ఇంతకీ నేను సెప్పొచ్చేదేమిటంటే - 'బ్రమ్హోత్సవం' సినిమా గురించి

ఇంతకీ నేను సెప్పొచ్చేదేమిటంటే - 'బ్రమ్హోత్సవం' సినిమా గురించి
**************************************************************************
       బ్రమ్హోత్సవం సినిమా గురించి - అబ్బో ఏమి చెప్పాలి. ఎప్పుడు యే సన్నివేశంలో చూసినా కనీసం పదిమంది తెరమీద కనిపిస్తారు. సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ అడ్డాల గురించి. నిజంగా ఈ సినిమాకి మూలస్థంభం తనే. అసలు ఏమీ లేకుండా రెండున్నర గంటలు సినిమాగా అందునా మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ తో ఏమి చెప్పి ఒప్పించాడో, ఎలా ఒప్పించాడో తెలీదు - అందుకే తనే ఈ సినిమాకి అన్నీ. తను ఏమి రాసుకున్నాడో తెలీదు కానీ, దాన్ని కథగా తను అనుకోవడమే కాక నిర్మాత, మహేష్ బాబు లాంటివారందరితో ఒప్పించి అన్ని కోట్లు పెట్టించి సినిమాగా తీయడం ఆహా ఓహో తన సామర్థ్యానికి కేకో కేక దండాలు. మూలకథ విషయానికి వస్తే అలెక్స్ హెలీ 'ది రూట్స్' పుస్తకం నుండి తీసుకుని దానికి సినిమా ప్రథమార్థంలోని కథ(అదే తను కథ అనుకున్న దాన్ని), కొన్ని పాత్రలని జోడించి సినిమాగా తియ్యాలనే ప్రయత్నం చేశాడు. వినటానికి నిజంగానే ఆసక్తికరంగా ఉండే అంశం ఇది అందునా 'ది రూట్స్' చదివినవారికైతే వెంటనే కనెక్ట్ అయిపోగలరు (చెప్పినప్పుడు - చూసినప్పుడు కాదు). కానీ చిత్రీకరణ దగ్గరకు వచ్చేసరికి తాను కన్ఫ్యుస్ అయి జనాలను విసిగించాడు.
       ఇక పాత్రధారుల విషయానికొస్తే మహేష్ బాబు - తను తెరమీద అందంగా కనిపించడం గురించి, తన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పటిలానే అందంగానే కనిపించాడు. కానీ, ఈ సినిమాలో తను వస్త్రధారణ తీరు (డ్రెస్సింగ్ స్టైల్) గురించి శ్రద్ధ తీసుకున్నట్టు లేదు. నటన విషయంలో ప్రత్యేకించి వంక పెట్టాల్సిన పని లేకపోయినా సినెమా ద్వితీయార్ధంలో చాలావరకు ఏమి చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు అనిపించాడు. తనకు కథ ఏమి అర్థమయ్యి ఈ సినిమా ఒపుకున్నాడో తెలియదు కాని, తనకు ఇది మరో సినిమాగా మారింది తప్ప పెద్ద చెప్పుకోవాల్సిన సినిమాగా మిగల్లేదు ఇంకా చెప్పాలంటే మర్చిపోవాల్సిన అనుభవంగా ఉంటుందేమో. కథానాయికల విషయానికొస్త పేరుకు ముగ్గురు కథానాయికలు ఉన్నప్పటికీ కథ పరంగా సమంతనే ప్రధాన కథానాయిక. మహేష్ బాబు కనీసం తెలుగులో తనకు అర్థమయ్యింది అనుకున్నదాన్ని చెయ్యటానికి ప్రయత్నించాడు. సమంతకు ఏమి అర్థమయ్యిందో మరి ఏదో ప్రయత్నించింది పాపం, కెమెరా తన ముఖం వైపుకు తిరిగినపుడు నవ్వడం తప్ప ఏమి చెయ్యాలో అర్థమయినట్టు లేదు. అంతకుమించి చెప్పుకోవడం అనవసరం. ఇక కాజల్ అగర్వాల్, ప్రణీత కూడా ఈ సినిమాలో ఉన్నారు అని గమనించగలరు. ఇక సత్యరాజ్, 