'అర్జున్ రెడ్డి' అనే జీవితం గురించి

వంశీ కలుగోట్ల // 'అర్జున్ రెడ్డి' అనే జీవితం గురించి //
************************************************************
            కథ అయితే ఎలా ఉందో చెప్పొచ్చు, కానీ ఒక జీవితాన్ని చూపిస్తే ... ఏం చెప్పాలి? సినిమా చూద్దామని వెళితే 'అర్జున్ రెడ్డి' అనే వ్యక్తి జీవితాన్ని చూపారు.  అప్పట్లో ఒకసారి 'ప్రేమ్ నగర్' సినిమాలోని ' ... నేను నవ్వాను లోకం ఏడ్చింది; నేను ఏడ్చాను లోకం నవ్వింది; నాకింకా లోకంతో పని ఏముంది ...' అన్న పాట విని ఆ పాట రాసిన ఆత్రేయ గారిని ఎవరో అడిగారట 'ఏంటండీ ఆ పాట అర్థం పర్థం లేకుండానూ...' అని. దానికి ఆత్రేయ గారు 'చూడండి, సినిమాలో పాత్ర ఏంటి? ఒక తాగుబోతు తాగి ఆడుతూ పాడే పాట. తాగుబోతు తాగిన తరువాత మాట్లాడే మాటలకి, పాటలకి అర్థం ఏముంటుంది చెప్పండి' అన్నారట. ఇంకేం మాట్లాడతారు. ఈ 'అర్జున్ రెడ్డి' కూడా అంతే. అతి కోపిష్టి, కోపం వస్తే ఏం చేస్తాడో తెలీదు చేసేస్తాడు అంతే. వాడొక ఎదవ, పర్వర్ట్, సైకో, నచ్చితే 'తనది' అనుకునే రకం, తనది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళే రకం, తనను మించి మరెవరినీ అధికంగా ప్రేమించలేని రకం. అర్జున్ రెడ్డి ఒకలాంటి వ్యక్తి, వాడంతే. వాడు మనకు నచ్చినా, నచ్చకపోయినా వాడు అలానే ఉంటాడు. 
            మొత్తానికి ఇన్ని రోజులయ్యాక నేను 'అర్జున్ రెడ్డి' సినిమా చూశాను. వివాదాస్పదమైన విషయాలు సినిమాకు బహుశా అతి ప్రాచుర్యం కల్పించాయేమో కానీ, అసలివి ఇందులో ప్రధానాంశాలు కాదు. నిజం, మొదట్లో కాసింత ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ, కథ ముందుకు ... సారీ కథగా అనిపించదు, అర్జున్ రెడ్డి జీవితం ముందుకు సాగుతుంటే మనం ఆ పాత్ర మీద కోపం, జాలి, అసహ్యం, ఆసక్తి తదితర భావాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇక ఆ వివాదాస్పద ముద్దుల విషయానికి వస్తే - జీవితంలో అవీ భాగమే కదా. కాకపొతే మన సినిమాల పరిధికి కాస్త మితిమీరి చూపారని అనుకోవచ్చు. కానీ, ఇదేమీ కొత్త కాదు. ఈ సినిమాలో ఆ సన్నివేశాలను అసభ్యతగా లేదా కమర్షియల్ అంశంగా కంటే ప్రేమ వ్యక్తీకరణ కనబడేలానే చూపారని నాకనిపించింది, మొదట్లో వారిద్దరి మధ్య శృంగార సన్నివేశాలు మాత్రం ఇందుకు మినహాయింపు, అవి సినిమాలో అంతగా చూపాల్సిన అవసరం లేదనిపించింది. కాకపొతే అర్జున్ రెడ్డి లాంటి వ్యక్తి జీవితంలో అవి అలానే అతిగా ఉంటాయి. అర్జున్ రెడ్డి లాంటోళ్ళు వర్జ్యాలు, తిథులు, స్థలాలు చూసుకునే రకం కాదు. ఎక్కడ ఏది అనిపిస్తే అది చేసే రకం. అలాంటోళ్ళకు ఎదురయ్యే అనుభవాలూ అలానే ఉంటాయి. మీ వీధిలోనో, ఊరిలోనో ఉండే ఇలాంటి తలపొగరు, తిక్క నా ... ల జీవితాలు ఎలా తయారయ్యాయో మీకు తెలిస్తే అర్జున్ రెడ్డి సినిమాగా కనిపించదు. కాకపొతే చివర్లో సినిమా తరహాలోనే ముగించాలి కాబట్టి ముగించారు. 'అర్జున్ రెడ్డి' సినిమాగా మాట్లాడుకుంటే, కథాపరంగా 'దేవదాసు'ను ఇప్పటి వ్యక్తి కోణంలో, ఇప్పటి తరహాలో తీశాడు. అప్పటి దేవదాసులో పొసెసివ్నెస్ అప్పటికి అతిగా అనిపించి ఉండొచ్చు, ఇప్పటి అర్జున్ రెడ్డి లోని పొసెసివ్నెస్ మనకూ అతిగానే అనిపిస్తుంది. కానీ, అలాంటోళ్ళను మనం చూస్తూనే ఉంటాం. అలాంటోళ్ళలో ఒకడే ఈ అర్జున్ రెడ్డి. ఈ చిత్రంలో ఒక డైలాగు ఉంటుంది 'మనం ప్రేమించిన వాళ్ళు చనిపోవడం వేరు, వదిలేసి పోవడం వేరు' అని. అవును, నిజంగా ఇద్దరు ప్రేమించుకున్నపుడు ఒకరు వదిలేసి పొతే ఎలా ఉంటుందో అర్జున్ రెడ్డిని చూస్తే తెలుస్తుంది. అలానే ఎందుకవ్వాలి అంటే, అది అర్జున్ రెడ్డి కోణంలోంచి చూడాలి. అతడికి అదే తెలుసు, రియలైజ్ అవ్వడానికి వాడికి నాన్నమ్మ మరణం అవసరమైంది. ముగింపు మళ్ళీ కథగా మారి, సినిమాటిక్ గా ముగిసిపోతుంది. 
            అర్జున్ రెడ్డి పాత్రధారి విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు విజయ్ ఎక్కడా కనబడడు, అర్జున్ రెడ్డి మాత్రమే కనబడతాడు. అర్జున్ రెడ్డిని మనమంతా ఫీల్ అయ్యేలా చేశాడు. పాత్ర తనవ్వలేదు, తానే పాత్రగా మారిపోయాడు. నటన, ఆహార్యం ఇలా ప్రతిదీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవించాడు. బహుశా ఈ సినిమా తరువాత కొన్నాళ్ళు/కొన్నేళ్ళు అతడు అర్జున్ రెడ్డిలానే ప్రవర్తించినా ఆశ్చర్యపోనక్కరలేదు. తాను అంతగా ప్రేమించి మరీ ఈ పాత్రను పోషించినట్టు అనిపిస్తుంది. ఈ పాత్ర దక్కడం, అదీ కెరీర్ ప్రారంభదశలో అతడి అదృష్టం. అర్జున్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలోని ప్రతి భావోద్వేగాన్ని తాను అనుభవించాడనిపించేలా వ్యక్తీకరించాడు. విజయ్ లాంటి నటుడు ఈ విజయంతో కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకుండా ఇలా వైవిధ్యభరితమైన చిత్రాలలో, నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషిస్తే బావుంటుంది. ఇక విజయ్ తరువాత, అర్జున్ రెడ్డి మిత్రుడి పాత్ర పోషించిన రాహుల్ రామకృష్ణ, విజయ్ తో సమానంగా ప్రాస్తావించదగ్గ నటనను ప్రదర్శించాడు. పాత్రలో జీవించాడు అనటం కరెక్ట్ ఏమో. సున్నితమైన భావాలను అత్యంత సమర్థంగా వ్యక్తీకరించాడు. కథానాయిక షాలినీ పాండే, ఉన్న కొద్ది పరిధిలో బానే చేసింది. కానీ, బలమైన పాత్ర కాకపోవడం, పాత్రచిత్రణలో స్పష్టత లేకపోవడం వంటివి షాలినిని పరిమితుల్లో బంధించేశాయి. 
            సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం. అర్జున్ రెడ్డి భావోద్వేగాలను చూపే తరహాలో, ఆ భావోద్వేగాలను మనం ఫీలయ్యే తరహాలో చాలా చక్కగా నేపథ్య సంగీతం అందించాడు రాధన్ ప్రశంసలకు అర్హుడు. బాగా నచ్చిన మరొక విషయం ఏంటంటే ఏ పాట కూడా కథకు ఆటంకంగా అనిపించదు. అలా కథలో భాగంగా, కథాగమనంలో అంశంగా సాగుతాయి. ఫోటోగ్రఫీ కూడా చక్కగా కుదిరించి. చివరగానే అయినా అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సందీప్ రెడ్డి వంగా గురించి. పైకి మనం ఎన్ని చెప్పుకున్నా, విజయ్ ని ఇతర నటీనటులను ఎంతగా ప్రశంసించినా వాటన్నిటి వెనుకా సందీప్ తపన ఉంది. ఇది తన మొదటి చిత్రం అంటే నమ్మలేం, మరో సినిమా మళ్ళీ ఇలా తియ్యగలడా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డిలో ప్రతి సన్నివేశంలో తనీ పాత్రను ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది. సందీప్, 'బాబు'లతో సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలాంటి పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ చేస్తే బావుంటుందని నాలాంటి సినిమా పిచ్చోడి దురాశ. 
            అర్జున్ రెడ్డి సందేశాలివ్వడు, వినోదాన్నివ్వడు. ఒక జీవితాన్ని మనకు చూపుతాడు అంతే. ఇందులో ఒక సంభాషణ ఉంటుంది, కాంచన చెప్పే మాట 'మనం ప్రేమించిన వాళ్ళు చనిపోవడం వేరు, వదిలి వెళ్లిపోవడం వేరు, ఆ బాధను వాడు అనుభవించనీ' అంటుంది. మనం విపరీతంగా ప్రేమించినవాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు చనిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. రెండవది తెలీదు, బహుశా వదిలేసిపోయిన వారిని నేను నిజంగా అంత ప్రేమించలేదేమో మరి. కానీ, ఆ డైలోగ్ సినిమాలో విన్నపుడు, గుండెల్లో ఎక్కడో తడి అయిన భావన. భావోద్వేగాల్ని అదిమి పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి ఆ తడి అక్కడే ఆగిపోయింది. 'అర్జున్ రెడ్డి' చూడాలనుకుంటే, ఒకటే తెలుసుకోండి అది ఒక జీవితం ... చివరగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ... టేక్ ఎ బౌ మై డియర్స్. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన