... నాన్న గురించి
వంశీ కలుగోట్ల // ... నాన్న గురించి //
************************************
గమనిక: ముందుగా - ఇది పూర్తిగా నా స్వవిషయం, మా నాన్నగారి గురించి. కాబట్టి, చదివాకా గొప్పలు చెప్పుకున్నారనో, స్వోత్కర్ష అనో అనుకుంటే తప్పు నాది కాదు. చెయ్యనివేవీ చెప్పుకోలేదు ఎపుడూ, ఇదీ అంతే. ఇందులో ప్రస్తావించబడినవన్నీ వాస్తవాలే - ఇపుడు నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న ఒకరిద్దరు సీనియర్స్ కి ఆ విషయం తెలుసనే అనుకుంటున్నాను. మరోటి - ఇందులో రాజకీయాలేం లేవు. రాజకీయాలకు నాన్న ఎపుడూ దూరంగానే ఉండేవారు. తాత సుందర రావు గారి వారసత్వాన్ని రాజకీయాల్లో కొనసాగించి ఉంటే ఎలా ఉండేదో కానీ, ఇష్టం లేకో మరోటో ఎపుడూ రాజకీయాల వైపు చూడలేదు.
1960 లలో వచ్చిన తియ్యటి మనసున్న మనుషుల్లాంటి ఒక చిత్రం, తెలుగు చిత్రసీమకు ఒక తిరుగులేని తారను అందించింది. ఆయన నిలబడిపోవటమే కాక, వారసులూ తిరుగులేని తారగానే ఉన్నారు ఇపుడు. ఆ చిత్రంలో ఆయన స్థానంలో మొదట ఎంపికయ్యింది మా నాన్న కలుగోట్ల విజయాత్రేయ గారు. కానీ, ఆ ఎంపిక జరిగిన తరువాత అనుకోని ఒక ఆక్సిడెంట్ లో కుడిచేతి నాలుగు వేళ్ళూ కోల్పోయారు. అంతేకాదు, ఆ చిత్రం ద్వారా పరిచయమైన ఇద్దరు హీరోలలో, ఆ రెండవ వ్యక్తి మాకు దూరపు బంధువు అంటాడు మరియు మా ప్రాంతానికి దగ్గర్లో ఉండేవారే. ఆ చిత్రం, హీరో పేరు ఇపుడు చెప్పడం బహుశా భావ్యం కాదేమో. అందునా, వాటికి సంబంధించిన ఉత్తరాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో తెలియదు, కాబట్టి ఆధారాలు చూపలేను. 1950 ప్రాంతాలలో మా ఊరు, చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలకు కలిపి అందగాళ్ళని ఇద్దరు యువకుల్ని అనేవారట - ఒకరు విజయాత్రేయ, రెండు దేశం రామిరెడ్డి. విజయాత్రేయ గారు ఆక్సిడెంట్ లో కుడిచేతి నాలుగు వేళ్ళు కోల్పోగా, రామిరెడ్డి గారికి అమ్మవారు పోసి మొహమంతా స్ఫోటకం మచ్చలు మిగిలిపోయాయి. దిష్టి ఎఫెక్ట్ అని అందరూ అనేవారు. రామిరెడ్డి గారు తరువాతి కాలంలో రాజకీయ రంగప్రవేశం చేసి సర్పంచ్, మండలాధ్యక్షుడు వంటి పదవులు పొందారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వలన దూరం జరగవలసి వచ్చింది.
ఇక విజయాత్రేయ గారికి సినిమా రంగం మీద మక్కువ ఎక్కువ. దాంతో తనకు అత్యంత ఇష్టమైన రచనారంగంలో ఒక అడుగు పెడుతూ, సినిమా రంగంలో కూడా ప్రయత్నం చేశారు. పైన ప్రస్తావించిన చిత్రంలో హీరోగా అవకాశం, అంతలోనే ఆక్సిడెంట్ వల్ల దాన్ని కోల్పోవడం వ్యక్తిగతంగా ఆయన్ను కుంగదీసింది. తానేంటో ఇష్టపడినట్టు హీరోగా తెరపై కనబడలేకపోవడంతో సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేసి, రచన రంగంలో కవిగా రచయితగా కొనసాగారు. సినీ రచయితగా అవకాశాలు వచ్చినా, తిరస్కరించారు. గండరగండడు చిత్రంతో పాటు, మరికొన్ని చిత్రాలకు మాటల రచయితగా అవకాశం వచ్చినప్పటికీ (ఈ ఉత్తరం ఊళ్ళో ఉంది నా దగ్గర కాబట్టి సినిమా పేరు ప్రస్తావించాను) తిరస్కరించారు. సినిమా వరకూ తెరపై హీరోగా కనబడాలనేది ఆయన కోరిక, అది తీరకపోవడంతో సినిమాకు పూర్తిగా దూరమయ్యారు. సినీ రచయితగా కూడా పూర్తిగా దూరమవ్వటానికి మరొక కారణముంది. 1970 ప్రాంతాలలో ఒకానొక ప్రముఖ ప్రతినాయక పౌరాణిక పాత్రను, ఆ పాత్ర కోణంలోంచి కథ చెబుతూ ఒక కావ్యం రాశారు. దానికి సంక్షిప్త వచనంగా రాసి, అప్పటికే సినీ పరిశ్రమను ఏలుతున్న ఒక ప్రముఖ నటుడికి పంపి - కాన్సెప్ట్ నచ్చితే - స్క్రీన్ ప్లే, మాటలతో సహా బౌండ్ స్క్రిప్ట్ తెస్తానని చెప్పారు. కానీ, ఆయన దాన్ని తనకు నచ్చినట్టు మార్చేసుకుని, మాట మాత్రం చెప్పకుండా ఆంతా తానే అయి ఆ సినిమా తీశారు. దాంతో సినిమాలు చూడటం కూడా మానేశారు. ఇది విజయాత్రేయ గారి తీరని సినిమా కోరికల గురించి నాకు తెలిసినది.
సినిమా రంగం దెబ్బ తీసినప్పటికీ, రచనా రంగంలో మాత్రం కొనసాగారు. అందులో కూడా ప్రచారానికి దూరంగా ఉంటూనే ఉన్నారు. సిటీ కి షిఫ్ట్ అయ్యి, కొందరితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ, కొన్ని చేస్తే కొన్ని అవార్డులు, కొన్ని పదవులు వచ్చే అవకాశం ఉందని చాలామంది చెప్పినప్పటికీ తన స్వభావానికి విరుద్ధంగా వెళ్ళలేకపోయారు. (సిటీ లో ఉండేవారంతా అలా చేస్తారని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు, అలాంటి అవకాశం ఉందని చెప్పటం మాత్రమేనని గమనించగలరు). ఎంవిస్ పబ్లికేషన్స్ ద్వారా విజయాత్రేయ గారు రాసిన దాదాపు 70 నవలలు పబ్లిష్ అయ్యాయి. ఇక ఛందోబద్ధ పద్యకవిత్వంలో 20 కి పైగా కావ్యాలు రాశారు. ప్రతి ఒక్క కావ్యం కృతి భర్తల ద్వారా ప్రచురింపబడినదే (అంటే పబ్లిషర్స్ లాగా అన్నమాట, వీరు ప్రొఫెషనల్ పబ్లిషర్స్ కాదు - కథనో లేక కావ్యమో నచ్చి తాము ప్రింట్ చేస్తామని ముందుకొచ్చి చేసేవారు). వైఎస్ రాజారెడ్డి, మద్దూరు సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుజాతశర్మ (ఇండస్ట్రియలిస్ట్) ఇలా అనేకమంది ప్రముఖులు ఆయన కావ్యాలను ప్రచురించారు. చిత్తూరు నాగయ్య, భానుమతి, గుంటూరు శేషేంద్ర శర్మ, నండూరి రామకృష్ణమాచార్య, తిరుపతి వెంకట కవులు, గడియారం రామకృష్ణశర్మ వంటివారి నుండి ప్రశంసలను పొందారు. చిత్తూరు నాగయ్య గారిచే 'సరస కవితిలక' బిరుదును పొందారు. దాదాపు 70 దాకా జానపద, సాంఘిక నవలలు రాసినప్పటికీ కవిగానే ప్రాచుర్యం, సత్కారాలు పొందారు. అనేకానేక సత్కారాలు, సన్మానాలు, బిరుదులూ పొందారు. రచనా రంగానికి సంబంధించి ఛందోబద్ధ కవిత్వం, భావ కవిత్వం, నవలలు, కథలు, కథానికలు, నాటికలు, నాటకాలు, బుర్రకథలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు వంటి అనేక ప్రక్రియలలో లెక్కకు మిక్కిలి రచనలు చేశారు.
రచన రంగం అక్కున చేర్చుకుని, ఆదరించినప్పటికీ - సినిమా రంగంలో తాననుకున్నది సాధించలేకపోయాననే బాధ మాత్రం ఉండేదని చెప్పగలను. అందునా, ఎంపికయ్యాక కూడా అవకాశాన్ని వదులుకోవాల్సిరావడం, తాను రాసిన అంశాన్ని కాస్త మార్చి ఇంకొకాయన తానే చేశానని సినిమా తీసుకోవడం వంటివి మరింత బాధించాయి. ఇపుడెవరి మీదా వ్యక్తిగత విమర్శలు చేయటం లేదు, కానీ ఆయన బాధ గురించి మాత్రమే చెప్పాను. రచనా రంగంలో ఆయన్ను చేరడం నావల్ల కాదని తెలుసు, కానీ ఆయనకు తీరని కలగా మిగిలిపోయిన సినిమా రంగంలో మాత్రం ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నం. రచయిత/దర్శకత్వం నెరపాలని ఆశయం, అడుగులు పడుతున్నాయి. అంతకంటే ముందుగానే, మిత్రుడు విరించి కోసం నిర్మాత అవతరమెత్తి కొన్ని లఘు చిత్రాలు నిర్మించడం - అందులో ఒకటి 'ఇక్కడి చెట్ల గాలి' 2018 తెలంగాణ ఫిల్మోత్సవ్ లో స్పెషల్ జ్యూరీ బహుమతి పొందటం ఆనందాన్నిచ్చింది.
చివరగా - కృష్ణుడు చెప్పినా, కాటి కాపరి చెప్పినా 'పని/కష్టం మాత్రమే నిజం, ఫలితం అశాశ్వతం'. అది ఆచరించి చూపినందుకే నాన్నంటే నాకు అంత ఇష్టం, ప్రాణం. విమర్శించేవారిని, శత్రువులను, కిందకు లాగాలని ప్రయత్నించేవారిని కాలానికి వదిలేశారు - లక్ష్యం వైపు సాగిపోతూ. ఊహ తెలిసిన తరువాత నాన్న నుండి నేను నేర్చుకున్న మొదటి పాఠం అదే. ఏమి చేసి వెళతామన్నది కాదు, ఏమి వదిలి వెళతామన్నది ముఖ్యం. నాన్న స్ఫూర్తిని వదిలి వెళ్ళారు. ఆ స్ఫూర్తిని స్వీకరించి, ఆదర్శంగా సాగడమేనేను ఆయనకు అందించే నివాళి. స్ఫూర్తిని ఇచ్చి, అంతర్గత శక్తిగా నిలిచి నను నడిపిస్తున్న నాన్నకు కృతజ్ఞతలు అని మాత్రం చెప్పగలను.
Comments
Post a Comment