... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు -కాంగ్రెస్

వంశీ వ్యూ పాయింట్ // ... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు -కాంగ్రెస్ // 
*********************************************************************
            రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఎవరెవరికి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది నాకు తెలిసినంతవరకూ, అర్థమైనంతవరకూ ఒక సిరీస్ గా రాస్తానని కొన్నాళ్ళ క్రితం చెప్పాను. అందులో భాగంగా మొదటగా వామపక్షాల గురించి రాశాను (https://vamsikalugotla-stories.blogspot.com/2019/02/2019.html) - ఇక ఇపుడు కాంగ్రెస్ గురించి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ స్థాయి నానాటికి దిగజారుతున్నది అన్నది అందరికి తెలిసిన విషయమే. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే కాంగ్రెస్ పతనానికి కారణమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ స్వీయ తప్పిదాలు, విభజన పాపం వల్ల అస్థిత్వాన్ని కోల్పోయే స్థాయికి దిగజారిపోయింది. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అవకాశాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. 
            ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అవకాశాల గురించి చర్చించే ముందుగా ఒకసారి ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రదర్శన గురించి ప్రస్తావించుకుందాం. తెలంగాణాలో ఎన్నికలకు ముందుగా ఉన్నప్పటి పరిస్థితిని పరిశీలిస్తే - కెసిఆర్ కు అత్యంత అనుకూలంగా ఏమీ లేదు. కాస్త అటూ ఇటూ అయితే కెసిఆర్ ఓడిపోతాడు అనేలా ఉండేది పరిస్థితి. అటువంటిది దాదాపు 90 స్థానాలలో విజయం సాధించడం అంటే అది కాంగ్రెస్ స్వీయ తప్పిదాల వల్లనే అని విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ చేసిన మొదటి తప్పు తెదేపాతో పొత్తు; ఇక సమర్థవంతమైన స్థానిక నేతలు లేకపోవడం, స్థానిక నేతలెవరినీ ముఖ్యమంత్రి స్థానానికి ప్రకటించకపోవడం వంటివి కూడా ముఖ్య తప్పిదాలే. అంతేకాక పొత్తుకు ఒప్పుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలను కూడా తెదేపా అధినేత చేతిలో పెట్టడం వారిపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసి దెబ్బతీసింది. తెలంగాణాలో వైఫల్యాల ద్వారా ఏమైనా నేర్చుకున్నారా అన్నది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వేసుకోవాల్సిన ప్రశ్న. 
            తెలంగాణాలో తెదేపాతో పొత్తు ఎంతటి దారుణమైన దెబ్బ తీసిందో, ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో 'స్థానికంగా పొత్తు లేదు, జాతీయస్థాయిలో తెదేపా - కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి' అన్న విధానం కూడా అదే స్థాయి తప్పిదంగా నిలిచిపోతుంది అన్నది అనేకమంది అభిప్రాయం. గత ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఇపుడు గత ఎన్నికలలో లభించిన వోట్ శాతం కూడా కోల్పోయే ప్రమాదపు స్థాయిలో ఉంది. లోపాయికారి ఒప్పందాల మేరకు కాంగ్రెస్ లో స్థానికంగా అంతో ఇంతో బలమున్న నాయకులు తెదేపాలోకి చేరి'పోతున్నారు'. సాంకేతికంగా చెప్పాలంటే బహుశా స్థానిక కాంగ్రెస్ ను తెదేపాలో విలీనం చేశారు అన్నట్టుంది పరిస్థితి. ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న ఈ సమయంలో, ఆ వ్యతిరేకతను మోస్తున్న తెదేపాను కాక ప్రతిపక్షాన్ని విమర్శించాల్సిన దౌర్భాగ్యస్థితిలోకి నెట్టేయబడిన కాంగ్రెస్ ది. 
            ఇపుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ముందున్న లక్ష్యం ఒకటే, జాతీయ స్థాయిలో తమకు అండగా నిలబడతానని అంటున్న చంద్రబాబుకు ఇక్కడ వీలైనంత సాయం చేయడమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా ప్రతిపక్షాన్ని దెబ్బతీసి తెదేపా లబ్ది పొందేలా చెయ్యాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ఎంతవరకూ సహలమవుతుంది అన్నది ప్రస్నార్ధకమే. ఎందుకంటే కాంగ్రెస్ కు సమర్థమైన అన్నది పక్కనబెట్టనా, జనాలను ఆకట్టుకోగలిగే నాయకుడు లేదా కాస్తయినా జనబలం ఉన్న నాయకుల లోటు ఉంది. ఉన్న కాస్తూ కూస్తో జనబలం ఉన్న నాయకులు అటు తెదేపాలోకో లేదా వైఎస్సార్సీపి లోకో చేరుతున్నారు. ఇక ఓట్ చీల్చడం అన్నది కూడా అనుమానమే ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ కాంగ్రెస్ కు పడాలంటే, జనాలలో కాంగ్రెస్ పట్ల నమ్మకం కలగాలి. నమ్మకం మాట అంటుంది, విభజన కోపమే ఇంకా చల్లారలేదు. 
            అన్ని రకాల అంశాలను, అవకాశాలను పరిశీలిస్తే కాంగ్రెస్ సీట్ల పరంగా గత ఎన్నికల స్థాయిలోనే నిలిచే అవకాశాలు పుష్కలం - అంతేకాక వోట్ షేర్ మరింత తగ్గి, పూర్తిగా దిగజారిపోయే అవకాశాలే అధికం. ప్రభుత్వ వ్యతిరేక వోట్ ను కూడా చీల్చే సత్తాలేని కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అస్థిత్వాన్ని కోల్పోవడమే ఈ ఎన్నికల ఫలితాలు. అంతకు మించి కాంగ్రెస్ అవకాశాల గురించి చర్చించుకోవడం దండగ ... (తరువాతి వ్యాసం - జనసేన అవకాశాల గురించి)

Comments

  1. "కాస్త అటూ ఇటూ అయితే కెసిఆర్ ఓడిపోతాడు అనేలా ఉండేది పరిస్థితి. అటువంటిది దాదాపు 90 స్థానాలలో విజయం సాధించడం అంటే అది కాంగ్రెస్ స్వీయ తప్పిదాల వల్లనే అని విశ్లేషకుల అభిప్రాయం."

    సదరు "విశ్లేషకులు" దాదాపు అందరూ ఆంధ్రులు/టీడీపీ సమర్తకులే. వారికి క్షేత్ర పరిస్థితులు తెలీవా లేక preference vs. prediction తేడా తెలీదా అన్నది అనుమానమే.

    ఉ. ఎన్నికలకు వారం ముందు ఫలానా ఛానెల్ "ప్రజలు తెరాసను నమ్ముతున్నారా?" అనే
    కార్యక్రమం ప్ర"చా"రం చేసారు. ఆంకరమ్మ, "విశ్లేషకులు" & ఫోన్-ఇన్ కాలర్లు అందరూ ఆంధ్రులే, అందరిదీ ఒకే అభిప్రాయం!

    ReplyDelete
    Replies
    1. అవును, నేనూ మీతో ఈ విషయంలో అంగీకరిస్తాను. కానీ, తెదేపాతో పొత్తు మరియు చంద్రబాబు ఆధీనంలోకి తెలంగాణ కాంగ్రెస్ వెళ్లడం కంటే ముందు కాంగ్రెస్ గెలుస్తుంది అనేలా కాకపోయినా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉండిందన్నది నా అభిప్రాయం. కానీ, తెదేపాతో పొత్తు, చంద్రబాబుకు సాగిలపడటం అన్నవి తెరాసకు మరింత లాభదాయకమయ్యాయి అన్నది నా అభిప్రాయం. ఇక మీరన్నట్టు ఆ టీవీ ఛానెల్స్ అన్నీ విషప్రచారం చేయడంలో ముందుండినవి, ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా తెదేపాకు పక్క వాయిద్యాలుగా ఉండబోతున్నాయన్నదానిలో అనుమానమేమీ లేదు.

      Delete
    2. OK. Anyways the subject of the blog is Andhra elections.

      Delete
  2. 2014 ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి వైకాపా కంటే కేవలం అరశాతం (44.7%- 44.2%= 0.5%) ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడు జగన్ సీఎం కాకపోవడానికి కాంగ్రెస్ అభ్యర్థులకు పడ్డ 2.8% ఓట్లు కూడా ఒక కారణం.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది కరెక్ట్. కానీ, అపుడు భాజపాకు పాజిటివ్ ఎడ్జ్ ఉండింది, కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత మరియు నరేంద్ర మోదీ పట్ల విపరీతమైన నమ్మకం వంటివి అన్నీ కలిసొచ్చాయి. ఇపుడు రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది, కొంతలో కొంత భాజపా పరిస్థితే నయమేమో ఎందుకంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వారికి కలిసొచ్చే అంశం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే - వ్యాసంలో పేర్కొన్నట్టు నాయకత్వ లేమి, చంద్రబాబు ఆధీనంలోకి పోవడం వంటివి సాంప్రదాయ కాంగ్రెస్ వాదులను (సామాన్య ఓటర్లు) కూడా కాంగ్రెస్ నుండి దూరం జరిగేలా చేస్తున్నాయి. వారికున్న ఏకైక ప్రత్యామ్నాయం వైఎస్సార్సీపీ, ఎందుకంటే జనసేన తెదేపా నీడలోని మొక్కే అని అర్థమవుతోంది కాబట్టి. ఈ కోణంలోంచి చూస్తే కాంగ్రెస్ కోల్పోయే వోట్ శాతం వైఎస్సార్సీపీకి లాభించగలదని అనిపిస్తోంది. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ తో పొత్తు కాకుండా, కాంగ్రెస్ తరఫున నామ్ కె వస్తే పోటీదారులను బరిలో నిలపాలని యత్నిస్తున్నారు. తద్వారా సాంప్రదాయ కాంగ్రెస్ వోట్ బ్యాంకు చెదరకుండా (అంటే ఆ 2% లేదా 3%) చూడాలని, తద్వారా వైఎస్సార్సీపీకి లాభం కలగకుండా చూడాలని ప్రయత్నం. చూద్దాం ...

      Delete
    2. మీరు బీజేపీ పరిస్థితి గురించి వేరే టపా రాస్తారు కనుక ఆ పార్టీ సంగతి ప్రస్తుతానికి వదిలేస్తాను.

      కాంగ్రెస్ గురించి బాబుకు రెండు ఆప్షన్లు ఉండేవి. కలిసి పోటీ చేయడం వలన కొన్ని సీట్లు (10-15? అసెంబ్లీ ప్లస్ 4-5 లోక్సభ) త్యాగం చేయాల్సి వచ్చేది. పైపెచ్చు కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బాంక్ (దళిత, మైనారిటీ & రెడ్డి?) ట్రాన్స్ఫర్ అవుతాయన్న నమ్మకం లేదు. విడిగా పోటీ చేస్తే ఆ 2-3% వైకాపాకు పడకుండా ఉంటాయి, రెండు మూడు లోక్సభ సీట్లు కాంగ్రెస్ జంపింగులకు కేటాయిస్తే చాలు. కనుక ఇదే వ్యూహం బెటర్.

      రాహుల్ ప్రధానమంత్రి అయితే ఆంధ్రకు 3-4 కేంద్రమంత్రుల కోటా రావొచ్చు. అందులో భాగంగా కోట్ల & వైరిచర్ల గార్లను కూడా అకామడేట్ చేయాలని అవగాహనకు వచ్చారనిపిస్తుంది.

      ఈ వ్యూహం ఫలిస్తుందా ఇప్పుడే చెప్పలేము కాకపొతే too little too late కావొచ్చేమే అన్న అనుమానమూ ఉంది.

      Delete
    3. మీరన్నది నిజం, నేను చెప్పింది అదే చంద్రబాబు గారి వ్యూహం గురించి. కానీ, తెలంగాణాలో పొత్తు - ఇపుడు జాతీయ స్థాయి పొత్తు అంటూ వారు చెబుతున్నది జనాలకు బాగానే అర్థమైందనిపిస్తోంది (ఆంధ్రాలో కూడా అని నా ఉద్దేశం). ఇపుడు తెదేపాతో లోపాయికారి పొత్తు ద్వారా కాంగ్రెస్ తనకు మిగిలి ఉన్న కాస్త సాంప్రదాయ ఓటర్లలో తరుగును చూడబోతోంది అన్నది నా అంచనా. కాంగ్రెస్ కోల్పోబోయే ఆ వోట్ బ్యాంకు సహజంగానే వైఎస్సార్సీపీకి మారుతుంది అని నా విశ్లేషణ మరియు అంచనా. భాజపా గురించి కూడా మరొక వ్యాసంలో రాస్తాను. తరువాతి క్రమం - జనసేన, భాజపా, తెదేపా, వైఎస్సార్సీపీ. ☺

      Delete
  3. "తరువాతి క్రమం - జనసేన, భాజపా, తెదేపా, వైఎస్సార్సీపీ"

    Excellent analysis so far, looking forward to future blog posts!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన