వైఎస్ఆర్సిపీ ప్లీనరీలో ప్రకటించిన హామీలు - పరిశీలన ???
వంశీ కలుగోట్ల // వైఎస్ఆర్సిపీ ప్లీనరీలో ప్రకటించిన హామీలు - పరిశీలన ??? //
****************************** ***********************************
వైఎస్ఆర్సిపీ ప్లీనరీలో ప్రతిపక్షనేత జగన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని హామీలు ప్రకటించారు. ఓట్లు వేసే అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన ఈ హామీలను ఒకసారి చూద్దాం ...
->
వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమ క్రింద రైతులకు యాభైవేల రూపాయలు ఇస్తారని
ప్రకటించారు. మంచిదే, కానీ ఆచరణ విధివిధానాలు కూడా ప్రకటించగలగాలి. ఏ అంశాల
ప్రాతిపదికన, ఎవరికి ఆ మొత్తాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పగలగాలి. ఆచరణ
విధివిధానాలేమిటో పత్రాల రూపేణా విడుదల చెయ్యాలి.
->ద్వాక్రా రుణమాఫీ మరియు ఆసరా. మంచి నిర్ణయమే. దీనికి సంబంధించి కూడా ఆచరణయోగ్యమైన అమలు కార్యక్రమాన్ని ప్రకటించాలి.
->
అమ్మ ఒడి - చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులివ్వడం అనే కార్యక్రమం.
దీనికి సంబంధించి కూడా ఆచరణ విధివిధానాలు, ఏ అంశాల ప్రాతిపదికన, ఎవరికి ఆ
మొత్తాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పగలగాలి.
->
హౌసింగ్ కార్యక్రమం క్రింద ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తారని చెప్పారు.
చక్కని నిర్ణయం. ఇప్పటికే గత వైఎస్ ప్రభుత్వం, తరువాతి కిరణ్ ప్రభుత్వం,
ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చామని
ప్రకటించుకున్నాయి. మరి ఇంకా మిగిలిన పేదలెంతమంది, రమారమి ఎన్ని గృహాల
నిర్మాణం అవసరం కావచ్చు, ఆ నిర్మాణానికి ఎటువంటి ప్రాంతాలనెన్నుకుంటారు
గట్రా విషయాలు వివరించగలగాలి.
->
ఆరోగ్యశ్రీ గురించిన హామీ. కొత్తదేమీ కాదు, అమలులో వైఎస్ హయాంలో ఉండేలా
చర్యలు తీసుకోగలిగితే చాలు, అంతే కాకుండా అప్పుడు జరిగిన తప్పులు జరగకుండా
చర్యలు తీసుకునేలా అడుగులు వేస్తామని చెప్పాలి.
-> ప్రత్యేకహోదా తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా
అంశాన్ని ఊరికే ఊదరగొట్టకుండా ఉంటే మంచిది. ప్రత్యేక హోదా అన్నది దాదాపు
అసాధ్యమని తెలియవస్తున్న తరుణంలో ఇక ఆ విషయం గురించి అనవసర భ్రమలు
కల్పించకుండా హోదా రాకపోయినా ఆదాయవ్యయాలను క్రమబద్ధీకరిస్తూ పరిశ్రమల
ఏర్పాటు, ఉద్యోగాల కల్పన వంటివాటికి ఎటువంటి చర్యలు చేపడతారో వివరించాలి.
ఉద్యోగాల కల్పన అన్నది వివిదాంశాలమీద ఆధారపడిన విషయం కాబట్టి, స్వయంసమృద్ధి
సాధించేలా కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించేలా ఆచరణచర్యల ప్రణాళిక
ప్రకటించాలి. ముఖ్యంగా కుటీరపరిశ్రమల ప్రోత్సాహానికి చేపట్టే చర్యల తమ ఆలోచన చెప్పగలగాలి.
->
జలయజ్ఞం - ఇది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది, అటు అభివృద్ధి, ఇటు
అవినీతి రెండింటికి అధిక అవకాశాలున్నది. గతంలో వైఎస్ హయాంలో జరిగిన
నిర్మాణాల ప్రగతి, తరువాత మందగించిన తీరు ప్రస్తావిస్తూ నిర్మాణాన్ని
వేగిరం చెయ్యడం మీద దృష్టి పెట్టేలా చర్యలు తీసుకునేలా ఆచరణ ప్రకటించాలి.
