ఆశ చావదు ...
ఆశ చావదు ...
*****************
ఒక సినిమా నటుడు అరవై, డెబ్బై ఏళ్ళు వచ్చినా లేదంటే చచ్చేవరకూ నటిస్తూనే ఉండాలని అనుకుంటాడు. వందిమాగధ గణం, అభిమాన జన సందోహం ఈలలు వేస్తూ, కేకలు పెడుతూ, కాగితాలు చించి విసిరేస్తూ సంతోషపడుతూనే ఉంటారు. అతగాడు హీరోగానో కాకపొతే కీలక పాత్రలు పోషిస్తూనో నటిస్తూనే ఉంటాడు చచ్చేవరకూ ...
ఒక క్రీడాకారుడు సత్తువ ఉన్నతవరకూ ఆడాలనే అనుకుంటాడు, ఎదుటోడి బలం పెరిగిందని అనుకుంటాడే కానీ తన సత్తువ తగ్గిందని అనుకోడు. మైదానం వదలాల్సి వచ్చినా శిక్షకుడిగానో, వ్యాఖ్యాతగానో ఉండాలనుకుంటాడే కానీ వీక్షకుడిగా మిగిలిపోవాలనుకోడు. ఊపిరున్నంతవరకూ ఆటతో బంధాన్ని తెంచుకోవాలనుకోడు....
ఒక రచయిత/కవి కళ్ళు కనబడి, చేయి పనిచేసినంత కాలం రాస్తూనే ఉండాలనుకంటాడు. పాఠకుడి మేధస్సు పెరగాలనుకుంటాడు కానీ, తన రాతలు అర్థమయ్యేలా లేవని, కాలానికి తగ్గట్టు తానూ మారలేదని ఒప్పుకోడు. పోయేవరకూ ఎదో ఒకటి రాస్తూనే ఉంటాడు ...
... వాళ్ళ అంకిత భావాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. తెలిసిన భాషలోనో, తెలియని భాషలోనో పదాలు వెతుక్కుని మరీ పొగుడుతాం. కానీ, ఒక రాజకీయ నాయకుడు ముసలోడైనా రాజకీయాల్లో ఉంటే 'ఇంకా ఆశ చావలేదు వీడికి, సిగ్గులేదు ఇంత వయసొచ్చినా అధికారం కోసం పాకులాడుతూనే ఉన్నాడు. సంపాదించుకున్నది చాల్లేదా?' ... ... ... ఇంకా ఇంకా ఇంకా వెతుక్కుని మరీ తిడతాం. ఏం పాపం, ఒక ఇతర రంగాలలోనైతే అంకితభావం అయినది రాజకీయాలలో మాత్రం ఆశ అయిందా? ఇదేం న్యాయం అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష్యా.
--- వయసు మీదపడినా, శక్తి తగ్గినా ఆశ చావకపోవడం అన్నది ఒక్క రాజకీయ రంగానికే పరిమితం కాదు అని వెటకారంగా చెప్పడం మాత్రమే నా ఉద్దేశం తప్పించి, రాజకీయాలలో ముసలాళ్ళను ప్రోత్సహించడం కాదని మేధావులు గమనించగలరు; అర్థం కాని యెడల నా మానాన నన్నిలా వదిలెయ్యగలరు అని మనవి.
Comments
Post a Comment