... ఆయన ఏదో ఒకటి చేస్తారు
వంశీ వ్యూ పాయింట్ // ... ఆయన ఏదో ఒకటి చేస్తారు //
*********************************************************
"ఆయన ఏదో ఒకటి చేస్తారు" - తెదేపా శ్రేణులలో ఒక నమ్మకం, వైరి వర్గాలలో ఎక్కడో చిన్న కలవరం, రెండు వర్గాలకూ చెందనివారి ఉత్సుకత. ఇదంతా, చంద్రబాబు 'అపర చాణక్యం, వ్యూహ చాతుర్యం, అపార అనుభవం' వంటివాటి మీద ఉన్న నమ్మకంతో పాటు, గత సంఘటనల అనుభవం. అందుకే, ఆధిక్యతను సంబంధించిన అధికారిక సమాచారం అధికారికంగా అందేవరకూ వైఎస్సార్సీపీ కానీ, ఇతరులు కానీ పూర్తి దృఢంగా 'విజయం మాది' అని చెప్పలేని ఒక చిన్న సంశయం. ఇదంతా ఎవరి గురించో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కౌటిల్యుడంతటి వాడు అని అభిమానించేవారు; కుటిల వ్యూహాల నాయకుడు అని వ్యతిరేకించేవారు ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకోవచ్చు గాక - తెలుగు నేలపై ఆధునిక రాజకీయాలలో చంద్రబాబునాయుడు గారి ప్రభావం ఎవరూ కాదనలేనిది. ఆధునిక రాజకీయాలలో, కేవలం గెలుపు మాత్రమే లక్ష్యంగా గొప్ప వ్యూహాలైనా లేక దిగజారుడు చర్యలైనా ఏవైనా సరే చేయటానికి ఆయన సిద్ధం - ఎందుకంటే ఆయనకు గెలుపు మాత్రమే లక్ష్యం.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు, తెదేపాకు కూడా అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల్లో ఓటమి అంటే ఇక తమ రాజకీయ జీవితానికి దాదాపు అది ముగింపు అని ఇరువర్గాలకూ సూచనప్రాయంగా తెలుసు. గతంలో ఎన్నడూ లేనంత వైరం, ఇపుడు రాష్ట్రంలోని రెండు రాజకీయ పక్షాల మధ్య ఉంది (తెదేపా + జనసేన మరియు వైఎస్సార్సీపీ). వ్యవస్థల్ని పూర్తిగా తన కీలుబొమ్మలుగా మార్చేసుకున్న చంద్రబాబు తీరు, గతంలో ఆయన్ను అభిమానించిన వారు కూడా అసహ్యించుకునే స్థాయికి తీసుకువచ్చాయి నేడు. ఎవరెన్ని బీరాలు పోయినా, ఇపుడు తెదేపా ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. 2004 నాటి స్థాయి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న స్థితిలో, ప్రత్యర్థిగా అత్యంత బలమైన జగన్ ఉండగా - వ్యూహాలతో పాటు, కుట్రలకూ వెనుకాడటం లేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే, కొడుకు లోకేష్ ను రాజకీయ వారసుడిగా పార్టీ మరియు ప్రజలు (తెదేపా అభిమానులు) అంగీకరించక; పార్టీ మళ్ళీ నందమూరి కుటుంబం చేతిలోకి వెళ్ళే అవకాశాలుండటం చంద్రబాబును కలవరపరచే అంశం. అందుకే అన్ని వ్యవస్థల్ని తన చేతిలో పెట్టుకొని, తన అడుగులకు మడుగులొత్తే వారిని నియమించుకుని, కేంద్రంతో, ఎన్నికల సంఘంతో తలపడటానికి కూడా సిద్ధమయ్యారు 'లోకేష్ తండ్రి' చంద్రబాబునాయుడు గారు. అవును, ఇపుడు లోకేష్ తండ్రిగా, తన కొడుకును ప్రమోట్ చెయ్యటానికి మాత్రమే చంద్రబాబు నాయుడుగారు రాజకీయం చేస్తున్నారు.
ఒకటి మాత్రం నిజం - చంద్రబాబు ఎపుడు ఏది చేసినా, ఇక ఆయన ముందు ఇతరులంతా పిపీలికాలే అన్న ఒక భావన కలిగేలా చేస్తారు - ఎల్లో మీడియా ద్వారా. వాస్తవం చాలా సందర్భాలలో అందుకు భిన్నంగా ఉంటుంది. ఇపుడూ అంతే. ఆ వాస్తవ పరిస్థితి ఎన్నికల ఫలితాల్లో కనబడతుందనే దాదాపు అన్ని సర్వేలు, అందరి అంచనాలు పేర్కొంటున్నప్పటికీ "ఆయన ఏదో చేస్తాడు, చేయగలడు" అన్న నమ్మకం అభిమానులలో, గుబులు శత్రువులలో కలిగిస్తున్నాడు చంద్రబాబు. ఇపుడు ఈ లోకేష్ తండ్రి చంద్రబాబు ఏం చేస్తాడు, బయటపడగలడా అన్నది చూడాలి. వైఎస్సార్సీపీ మరియు ఇతర తెదేపా వ్యతిరేక పార్టీలూ బహుపరాక్, చివరి వోట్ వోటింగ్ మెషిన్ లో నమోదు అయ్యేవరకూ మీరు ఏమాత్రం విశ్రమించకూడదు. ప్రజల్లో బలం మాత్రమే పనిచేసే రోజులు పోయాయి, కాబట్టి ప్రతి అడుగూ జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి.
"2004 నాటి స్థాయి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న స్థితిలో"
ReplyDelete2004 కాదు, 1989 నాటి స్థాయి వ్యతిరేకత ఉందని నా అంచనా.
1989 వ్యతిరేకత ఎన్టీఆర్ ఎదుర్కొన్నారు, చంద్రబాబు కాదు కదా అందుకే 2004 నాటి అని ప్రస్తావించాను.
DeleteOK I understand
Deleteఎన్నికల్లో ఓడిపోతే పార్టీ మళ్ళీ నందమూరి కుటుంబం చేతిలోకి వెళ్లిపోతుందా? ఎందుకింత కామెడీ చేస్తారు?జస్ట్ 5నిముషాలు బాలయ్యబాబు చంద్రబాబు ఇద్దరూ మాట్లాడితే తెలుస్తుంది ఎవరి సత్తా ఎంతో!!
ReplyDeleteఇక తమతమ పిల్లలని ప్రమోట్ చెయ్యనినాయకులు ఎవరున్నారు(బ్రహ్మచారి నాయకులు తప్ప)? డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని కోరుకున్నట్లే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు.
ఓహ్ నందమూరి కుటుంబం అంటే ఒక్క బాలయ్య మాత్రమేనా? మరి అదేలా ఒకసారి చంద్రబాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ ని మాట్లాడిస్తే తెలుస్తుంది కదా. నేనిక్కడ ప్రస్తావించింది - చంద్రబాబు తదనంతరం, అధికారంలో లేకపోతే లోకేష్ సామర్థ్యలోపం వల్ల నందమూరి కుటుంబీకుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని. నందమూరి కుటుంబం అంటే బాలయ్య ఒక్కరే కాదన్నది వాస్తవం. ప్రోమోట్ చెయ్యకూడదని నేనలేదు, కానీ లోకేష్ సామర్థ్యలోపం (నాయకత్వం పరంగా మాత్రమే అని గమనించగలరు) గురించి ప్రస్తావించాను
Deleteలోకేష్ కి సమర్థత తక్కువ అనేదే నా అభిప్రాయం కూడా. కానీ అంతకుముందు తరం లో మాత్రం చంద్రబాబు ని మించిన సామర్థ్యం నందమూరి కుటుంబం లో లేదనే నా విశ్వాస0.
Deleteమీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కానీ, నందమూరి కుటుంబీకులు అంటే బాలయ్య ఒక్కరే కాదు కదా - ప్రస్తుతం తరువాతి నందమూరి తరంలో జూనియర్ ఎన్టీఆర్ తెదేపా పగ్గాలు చేపట్టటానికి (చంద్రబాబు తదనంతరం) అన్నిరకాలుగా సమర్థులన్నది నా అభిప్రాయం. అతడిని, రాజకీయంగా ఆక్టివ్ చేసి కాస్త పరిణితి చెందేలా చేస్తే తెదేపాకు అన్ని రకాలుగా మంచిది అన్నది నా అభిప్రాయం.
Deleteబాబు తరువాత లోకేష్ లేదా జూనియర్ ఎన్టీఆర్, ఇంతేనా? ఆ మూస దాటి బయటికి రావాలి.
Deleteటీడీపీలో ప్రతిభ, చిత్తశుద్ధి & సామర్త్యం ఉన్న వారికి కొదవ లేదు. ఉ. ధూళిపాళ నరేంద్ర
దశాబ్దాల తరబడి ఓటమి ఎరగని & మచ్చ లేని నాయకులు. అదృష్టం బాగోక మంత్రి పదవి రాలేదు కానీ వైరి పక్షం సైతం ఆయన్ను వేలెత్తి చూపదు.
PS: ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే, అలాగే మిగిలిన పార్టీలకు కూడా ఇదే
తరహా వాదన వర్తిస్తుంది.