విశ్వనగరాల విషాదాలు - విలాపాలు ...
వంశీ కలుగోట్ల // విశ్వనగరాల విషాదాలు - విలాపాలు ... //
****************************** *************************
ప్రస్తుతం వర్ష భీభత్సాన్ని ఎదుర్కుంటున్న హైదరాబాద్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అవును, ఈ స్థితిలో విమర్శలు ప్రతివిమర్శలు పక్కనబెట్టి, ముందుగా ప్రజలను ఆదుకోవాలి. రాజకీయాలు, ఆరోపణలు పక్కన బెట్టి ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచిస్తే, ఇది కేవలం హైదరాబాద్ నగరానికి ఒక్కదానికే పరిమితమైన అంశమో లేక పరిస్థితియో కాదు. వర్షం భీకర రూపం దాల్చినపుడు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా నగరమేదైతేనేం ప్రజల ఇబ్బందులు చెప్పనలవిగాని రీతిన ఉంటున్నాయి. వీటిలో ప్రతి నగరమూ ప్రపంచ స్థాయిగా కొనియాడబడేవే. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు దాపురిస్తోంది? ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ ఆరోపణలు,ప్రత్యారోపణలు చేసుకోవడం; వేల కోట్ల రూపాయలతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని గొప్పలు చెప్పుకోవడం - ఇంతకుమించి వేరుగా జరుగుతుందని ఆశించడం కూడా తప్పేనేమో. కానీ, మూల కారణ అన్వేషణ చెయ్యటానికి లేదా చర్చించటానికి మాత్రం ఎవరూ ముందుకురారు. ఎందుకు?
నగరీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ అన్నవి ఇటువంటి సంఘటనలకు మూలకారణమని ఒప్పుకోవటానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. ముందుగా చర్చించుకోవలసినది మాత్రం అభివృద్ధి కేంద్రీకరణ. ఆయా ప్రాంతాలలో అభివృద్ధికి తార్కాణాలుగా చెప్పబడే ప్రతి ఒక్కటీ ఈ నగరాలకే పరిమితమవుతున్నాయి. విద్యాలయాలైనా, పరిశ్రమలైనా, విహార స్థలి లైనా - ఏవైనా సరే ఈ నగరాలలోనే ఏర్పాటు అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా వలస కొనసాగుతూనే ఉంది. దానికి తోడు వేర్వేరు కారణాల వల్ల వ్యవసాయ రంగం నానాటికీ కుదేలవుతుండటంతో వలసదారుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. దానితో ఆవాస సముదాయాల నిర్మాణం పెరుగుతూనే ఉంది. ఈ నిర్మాణాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు; సూచనలు పాటించటం లేదు. అంతే కాక, చిన్న చిన్న కుంటలతో పాటు చివరకు చెరువులను కూడా ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారు. భూమిలోపల ఉన్న నీటిని లాగివేస్తూనే ఉన్నారు; మరోవైపు వర్షపు నీరు నిల్వ చేసుకోవటానికి కానీ, భూగర్భ జలాలు పెంపొందించే చర్యలు కానీ చేపట్టటం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది ఆచరణలో పాటించగలిగినతే ఇటువంటి వైపరీత్యాలకు కొద్దిగా అయినా అడ్డుకట్ట వేయవచ్చు, కనీసం ఇంతకు మించకుండా చూసుకోవచ్చు. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు?
ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడమంటే ముందుగా అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి. అది జరిగిన నాడు వలసలు ఆగగలవు. దానివలన ఈ నగరాల అతి విస్తరీకరణ తగ్గుతుంది, అభివృద్ధి ఫలాలు ఇతర ప్రాంతాలకు కూడా అందగలిగే వెసులుబాటు కలుగుతుంది, ఇతరత్రా అనేక లాభాలు ఉంటాయి. అభివృద్ధి వికేంద్రీకరణ వలన నగరీకరణ పేరున పల్లెల శిథిలీకరణ తగ్గే అవకాశం ఉంటుంది. దానివలన భవిష్యత్తు తరాలకు ఆహార కొరత ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. (అభివృద్ధి వికేంద్రీకరణలో సారవంతమైన వ్యవసాయ భూముల ఆక్రమణ భాగం కాకూడదు.) వర్షపు నీటిని నిల్వ చేసే అవకాశాలు పరిశీలించాలి. ఊరికే ఊకదంపుడు రాజకీయ ఉపన్యాసాలు, హామీలు కాక నిపుణులు అందించిన పరిశీలనాత్మక సూచనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణకు ముందడుగు వేయాలి. సంవత్సర కాలం వ్యవధిలోనే రెండు విశ్వ నగరాలకు పట్టిన గతి చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాలు తిట్టుకోవడానికి తప్ప మరెందుకూ కాకుండా చరిత్రలో 'ఆ విధంగా నిలిచిపోతారు'.
Comments
Post a Comment