాణాలో అధికారం చేజిక్కించుకుంటే కాంగ్రెస్ కు జవసత్వాలు వచ్చినట్టే. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను కాంగ్రెస్ చేతుల్లోకి పోనివ్వటానికి భాజపా సిద్ధంగా లేదు. అలాగని తమకు తాము అధికారం దక్కించుకోగలిగే బలమైన పరిస్థితి లేదు. తెరాస, కాంగ్రెస్ కాకుండా మిగతా అందరినీ కలుపుకున్నప్పటికీ అధికారం అందే పరిస్థితి లేదు. తెరాసకు లోపాయికారీగానో, బహిరంగంగానో మద్దతు పలకడం వినా వేరు మార్గం లేదు.

అననుకూలతలు
-> తెరాస ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి లేకపోవచ్చు కానీ ప్రజలు పూర్తి సంతృప్తిగా అయితే లేరన్నది అందరి మాట. అది విజయావకాశాలను దెబ్బతీసే స్థాయిలోకి ప్రతిపక్షాలు మార్చుకోగలిగే అనే భయం తెరాసలో ఎక్కడో ఉంది.
-> ముందస్తు ఎన్నికలకు వెళ్ళినపుడు అధికార పార్టీలు దెబ్బ తినడమే ఎక్కువగా జరిగిన చరిత్ర కూడా తెరాసను ఆందోళన పరచే అంశం.
-> దేశం మొత్తం కుదేలవుతున్న కాంగ్రెస్, తెలంగాణాలో మాత్రం కాస్త బలంగా కనిపిస్తోంది. విపక్షాలను అన్నింటినీ కలుపుకుపోగలిగితే ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు.
-> కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు కొద్దిగానైనా ఇబ్బంది పెట్టే అంశాలే. హరీష్ రావు విషయంలో అతని అసంతృప్తి నివురుగప్పిన నిప్పులానే ఉంది.
-> కోదండరామ్ దూరం కావడం ఎంతవరకూ దెబ్బతీయగలదో ఇదమిద్ధంగా తెలియకపోయినా, విద్యార్థులు - విద్యావంతులు కొద్దిశాతంలోనైనా పార్టీకి దూరమవుతారేమోనన్న ఆందోళన ఉంది.

          మొదటే చెప్పుకున్నట్టు ప్రస్తుత పరిస్థిలను సమీక్షిస్తే కెసిఆర్ గెలుపు సులువుగానే అనిపిస్తోంది. అంతోఇంతో స్థాయిలో కాంగ్రెస్ మినహాయించి ఇబ్బందిపెట్టే స్థాయిలో ఇతర ఏ ప్రతిపక్షాలూ లేకపోవడం తెరాసకు అనుకూలించే ప్రధాన అంశం.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన