... ఆ ముగ్గురి గురించి
వంశీ వ్యూ పాయింట్ // ... ఆ ముగ్గురి గురించి //
*************************************************
ఇపుడు మన రాష్ట్ర రాజకీయాలు ముగ్గురు వ్యక్తుల చుట్టూతా తిరుగుతున్నాయి. అందులో ఇద్దరు అంతర్గత లేదా లోపాయికారి ఒప్పందాలతో ఒకే జట్టని ఆరోపణలు, నిదర్శనాలు ఉన్నప్పటికీ. అందరికీ తెలిసిన ఆ ముగ్గురు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. మనం మామూలుగా చెప్పుకుంటుంటాం ప్రతి ఒక్కరిలో మంచి, చెడు ఉంటాయిరా అని. ఈ ముగ్గురు కూడా ఆ నానుడికి అతీతం కాదు. నా దృక్కోణంలోంచి ఆ ముగ్గురిలో నాకు నచ్చిన, నచ్చని అంశాల విశ్లేషణ ఈ వ్యాసం. ఎవరూ భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు, తప్పుబట్టవలసిన అవసరం లేదు - ఇది నా అభిప్రాయం, మీకు తప్పనిపిస్తే ఎందుకు తప్పనిపించిందో చెప్పవచ్చు. అభిప్రాయాలు మారుతుంటాయి - జరిగే సంఘటనలు, కలిగే అనుభవాలు, తెలుసుకునే విషయాల వల్ల మనమూ అభిప్రాయాలు మార్చుకున్నవాళ్ళమే, ఇకమీదట కూడా మార్చుకుంటాం. కాబట్టి, నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోతే మీ అభిప్రాయం చెప్పవచ్చు. నా అభిప్రాయం తప్పు లేదా ఒప్పు అన్నది ఇక్కడ చర్చాంశం కాదని గమనించగలరు.
* * *
ముందుగా పవన్ కళ్యాణ్ గురించి - ఆయన గురించి చెప్పాలంటే, ముందుగా చిరంజీవి గురించి చెప్పాలి. నా వరకూ నాకు నేను మొదటిసారి పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళింది, అతడి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంది కేవలం అతడు చిరంజీవి తమ్ముడు అని మాత్రమే. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం, ఇప్పటికి కూడా (సినిమాల వరకూ). ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య సినీరంగంలో ఇంతటి స్థాయికి ఎదిగిన చిరంజీవి అంటే ఆరాధనాభావం కూడా. ఇక్కడ చిరంజీవి అప్రస్తుతం కాబట్టి, పవన్ దగ్గరకి వద్దాం. ఇక చిరంజీవి తమ్ముడిగా కాక పవన్ కళ్యాణ్ గా అతడి మీద అభిమానం ఏర్పడింది తొలిప్రేమ సినిమాతో. అప్పటినుండి హీరోగా కంటే ఒక వ్యక్తిగా అతడిమీద అభిమానం ఏర్పడింది. చిరంజీవి ప్రభావం పడకుండా, తనకంటూ ఒక సొంత శైలి ఏర్పరచుకోవడం ఆ అభిమానాన్ని రెట్టింపు చేసింది. ముసుగులు లేని తీరు (ఇపుడు కాదులే), మొండితనం, ధైర్యం వంటివి అతడిలో బాగా నచ్చేవి. ఆలా అలా పవన్ అంటే ఒకరకమైన పిచ్చి ఏర్పడే స్థాయికి చేరింది ఆ అభిమానం. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కూడా, ప్రచారసరళిలో చిరంజీవి సున్నితత్వం కంటే పవన్ తిరుగుబాటు ధోరణి నచ్చేది. ఎన్నికల్లో ఓటమి తరువాత, చిరంజీవి ప్రస్థానం నచ్చలేదు. అదే సమయంలో మౌనం వహించిన పవన్ తీరు నచ్చింది, రాజకీయం ఎందుకంటే చేతకాదని లేదా పడదని తెలిసి మిన్నకున్నాడులే అని గౌరవం పెరిగింది.
అది అంతా మొదటి అంకం అయితే, నాతో పాటు అలాంటి అభిప్రాయాలున్న అనేకమంది భావనలను తునాతునకలు చేసే ప్రస్థానం జనసేనతో మొదలైంది. జనసేన ఆవిర్భావ సభలో 'ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చీకటి ... అంటూ మొదలెట్టినపుడు ఈసారి ఏమైనా కాస్త నూతనత్వం రాజకీయాలలో రాగలదేమో అనిపించింది. ఇజం పుస్తకం చూడగానే అది సగం పోయింది. ఇక ఎప్పుడైతే చంద్రబాబు, మోదీలకు మద్దతు పలికాడో అపుడు పూర్తిగా చచ్చిపోయింది. ఇక మిగతా రాజకీయ అంశాలన్నీ ఏకరువు పెట్టటానికి ఇది తగిన వ్యాసం కాదు కాబట్టి అవన్నీ ప్రస్తావించటం లేదు. ఒకప్పుడు ఏ అంశంలోనైతే పవన్ ను విపరీతంగా అభిమానించేవాడినో, అదే అంశంలో ఇపుడు అతడి వ్యతిరేక తీరు అతడి ధోరణి మీద అయిష్టాన్ని పెంచేలా చేసింది. 2009 ఎన్నికలప్పుడు కూడా అన్న అదుపాజ్ఞలలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరించిన తీరు ఇప్పుడేమైంది అని అపుడపుడూ అనిపిస్తుంటుంది. బయటకి ఎన్నైనా చెప్పుకోవచ్చు గాక, కానీ చంద్రబాబును దాటిపోలేని రాజకేయం చేస్తున్న పవన్ అంటే ప్రస్తుతం ఏహ్య భావం (ఇది కేవలం పవన్ రాజకీయానికి మాత్రమే, సినిమాలకు కాదు - ఇపుడు పవన్ సినిమా చేస్తే మొదటిరోజు చూడటానికి తయారుగా ఉంటాను) మాత్రమే ఉంది. కానీ, ఇపుడు కూడా పవన్ లోని మొండితనం, ఎవరేమనుకుంటారో అనే భావం లేని ధైర్యం నాకు నచ్చుతాయి.
* * *
ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి - అవిభాజిత రాష్ట్రానికి అత్యధిక కలం ముఖ్యమంత్రిగా, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి గురించిన విషయాలన్నీ అందరికీ తెలుసు. చంద్రబాబు ప్రస్థానం - విలువలు, నమ్మకం, విశ్వాసం, మాట మీద నిలబడటం వంటివి కాకుండా కేవలం అధికారం, లక్ష్యం మాత్రమే ముఖ్యంగా ఉండాల్సిన ఆధునిక రాజకీయనాయకుడికి నిలువెత్తు నిదర్శనం. ఆధునిక రాజకీయాలకు చంద్రబాబు గారు ఒక నిలువెత్తు ఉదాహరణ. యుద్ధరంగంలో ఉన్నపుడు కొందరు వ్యోహాలకు ప్రాధాన్యతనిస్తారు, మరికొందరు గెలుగుపుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. చంద్రబాబు గారికి గెలుపు మాత్రమే ముఖ్యం, తానాశించే లేక తాను కోరుకునే ఆ గెలుపు కోసం దేన్నైనా పణంగా పెట్టటానికి ఆయన సిద్ధం - తనను తాను కోల్పోయినా గెలుపే కావాలనుకునే ఆ తత్త్వం (తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు, ఇపుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు వంటివి దీనికి నిదర్శనాలు) నాకు నచ్చుతుంది (నేను అలా చేయలేకపోయినప్పటికీ). చంద్రబాబు గారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం - చివరి క్షణం దాకా పోరాటం వదలకపోవటం, ఈనాటి రాజకీయాల్లో అది అతి ముఖ్యమైన మరియు అవసరమైన అంశం.
అసలేమీ కాని స్థితి నుండి ఒకనాటి అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కాగలగటం అంటే అంత సులువు కాదు. దాని వెనుక ఎంతటి వ్యూహం ఉండాలి. రెండెకరాల ఆసామీ పెద్దకొడుకు, ఈనాడు దేశంలోనే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదగటం ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవలసిన అంశమే, కాకపొతే అందుకు అతడు అనుసరించిన వ్యూహాలు ఆదర్శం కాకపోవచ్చు. మొదటగా చెప్పాలంటే, కారణాలు ఏవైనప్పటికీ నేను అత్యంతగా అభిమానించే ఎన్టీఆర్ (సీనియర్) కు వెన్నుపోటు పొడవటం, బహుశా వెన్నుపోటు అనేకంటే నమ్మకద్రోహం అనటం సబబేమో - అది నాకు నచ్చలేదు. పిల్లనిచ్చిన మామకే నమ్మకద్రోహం చేయగలిగిన వాడికి ఇతరులు ఒక లెక్కా? (ఇది నా అభిప్రాయం). ఇక దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం (అప్పుడూ, ఇపుడూ), వ్యవసాయ రంగానికి అండగా నిలవకపోవటం (ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చే హామీలు, చేసే ప్రమాణాలు పరిగణనలోకి తీసుకొని నా ఈ వ్యాఖ్యను వ్యతిరేకించవద్దు) వంటివి నాకు అతడి మీద వ్యతిరేకత ఏర్పడటానికి ముఖ్యకారణం. అంతేకాక గెలుపు మాత్రమే లక్ష్యంగా విలువలు, నమ్మకం వంటివి పక్కనబెట్టి వ్యవహరించటం నచ్చదు. తన గెలుపుకోసం, అవసరం కోసం అందరినీ వాడుకుని వదిలేసే (లేదా వదిలించుకునే) తీరు కూడా నచ్చదు. కానీ, ఈ వయసులో కూడా అతడు కష్టపడే తీరు, తన లక్ష్యం పట్ల స్పష్టత మరియు నిబద్ధత నచ్చుతాయి.
* * *
ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి. బహుశా, మనకు తెలిసిన కాలంలో తాను వద్దనుకున్నా కూడా విపరీతమైన ప్రచారం (మంచిగా మరియు చెడుగా) లభించిన ఏకైక వ్యక్తి ఈయనే కావచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా మొదలైన అతడి రాజకీయం ఎవరూ ఊహించని, మరెవరూ కోరుకొని మలుపులు తిరిగింది. ఎవరైతే బలమో, ఆ రాజశేఖర్ రెడ్డి మరణం, తరువాత పార్టీని మించి ఎదగడానికి ఒప్పుకొని అధినాయత్వతీరును ధిక్కరించినందుకు కేసులతో కక్షసాధింపు కోసం దాదాపు సంవత్సరమున్నర కారాగారవాసం వంటివి అతడిని మరింత రాటుదేలేలా చేశాయి. ఎన్ని ఇబ్బందులెదురైనా - తానొక్కడే ఒకవైపుండి, మిగతా అందరూ ఒక్కటిగా తనమీద దాడి చేసినప్పటికీ తలవంచని అతడి ధైర్యం అబ్బురపరిచింది. నిజం, అపుడే అతడంటే అభిమానం ఏర్పడింది. తాను చెయ్యని కొన్ని పనులకు కూడా (తండ్రి మరణం సమయంలో సంతకాల వ్యవహారం) తాను అపప్రధ మొయ్యాల్సిరావడం, అణగదొక్కాలని అన్నివైపులనుండి కుట్రలతో కూడిన యత్నాలు ఎంతగా కుంగదీస్తున్న ఎదురునిలబడ్డ ధైర్యం బహుశా ఈనాటి రాజకీయాల్లో ఎవరూ చూడలేదు, చూడలేరేమో కూడా. అభినవ చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఒకవైపు, రాష్ట్రం మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోవైపు ఎంతగా ప్రయత్నించినా అన్నిటినీ తట్టుకుని నిలబడటం గ్రేట్.
ఇక జగన్ లో నాకు నచ్చే అతి ముఖ్యమైన అంశం విలువలు పాటించడం (ఆధారాలు లేని ఆరోపణలు ఇక్కడ ప్రస్తావించకండి - వారు అలా అన్నారు, వీరు ఇలా అన్నారు. నేను పైన మిగతా ఇద్దరి విషయంలో కూడా అలాంటివి ప్రస్తావించలేదు), మాటమీద నిలబడటం వంటివి. విలువలు పాటించడం గురించి ఉదాహరణ చెప్పాలంటే - తన పార్టీలోకి ఫిరాయించిన ఇతర పార్టీల సభ్యులను ఆ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకూ రాజీనామా చేశాకనే తనపార్టీలోకి తీసుకోవడం. భాజపా, కాంగ్రెస్, తెరాస, తెదేపా వంటివి పాటించని విలువ ఇది. 2014 ఎన్నికలప్పుడు తన ఓటమికి కారణమైన రుణమాఫీ హామీని పార్టీలోని సీనియర్ లందరూ చెప్పినా ఆచరణ సాధ్యం కానీ ఆ హామీ ఇవ్వలేనని చెప్పడం వంటివి కూడా. ఇపుడు కూడా గెలుపు కోసం కుట్రలను కాకుండా, కష్టాన్ని నమ్ముకున్న అతడి తీరు నిజంగా అభినందనీయం. ఇక హోదా గురించి 2014 నుండి ఇప్పటివరకూ మాట మార్చకుండా, ఇపుడు కూడా ఎవరైతే హోదా ఇస్తారో వారికే కేంద్రంలో మద్దతు ఇస్తాం అని స్పష్టంగా చెప్పడం వంటి స్పష్టత నచ్చింది. ఇన్ని నచ్చినా, నచ్చనివి ఉన్నాయి. ఒకసారి తాను నిర్ణయించుకుంటే, ఇక ఎవరు చెప్పినా వినని మొండితనం నచ్చదు. అంతేకాదు, తానేమనుకుంటున్నాడో అన్నది అత్యంత సమీప వ్యక్తులకూ అంతుబట్టని ఆ రహస్యతీరు లేదా నర్మగర్భమైన తీరు కూడా అంతగా నచ్చదు. ఎవరేమనుకున్నా పట్టించుకోని తీరు నచ్చుతుంది (జగన్ మరియు పవన్ లలో కామన్ గా నాకు నచ్చే ఏకైక అంశం - పోలిక ఎవరికీ నచ్చకపోయినా). తనను నమ్మినవారిని, అంతా తానై చోసుకునే అంశం తండ్రి వైఎస్ రాజశేఖర దగ్గరనుండి అంది పుచ్చుకున్నారేమో, అది కూడా నచ్చింది.
* * *
ఇక్కడ దాపరికాలేం లేవు - సుస్పష్టంగా చెబుతున్నాను, నేను ఇక్కడ ప్రస్తావించిన ముగ్గురు నాయకులలో నాకు జగన్ అంటేనే అభిమానం ఎక్కువ. బహుశా అలా చెప్పేకంటే జగన్ లోనే నాకు నచ్చే లక్షణాలు, నేను మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. రేప్పొద్దున అంతకంటే ఎక్కువగా నచ్చే తీరున ఉండే నాయకుడు వస్తే (ప్రస్తుతానికి అయితే కనబడటం లేదు), ఖచ్చితంగా నేను జగన్ కంటే ఎక్కువగా ఆ కొత్త నాయకుడిని ప్రిఫర్ చేస్తాను అని చెప్పటానికి వెనుకాడను. (ఇందులో పేర్కొన్న అనేక అంశాలలో నాకు జగన్ కంటే మోదీ నచ్చుతారు, హోదా విషయంలో మోసం నచ్చకపోయినా. కానీ, మోదీ ఆంధ్రప్రదేశ్ నేత కాదు) కానీ, ఈ అభిమానానికి రాజకీయానికి సంబంధం లేదు, ఉందని మీరంతా అనుకున్నా. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో రాష్ట్రం వరకూ చంద్రబాబు, జగన్, పవన్ లను పోల్చుకుని చూస్తే నా ఆప్షన్ మాత్రం జగన్. ముందే పేర్కొన్నట్టు ఇవి నా దృక్కోణంలోంచి, నేను చూసిన అనేక ఘటనల నేపథ్యంలో, దశాబ్దాల నుండి రాజకీయాలను సునిశితంగా ఫాలో అవుతూ నేనేర్పచుకున్న అభిప్రాయాలు. నాకు నచ్చే అంశాలు మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే అందరమూ ఒకేలా ఉంటే ప్రపంచం ఇలా ఉండదు కదా.
ఇందులో పేర్కొన్న కొన్ని అంశాలు అవాస్తవం అనిపిస్తే, వాస్తవమేదో తెలిపే ఆధారాలు కామెంట్స్ లో పేర్కొనండి; నా అభిప్రాయం నచ్చకపోతే మీ అభిప్రాయం హుందాగా చెప్పవచ్చు. కానీ, ఈ పోస్ట్ కు సంబంధం లేని ఇతర రాజకీయ అంశాలతో కూడిన వ్యాఖ్యలు లేదా బూతులతో కూడిన వ్యాఖ్యలు చేస్తే మాత్రం వ్యాఖ్యలు తొలగించడమో లేక సదరు వ్యక్తిని బ్లాక్ చేయడమో చేస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
మీరనుకున్నట్లే/కోరుకున్నట్లే జగన్ గెలిచారనుకుందాం,మోదీ కూడా గెలిచారనుకుందాం, మళ్ళీ హోదా ఇవ్వలేదనే అనుకుందాం, జయలలితలాగా కేసుల్లో అవినీతి నిజమై జైలుకి వెళితే ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా ఎవరుంటారు ? భారతా?
ReplyDeleteషర్మిలా ?
విజయమ్మా ?
రోజానా ?
కేసులు వీగిపోతాయి అని అనకండి. ఈ విషయంలో మోదీని నమ్ముతాను. మోదీ న్యాయస్థానం జోలికి వెళ్ళరు.
ముందుగా మీరు ప్రస్తావించినట్టు నేను కోరుకుంటున్నానా లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతం - ముగ్గురిలో నా ఆప్షన్ జగన్ అని నేను చెప్పాను. అతడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందన్నది ఇపుడే చెప్పలేం, మంచి జరుగవచ్చు లేదా చెడు జరుగవచ్చు. ఇక ఒకవేళ అతడి మీద ఆరోపణలు ఋజువు అయ్యి, అతడు జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు - పలువురు ఉన్నత న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం చట్టం ముందు నిలబడే స్థాయి పెద్ద పెద్ద కేసులు అయితే కావవి. ఎవరైనా ముందుకు వచ్చి, మమ్మల్ని బెదిరించి పెట్టుబడులు పెట్టామన్నారు అని చెప్పినా అది చిన్న కేసు కాగలదు కానీ పెద్దది కాజాలదు. ఇక్కడ అతడు అవినీతికి పాల్పడ్డాడా లేదా అన్నది నేను చర్చించటం లేదన్నది గమనించగలరు - అతడి మీద ఉన్న కేసుల గురించి గురించి మాత్రమే చెబుతున్నాను. ఇక హోదా గురించి, ఇవ్వలేదనుకుందాం - ఈ ప్రశ్నకు సమాధానం కేంద్రంలో భాజాపా లేదా కాంగ్రెస్ సాధించబోయే స్థానాల సంఖ్య సమాధానం కాగలదు. ఇక్కడ వైఎస్సార్సీపీ గనుక పలు సర్వేలు పేర్కొన్నట్టు 20+ లోక్సభ స్థానాలు సాధించగలిగి, కేంద్రంలో అవసరం ఐతే, అపుడు హోదా సాధ్యం కాగలదు అని భావిస్తున్నాను. ఒకవేళ, ఆ పరిస్థితుల్లో జగన్ కూడా ప్యాకేజీ వంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు గనుక ఒప్పుకుంటే, అది స్వయంగా తనకు తాను చెడు చేసుకున్నట్టే.
Delete