... 2019 ఆంధ్రప్రదే ఎన్నికలు - తెదేపా
వంశీ వ్యూ పాయింట్ // ... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - తెదేపా //
*******************************************************************
పార్టీ ఆవిర్భవించిన నాటినుండి, అత్యధిక కాలం పాలనలో ఉన్న ప్రాంతీయపార్టీలలో తెదేపా మొదటివరుసలో ఉంటుందేమో. అటువంటి తెదేపా, గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోంది ఇపుడు. ఇపుడు తెదేపాను పట్టిపీడిస్తున్న దిగులు చంద్రబాబు తరువాత ఎవరు? అని. ఎన్టీఆర్ సమయంలో ఆ ఆలోచన రాకముందే, చంద్రబాబు వెన్నుపోటుతో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకోవడంతో ఇక ఆ ప్రశ్నకు స్థానం లేకపోయింది. ఇపుడు చంద్రబాబు గారి పుత్రరత్నం లోకేష్ బాబు గారి సమర్థత జగద్వితం కాబట్టి, పార్టీని మళ్ళీ నందమూరి వంశం చేతుల్లో పెట్టె ఉద్దేశం లేకపోబట్టి (జూ ఎన్టీఆర్ లాంటి ఆకర్షక, సమర్థవ్యక్తులకు) ఈ ఎన్నికలు తెదేపాకు ఒకరకంగా జీవన్మరణ సమస్యలాంటివి. సరే, ఆ భయాలు పక్కనబెట్టి ఈ ఎన్నికల్లో తెదేపా అవకాశాలు పరిశీలిద్దాం. ఈ ఎన్నికల్లో తెదేపాకు ఉన్న ప్రధాన బలాలు పరిశీలిస్తే - ఆర్థికపుష్టి, అధికార వర్గాలను చెప్పుచేతల్లో పెట్టుకోవడం, అనేక కీలక/ప్రభావిత పదవుల్లో తమ వర్గం వారిని నియమించుకోవడం, దాదాపు 90% పైగా మీడియా గ్రూప్ తమకు భజనబృందమే కావడం వంటివి ప్రధానంగా కనబడతాయి. అయితే ఇవి మాత్రమే విజయతీరాలను చేర్చగలుగుతాయా అంటే వారు నంద్యాల ఉపఎన్నికను ఉదాహరణగా చూపుతారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కీలక నేతలు అక్కడే ఉండి కథ నడిపించారు. మరి సార్వత్రిక ఎన్నికల సమయంలో 175 స్థానాల్లో అది సాధ్యమేనా? ఇక పై స్థాయిలో అధికారులను తమ అనుకూలురను నియమించుకున్నప్పటికీ, క్రింది స్థాయిలో ఉన్న వారు ఎంతవరకూ సహకరిస్తారు, అందునా వారిలో ప్రతిపక్షం అనుకూలురు ఉండవచ్చు కదా. ఇక మీడియా గురించి మాట్లాడితే 2009 సమయంలో, 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా మీడియా ఇదే తీరున వ్యవహరించింది కాగా ఫలితం తెలిసిందే. బహుశా రానురానూ చంద్రబాబు గారు ఆ వర్గపు మీడియాకు తెల్ల ఏనుగుగా మారుతున్నట్టున్నారు, సరియైన ప్రత్యామ్నాయ నేత తమవర్గంలో కనబడకపోవడంతో వారు చంద్రబాబును మరియు లోకేష్ ను భుజాన మోయక తప్పని పరిస్థితి.
ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు దాదాపు ప్రతి పక్షమూ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం ప్రత్యేక హోదా. ఇవాళ చంద్రబాబు గారు ప్రత్యేకహోదా గురించి భాజపాను దోషిగా చూపాలని యత్నిస్తున్నారు. మరే ఇతర మీడియా మరియు సోషల్ మీడియా లేకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ - నాడు చంద్రబాబు గారు ప్యాకేజీని స్వాగతించడమూ, మళ్ళీ మోదీ ప్రధాని కావాలని మంత్రివర్గ తీర్మానాలు చెయ్యడం, హోదా కంటే ప్యాకేజీ మేలు అనడం, హోదా అంటే జైలుకు పంపుతాననడం వంటివాటితో పాటు నాడు చంద్రబాబు గారు చేసిన ప్రతివ్యాఖ్య ఇపుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. వాటితో పాటు 2014 ఎన్నికల్లో పుంఖానుపుంఖాలుగా (600 కు పైగా) ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం వెంటాడుతోంది. రైతులు, ఉద్యోగవర్గాలు, యువత వంటి ప్రధాన వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉండటం కలవరపరచే అంశం. ఆ వ్యతిరేకతను ప్రతిపక్షం ఎంతవరకూ సమర్థంగా తమవైపు మళ్లించగలుగుతుందనేది ముఖ్యమైన అంశం. చంద్రబాబు గారు తన వ్యూహాలకు పదును పెట్టి, పవన్ బయటకు పంపినట్టున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వోట్ చీలేలా చేసి ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న యత్నం ఎంతవరకూ ఫలిస్తుందో అనుమానమే. చంద్రబాబు గారి ప్రచారతీరులో అసహనం, అనుమానం, భయం స్పష్టంగా కనబడుతున్నాయి. దానికి తోడు, టికెట్స్ ప్రకటించాక ప్రచారం మొదలెట్టిన కొందరు అభ్యర్థులు ఇక తమవల్ల కాదని తప్పుకుంటుండటం; అగ్రశ్రేణి నాయకులు ప్రతిపక్షంలోకి క్యూ కట్టడం; అనేక చోట్ల నాయకుల మధ్య గొడవలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. చంద్రబాబుగారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఈ వయసులో, ఇంతటి తీవ్ర సంక్లిష్ట పరిస్థితులలో కూడా వెనక్కి తగ్గకపోవడం, ఆయన చేసేవాటిలో అనేకమైనవి నైతికంగా, చట్టపరంగా, ఇతరత్రా తప్పులే అయ్యుండొచ్చు కానీ ఎంత కిందపడ్డా పోరాటం వదలదు. నాకు ఆయనలో నచ్చేది ప్రధానంగా అదొక్కటే.
ఇక ప్రస్తుత ఎన్నికల్లో 2004 కంటే ఎక్కువగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు ఉంది పరిస్థితి. 2014 లో చంద్రబాబుకు అధికారం దక్కడంలో ప్రధానపాత్ర పోషించిన అంశం ఆయన అనుభవం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆయనలాంటి అనుభవజ్ఞుడు అవసరం అన్న అభిప్రాయం చివరి దశలో ఆయనను విజయం వైపు నడిపింది. కానీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవోడంలో ఆయన దారుణంగా విఫలమయ్యారు. ఒక్కటైనా శాశ్వతనిర్మాణం జరిగిందో లేదో కానీ తాత్కాలిక నిర్మాణాల పేరిట వందల కోట్లు ఖర్చయిపోయాయి. ఇక వోట్ కు నోటు వంటి అంశాలు ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవిగా మారాయి ఇన్ని ప్రతికూలతలు మధ్య, చరిత్రలో తొలిసారిగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళడం కూడా ఒకటి. ఇన్ని ఉన్నప్పటికీ, తెదేపా నాయకులు మరియు అభిమానులు అందరిలో ఒకటే నమ్మకం - ఆయన ఏదో ఒకటి చేసి, గెలిపిస్తాడు అని. ఇప్పటికే పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పరిశీలిస్తుంటే - ఈసారి వోటర్ల కంటే, నాయకుల కంటే, పనితీరు కంటే ఎక్కువగా అధికార యంత్రాంగాన్ని నమ్ముకుని వాడుకోవాలని భావిస్తున్నట్టు ఉంది. నా అభిప్రాయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వోటర్లు పోలింగ్ బూత్ దాకా రాగలిగితే మాత్రం తెదేపా ఓటమిని ఎవరూ ఆపలేరు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఓటమిలో తేడాను తగ్గించగలరేమో కానీ ఓటమిని తప్పించుకోలేరు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.