->
మద్యనిషేధం అన్నది ఒక తేనే తుట్టె. మద్యనిషేధం విధించడం అన్నది కాగితాల
మీద సాధ్యమేనేమో. కానీ, ఆచరణలో అక్రమ మద్యం తయారీని, ఇతర రాష్ట్రాలనుండి
అక్రమంగా మద్యం రవాణా వంటివి అడ్డుకోవడం వంటివి అతి ముఖ్యమైన సవాళ్ళు. అదే
కాకుండా, మద్యం కోసం అర్రులు చాచే మామూలు జనాలను ఎలా అదుపు చేయాలన్నది మరో
అతి ముఖ్యమైన సవాలు. ఊరికే వాటన్నిటినీ అడ్డుకుంటాం అని గాలిమాటగా కాకుండా,
అమలుకు సంబంధించి ఆలోచనాలేమిటో వివరించాలి. అదే కాకుండా రాష్ట్ర ఖజానాకు
బంగారు బాతులాగా ఉన్న మద్యం అమ్మకాలను నిషేధించడం ద్వారా కోల్పోబోతున్న
ఆదాయాన్ని ఎలా పూడ్చాలని అనుకుంటున్నారో కూడా విశదీకరించాలి.
...
రాష్ట్రం విడదీయబడ్డాక వచ్చిన గత ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా
లెక్కించడానికే సాధ్యం కానీ రీతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన
హామీలు, ఆ తరువాత ఆయన అధికారంలోకి వచ్చాక వాటి అమలు తీరు చూశాక జనాలకు ఏ
రాజకీయ నాయకుడు హామీలు ప్రకటించినా జనాల అనుమానదృక్కులనుండి తప్పించుకోవు.
ఇపుడు కేవలం హామీలు ప్రకటిస్తే సరిపోదు. అధికారంలోకి వస్తే వాటి అమలుకు ఏం
చేస్తారన్నది ఆచరణలో సాధ్యంకాగలదన్నరీతిలో వివరించగలగాలి. చంద్రబాబును
విమర్శించడం మాత్రమే కాదు, ఆచరణలో చంద్రబాబు ఎదుర్కొంటున్న ఇబ్బందులు
చూస్తున్నారు కాబట్టి, ఇపుడు వీరు ప్రకటించేవి తదుపరి స్థాయిలోనే ఉండాలి
కానీ, కేవలం ఏకవాక్యహామీల తీరున ఉండకూడదు. ప్లీనరీలో పూర్తి అమలుచర్యలు
ప్రకటించే సమయం ఉండకపోవచ్చు, రాబోవు మరికొద్ది రోజుల్లో అంటే పాదయాత్రకంటే
ముందే అమలు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి జనాలలోకి తీసుకెళ్ళాలి.
పాదయాత్ర సమయంలో వాటిని జనబాహుళ్యంలోకి వివిధ రీతులలో విపరీతమైన ప్రాచుర్యం
కలిగించాలి.
-> పట్టణ ప్రాంతాల ప్రజలకు మాటలలో, ప్రచురించిన పత్రాలతో వివరించవచ్చు.
->
పల్లెలలో ఇతరేతర మార్గాలు ఆలోచించాలి. ఉదాహరణకు చిన్న చిన్న నాటికలు,
నృత్యరూపకాలు, బుర్రకథా రూపకాలు వంటివి చేస్తే అత్యంత సులువుగా జనాలలోకి
వెళతాయి.
->
తను ప్రకటించిన అంశాలను పార్టీ నాయకులు ప్రజలలోకి వివరణాత్మకంగా
తీసుకెళ్ళేలా పార్టీ నాయకులకు తగిన రీతిలో అర్థం చేసుకునేలా అవగాహన
కల్పించాలి.
ఇవేవీ చెయ్యకుండా కేవలం 'ప్రకటిస్తే సరిపోతుందిలే, తరువాత చూసుకుందాం' అన్న చంద్రబాబు ధోరణిలో వెళితే ఇబ్బంది తప్పదు.
Comments
Post a Comment