... మనం మేలుకోమా?
వంశీ కలుగోట్ల // ... మనం మేలుకోమా? // ************************************ "కల్పవృక్షం - మనిషి" కథ అని మా తాత ఒక కథ చెప్పేవారు చిన్నపుడు. ఒక బాటసారి అడవి గుండా పయనిస్తూ, మధ్యాహ్నం విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూచుంటాడు. అతడికి తెలీని విషయం ఏంటంటే అది కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. అలసటగా ఉన్న అతడు 'ఇపుడు దాహం తీరేలా చల్లటి మంచినీరు దొరికితే ఎంత బావుండు?' అనుకున్నాడు. వెంటనే మంచినీరు ప్రత్యక్షమైంది. దాహం తీరగానే ఆకలి గురొచ్చింది, 'ఇపుడు పంచభక్ష్యపరమాన్నాలు లభిస్తే ఎంత బావుండు' అనుకున్నాడు. వెంటనే అవీ ప్రత్యక్షం. తిన్న తరువాత 'ఆహా ఇపుడు శయనించటానికి ఒక హంసతూలికాతల్పము, వింజామరలు వీస్తూ సేవికలు, అప్సరసలాంటి భార్య, ఒక పెద్ద భవనం ఉంటే ఎంత బావుండు' అనుకున్నాడు. వెంటనే అవన్నీ ప్రత్యక్షమయ్యాయి. అపుడు అతడు 'అయ్యో ఇదంతా నిజమేనా లేక నా కలా. ఒకవేళ ఇది నిజమే అయితే, ఉన్నట్టుండి ఇవన్నీ మాయమైతే' అనుకున్నాడు. అనుకున్న తక్షణమే అవన్నీ మాయమయ్యాయి. అపుడు అతడు మరింత భయంతో 'ఇపుడు ఈ అడవిలో ఏ పులో, సింహమో వచ్చి నన్ను చంపి తినేస్తే ఎలా' అనుకున్నాడ...