ప్రాంతాల వారిగా పరిశీలిస్తే - రాయలసీమ ప్రాంతంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మరోసారి తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించడం తధ్యం - ఆ విధంగా చూస్తే మొత్తం 54 స్థానాలకు గాను దాదాపు 10 నుండి 12 స్థానాలు తెదేపా సాధించగలదు అని నా అంచనా. ఇక ఆంద్ర ప్రాంతంలో ప్రతిపక్షంరాయలసీమ స్థాయి ఆధిక్యతను ప్రదర్శించే స్థాయిలో లేనప్పటికీ స్పష్టమైన స్థాయిలో తెదేపా కంటే ఎక్కువగానే స్థానాలు సాధిస్తున్నది ఖాయం. మొత్తం 101 స్థానాలకు గాను తెదేపా 35 నుండి 42 దాకా స్థానాలు సాధించగలదని నా అంచనా. మొత్తం మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో తెదేపా 45 నుండి 55 దాకా స్థానాలు సాధించే అవకాశం ఉందని నా అంచనా. నా అభిప్రాయంలో ఈ అంచనాలో ఒక రెండు లేదా మూడు శాతం అటూ ఇటూగా తేడా ఉండే అవకాశం ఉంది. ఒకటి మాత్రం నిజం - ఈ ఎన్నికలు తెదేపాకు అత్యంత ముఖ్యమైనవి.
అయ్యిందా భజన ... సాక్షి నుంచి కాపీ కొట్టినట్టున్నవ్ ... జగన్ ను మోయడానికి శక్థి వంచన లేకుండా పాటుపడుతున్నావ్
ReplyDeleteహ హ ... ఇంకో చోటి నుండి కాపీ కొట్టే అలవాటు లేదు, బహుశా మీకుందేమో. ఇక భజన చెయ్యటానికి నేనేవడికీ భక్తుడిని కాను. నాకు తెలిసిన జర్నలిస్ట్స్ మరియు వివిధ ప్రాంతాలలోని స్థానికులతో మాట్లాడి రాబట్టుకున్న వివరాలతో పాటు, అనేక సంవత్సరాలుగా క్రమం తప్పకుండా రాజకీయాలను ఫాలో అవుతున్న పరిజ్ఞానంతో నా దృక్కోణంలోంచి రాసుకున్నాను. మీకు నచ్చనంత మాత్రాన నాది భజన అయిపోదు. ఇక జగన్ ను మోయాల్సిన అవసరం నాకు లేదు. మీకు కావలసిన విధంగా అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. అలా కాక, నేను ప్రస్తావించిన విషయాలలో మీకు కాదు అనిపించిన వాటిపై సవివరణాత్మకంగా చర్చిద్దాం అంటే నేను సిద్ధం.
Deleteమీ అంచనా తప్పు కావాలని కోరుకొంటున్నాను. తప్పు అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైకాపా అధికారంలోకి వస్తే ఆంద్రప్రదేశ్ పరిస్థితి పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది.
ReplyDeleteహ్మ్ ... నా అంచనా నిజమవుతుందా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ, నా అనేక గత అంచనాలు నిజమే అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటారా - ప్రస్తుతం చంద్రబాబు & కో తీసుకెళ్ళిన పరిస్థితికంటే దిగువకు ఎవరూ తీసుకెళ్ళలేరు అని మాత్రం చెప్పవచ్చు - అది జగన్ అయినా లేక పవన్ అయినా లేదా మరెవరైనా. ముందుగానే చెప్పినట్టు - ఇవి నా అంచనాలు.
Delete