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకి కొనసాగింపు లాంటిది, బహుశా ప్రకాష్ రాజ్ నే మళ్ళీ చేస్తే బావుండదు అని కొత్తదనం కోసం సత్యరాజ్ ని ప్రయత్నించినట్టున్నారు. తనవరకు తను మిర్చి సినిమాలో చేసినట్టుగానే చేసి వెళ్ళిపోయాడు. అలాగే రావు రమేష్ అదే సినిమాలోని తన పాత్రను మళ్ళీ చేశాడు. రేవతిని, జయసుధను చూస్తే ఏంటో 'పాపం'  అనిపిస్తుంది. మిగతా ఎవ్వరి గురించి ఏమీ చెప్పుకోవడానికి లేదు. ముందే చెప్పినట్టు తెరమీద ఏ సన్నివేశంలో చూసినా, ఏ క్షణంలో చూసినా కనీసం పదిమందో, పాతికమందో కనిపిస్తారు. అంతమందిని అలా చూపటానికి మాత్రం బాగానే కష్టపడ్డారు, ఖర్చుపెట్టారు.
       ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే - ముందుగా డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ గురించి. తను నిజంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయినట్టు లేదు. తెర నిండా లెక్కకు మిక్కిలి నటులు ఎందుకున్నారో వాళ్ళకే తెలియకపోయినా రంగు రంగుల బట్టలేసుకుని అలా వచ్చి వెళ్లిపోతుంటే తను స్క్రీన్ కలర్ ఫుల్ గా కనిపించడానికి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మాటలు ఏంతో గాఢతతో రాసారు కానీ సన్నివేశాలలో అంత బలం లేకపోవడం వల్ల పండలేదు. సంగీతం గురించి చెప్పాలంటే మిక్కీ జె మేయర్ పాటల పరంగా, నేపథ్య సంగీతం పరంగా మరచిపోవాల్సిన ఆల్బం ఇది. పివిపి నిర్మాణ విలువల గురించి చెప్పాలంటే ఖర్చు బాగా పెట్టారు, తారాగణం మీద పెట్టిన శ్రద్ధ కాస్తైనా కథను నడిపించే తీరు మీద కూడా (అది దర్శకుడి పనే అనుకోండి) పెట్టి ఉంటే బావుండేది.
       ముందే చెప్పినట్టు కథ పరంగా ఒక చక్కని, బలమైన అంశమే తీసుకున్నారు కానీ దాన్ని కథగా మలచే విధానంలో కానీ, నడిపే తీరులో కానీ అవసరమైన పరిణితి లోపించింది. ఇప్పటి తరంలో తనకున్న ఇమేజ్ కు మహేష్ బాబు ఇలాంటి కథలను ఎన్నుకోవడం నిజంగా అభినందనీయం. కానీ, కథలో బలం ఉంటే సరిపోదు, దాన్ని సరైన రీతిలో తెరకెక్కించగల సామర్థ్యం ఆ దర్శకులకు కూడా ఉండాలి. శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నం మంచిదే అయినప్పటికీ, నడిపే తీరులో పూర్తిగా తప్పటడుగులు వేశాడు, ప్రత్యేకించి ఈ తడబాటు ద్వితీయార్ధంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. కథా పరంగా ఆయువుపట్టు అయిన ద్వితీయార్ధం తేలిపోవడంతో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఇకమీదటైనా తను కథనం మీద కూడా శ్రద్ధ పెట్టగలిగితే గుర్తుండిపోగలిగే సినిమాలు తియ్యగలడు. చివరగా శ్రీకాంత్ అడ్డాల గారికి ఒక గమనిక 'ఆనందంగా ఉండటం అంటే అందరూ కలిసి ఉండటం మాత్రమే కాదు, కలిసి ఉన్నప్పుడు (అది కొద్దికాలమైనా) గొడవల్లేకుండా ఉండటం'.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన