... నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు
వంశీ కలుగోట్ల // ... నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు //
****************************** ********************
వెనకటికెవడో నన్ను కాదు, దమ్ముంటే
వాడిని కొట్టు అన్నాడట, అలా ఉంది నేటి హిందూ
సంఘాల వ్యవహారం. హిందూ ధర్మ సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, దేవీదేవతలను
మేధావి వర్గంగా ముద్రపడిన వారు తెగ విమర్శిస్తున్నారు. అది ఈనాడు కొత్తగా జరుగుతున్నది కాదు, దశాబ్దాలుగా జరుగుతున్నది. దాని వెనుక కారణాలు అన్వేషించే ఆలోచన కూడా ఇరువైపులవారికీ లేదు. స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ముందుగా అణగారిన వర్గాలను (అణచివేయబడిన వర్గాలు అనడం సరియైనది ఏమో)
తన పోరాటంలో భాగం చేశాడు. వారు ప్రధానంగా ఎదుర్కుంటున్న అనేకానేక సమస్యలను
ఎక్కడికక్కడ స్థానికంగా వీలైనంత పరిష్కారం లేదా సర్దుబాటు వంటివి చేసి
అందరినీ స్వాతంత్ర్యోద్యమం దిశగా నడిపించాడు. (సరే ... గాంధీ ఉద్యమతీరు
గురించి మరో వ్యాసంలో చెప్పుకుందాం.) అణగారిన/అణచివేతకు గురైన వర్గాలు అంటే ప్రధానంగా
దళితులు, తదితరుల వెనుకబాటు తనానికి అగ్రవర్ణాల అణచివేత, బహిష్కరణ,
తక్కువచేసి చూడటం వంటి అనేకానేక కారణాలు వారికి హిందూ ధర్మం పట్ల
ద్వేషభావాన్ని పెంపొందించాయి. దాన్ని అంది పుచ్చుకున్న అవకాశవాదులు కొందరు
అయితే, వారి తరఫున వారికి అండగా నిలబడ్డవారు కొందరు. దురదృష్టం కొద్దీ ఈ రెండు వర్గాలవారు మేధావులుగానే ముద్రపడ్డారు.
హిందూ ధర్మం పట్ల విమర్శల గురించి కదా మనం మొదలెట్టింది (హిందూ
ధర్మాన్ని విమర్శించేది ఇతరుల కంటే అత్యధికంగా హిందువులే) - అటువంటి విమర్శలకు తగిన సమాధానమిచ్చేవారే లేరు. అందునా రాజకీయంగా, చట్టపరంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నోరు మెదిపి సమాధానం ఇస్తే ఎటువంటి కేసు పెట్టి ఇబ్బంది పెడతారో అని భయం - అందునా ఏదైనా కేసు మీద లోపలికెళితే, అవతలివారిలో ఉన్నంతటి ఐకమత్యం లేదు కాబట్టి తమ
తరఫున ఎవరూ పోరాడరు అని నమ్మకం. అందుకే సద్విమర్శల స్థాయి నుండి, తార్కిక
వాదనల స్థాయి నుండి ప్రతి అడ్డమైన వాడు నోటికొచ్చిన కూతలు మాట్లాడినా ఎదురు
చెప్పలేని స్థితికి చేరుకున్నారు. అంతే కాకుండా, 'హిందూ ధర్మాన్ని అంటావు
కానీ ముస్లిములను, క్రైస్తవులను అనే దమ్ము ఉందా?' అని చేతకాని వాదన ఒకటి.
వాడు నిన్ను లేదా నువ్వు నమ్మే విషయాన్ని తిట్టాడు. నువ్వు నమ్మినది నిజమని
అనిపిస్తే నిలబడు, మాట్లాడు, వాడిలా నోరు పారేసుకుని అడ్డమైన మాటలూ
మాట్లాడవలసిన పని లేదు. జాగృతం కా - నిజమని నమ్మినదానిపై నీ దగ్గర ఉన్న
వాదన వినిపించు. ఇవాళ నీకు పేపర్, టీవీ ఛానల్ ఇలా ఎటువంటి ప్రత్యేక
మాధ్యమమూ అవసరం లేదు; దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ లో వీడియో తీసి సామాజిక
మాధ్యమాలలో పోస్ట్ చెయ్ లేదా ఇదిగో నాలా ఒక వ్యాసమో మరోటో రాసి పోస్ట్
చెయ్. చదివే వాడు చదువుతాడు, చూసే వాడు చూస్తాడు - నచ్చినవాడు నువ్వు
చెప్పింది నమ్ముతాడు. అవతలి వర్గం వాడు మళ్ళీ వాడి వాదనతో వస్తాడు -
ఇపుడంతా తెలివితేటల ప్రదర్శన, దూషణల పర్వమే తప్పించి నిజానిజాలను
అన్వేషించాలనే తపన ఎవరికీ లేదు. హేతువాదులుగా ముద్రపడ్డవారు కూడా గతంలో
వారి వర్గంలోని వారు (అనగా హేతువాదం) ఎవరో రాసిన పుస్తకాలను ఉదాహరించడమే
తప్పించి స్వయంగా పరిశోధన చేసినవారు బహు అరుదు. అటు - ఇటు, ఇద్దరూ అంతే.
'ఎద్దు ఈనింది అంటే గాటికి కట్టేయ్' అనే రకంగా తయారయ్యారు.
విమర్శలు చేసేవారిలో రెండో రకం వారి గురించి చెప్పుకున్నాం కదా -
అవకాశవాదులు. ఇటువంటి వారు తమకున్న ప్రత్యేక కార్డును ఉపయోగించుకుని
బతికిపోతుంటారు. అడ్డమైన మాటలు మాట్లాడటం - ఏమిటిది అంటే భావప్రకటనాస్వేచ్ఛ
మీద దాడి చేస్తావా అంటూ ఎదురుదాడి చెయ్యటం అలవాటైపోయింది. అన్నట్టు
మర్చిపోయాను వీళ్ళు కూడా 'నన్ను కాదు దమ్ముంటే వాడిని కొట్టు' వాదాన్ని ఈ
మధ్యనే ప్రాక్టీస్ చేస్తున్నారులా ఉంది. ఇవాళ మీ దేవుడిని తిట్టాడని మా
వాడిని ఇబ్బందిపెడుతున్నారు, అప్పట్లో ఇదిగో మీ అగ్రవర్ణాల వాళ్ళు ఇంతమంది
మీ దేవుళ్లను నానామాటలు అన్నారు అప్పుడేమనలేదే' అని అడ్డగోలు వాదన ఒకటి
మొదలు పెట్టారు - దొందూ దొందేలాగా తయారయ్యారు. తార్కిక వాదనలు వంటివి
ఇటువంటి అవకాశవాదులకు నప్పదు. ఏవో నాలుగు పుస్తకాలు చదవగానే
మహాజ్ఞానులైపోతారు - ఇక చూసుకోండి ఆ జ్ఞానమంతా బూతుల్లో బయటపడుతుంది.
హేతువాదమంటే బూతులు తిట్టటం కాదురా నాయనా అంటే, భావప్రకటనాస్వేచ్ఛ మీద దాడి
అంటారు.
మొత్తానికి ఇరు వర్గాల వారిలోసాధ్యమైనంతవరకూ జనాలను రెచ్చగొట్టి,
ప్రచారం పొందాలనే యావ తప్పించి సహేతుకమైన చర్చ చేద్దామనే ఆలోచన లేదు.
హేతువాదులకు ఒక విజ్ఞప్తి - అయ్యా మీరు అనగా హేతువాదపు ముసుగేసుకున్న
అవకాశవాదులు అడ్డమైన బూతులూ మాట్లాడి జనాలను రెచ్చగొడుతున్నారు తప్పించి -
అంశాన్ని తార్కికంగా లేదా సహేతుకంగా వివరించి, నిజాలుగా తాము భావించేవాటిని అవతలివారికి చెప్పే ఓపిక లేదు. హేతువాదులు అటువంటి అవకాశవాదులను
భుజాన మోస్తూ సామాజిక అసహనానికి, అశాంతికి కారణం కావద్దండి. ఇప్పుడేదో
సామరస్యంగా ఉన్నారని కాదు - కానీ, ఇంతకంటే దిగజారిన స్థితికి
తీసుకెళ్ళేవాళ్ళని ప్రోత్సహించవద్దండి. ఇపుడు సమస్య రాముడు ఉన్నాడా లేడా
అని కాదు; ఉన్నాడని చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్న వారిని, లేడు అని
తార్కికంగా చెప్పగలిగే ఓపిక లేకుండా బూతులు తిట్టి రెచ్చగొట్టి ప్రచారం పొందాలనే యావ ఉన్నవారిని ఎలా సంభాళించాలా
అన్నది సమస్య. హేతువాదులంటే ఒకపుడు నిజంగా చాలా గౌరవం ఉండేది, సమాజానికి
ఎదురీది నిలబడే దమ్మున్నవారు అని. ఈనాడు సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టే
మూర్ఖులను ఆ గుంపులోకి చేర్చకుండా ఆ విలువను కాపాడండి. లేకపోతే మీది ఒక
మతంలా మారిపోగలదు ... బహుశా, ఇప్పటికే మారిపోయిందేమో అనిపిస్తోంది తీరు
చూస్తోంటే. అవును, ఇపుడు హేతువాదం అంటే అదొక కొత్త మతం. కొత్త మతం వచ్చింది, ఇక తన్నుకు చావండి.
Comments
Post a Comment