... నూటికి నూటిపాళ్ళూ నిజం
వంశీ కలుగోట్ల // ... నూటికి నూటిపాళ్ళూ నిజం //
**************************************************
రామ్ గోపాల్ వర్మ పైత్యం
మనం చూసే దృష్టే తప్పించి 'నూటికి నూటిపాళ్ళూ నిజం అంటూ ఏదీ లేదు. మనకు నచ్చిందా లేదా అన్నదే ముఖ్యం తప్పించి మరేదీ ముఖ్యం కాదు' అని నుడివే స్వేచ్చాజీవి రామ్ గోపాల్ వర్మ తన తాజా వెబ్ సిరీస్ 'కడప' ట్రైలర్ లో '... ఇది నూటికి నూటిపాళ్ళూ నిజం' అంటూ వాకృచ్చడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అందునా '... ఇది నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మాత్రమే కాదు నూటికి నూరుపాళ్ళూ నిజం' అంటూ దానిపై వాస్తవముద్ర వేయటం మరింత ఆశ్చర్యం. హత్య జరగటం అన్నది మాత్రమే వాస్తవం - ఆ హత్య ఎందుకు జరిగింది అన్నది మాత్రం కథనం. కాగా, వర్మ లాంటి పరిశీలనాత్మక దృక్కోణం ఉన్నటువంటి దర్శకమేధావి కూడా కథనాన్నే 'నూటికి నూరుపాళ్ళూ నిజం' అంటూ వాస్తవముద్ర వేయడం ఎంతవరకూ సబబు?
ఆయనను పట్టించుకోకపోవటం అన్నది పరిష్కారం కాగలదా?
ఎంత కాదనుకున్నా సినిమా వంటి దృశ్య మాధ్యమాలు సమాజంపై చూపే ప్రభావం అధికం. అది మంచికంటే చెడు ఎక్కువ. ఉదాహరణకు తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రస్తావించుకుందాం. నాగర్ కర్నూల్ కు చెందిన ఒక వివాహిత తన భర్తను హత్య చేసి, ప్రియుడిని ముఖమార్పిడి ద్వారా భర్తగా తీసుకురావాలని పథకం వెయ్యటం - అది కాస్తా 'మటన్ పులుసు' ద్వారా తిరగబడి ఊచలు లెక్కపెట్టటం అన్నది. ఈ ఘటనలో వారు చెప్పినదాని ప్రకారం టీవీ సీరియల్స్ లో చూపిన విధంగా ముఖమార్పిడి (ప్లాస్టిక్ సర్జరీ) ద్వారా భర్త స్థానంలోకి ప్రియుడిని తీసుకురావాలన్నది ఆమె పథకం. బెడిసి కొట్టింది. అది జరిగిన రెండు మూడు రోజులకో కర్నూల్ జిల్లా బ్రాహ్మణపల్లిలో కాస్త సామీప్యం ఉన్న ఘటన అటువంటిదే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి? సీరియల్స్ లేదా సినిమాలు వంటివాటిలో చూపుతున్న ఇటువంటి (ముఖమార్పిడి వంటివి) సృజనాత్మకత కొన్నిసార్లు చెడుకు కూడా కారణమవుతుంది. కళారంగానికి చెందినవారికి (ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే కాదు - అందరూ అని మనవి) సమాజంపట్ల బాధ్యత లేదా? బాధ్యత అంటే రామ్ గోపాల్ వర్మ లాగా ఒకవైపు సమాజంలోని ధోరణులను తిడుతూ మరోవైపు చెడును ప్రేరేపించే కతాంశాలతో చిత్రాలవంటివి తీయటమా? గతంలో సినిమాలలో సింబాలిక్ మేకింగ్ అంటూ ఒకటుండేది. ఉదాహరణకు ముద్దు దృశ్యాన్ని చూపటానికి పువ్వు అడ్డు పెట్టేవారు, కోరికలను చెప్పటానికి అలలను చూపటం ... అలా. ఎదగటం అంటే ఆ అడ్డు తొలగించి ముద్దులు, శృంగారాన్ని కెమెరాలో అందంగా చూపటమేనా? కాలు నరకటం అన్నది విషయం అయినపుడు దాన్ని గొడ్డలితో వేటు వేసినట్టు చూపి, రక్తం చిందినట్టు చూపవచ్చు. ఒకడు నరుకుతుంటే మరొకడు ఆ కాలును మరొకడు తెగ్గొట్టి గాల్లోకి ఎగరేయటం చూపటం ఇదేనా వర్మలోని పెరిగిపోతున్న సృజనాత్మకత? అదేనా నిజాన్ని చూపటం అంటే? ఆయితే మర్మాంగాలను/శృంగారాన్ని చూపటం లేదా హత్యలను/హింసను చూపటం - ఈ రెండు అంశాల మీదే వర్మలాంటి మేధావి సృజనాత్మకత పరిమితమవడం సబబేనా?
వర్మని ఏం చెయ్యాలి?
చాలామందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అందునా ఒక గుర్తింపు వచ్చాక, దాన్ని కోల్పోతామేమో అనే భయం అధికమవుతుంది. ఇపుడు రామ్ గోపాల్ వర్మ కూడా అలాటి క్రైసిస్ తో బాధపడుతున్నాడేమో. వర్మకు ఐడెంటిటీ క్రైసిస్ ఏంటి అంటూ సమర్థకులు చొక్కాలు చించుకోవచ్చుగాక ... దానికి సరియైన సమాధానం మనస్తత్వ విశ్లేషకులే చెప్పగలరు. నేను మాత్రం ఇది నూటికి నూటిపాళ్ళూ నిజం అనడం లేదు. ఇంతకీ అసలు ప్రశ్న అలానే ఉండిపోయింది కదా 'వర్మని ఏం చెయ్యాలి' పట్టించుకోకుండా మాత్రం వదిలెయ్యకూడదు. రాజకీయాల్లో పెరిగిపోతున్న చెడులానే వర్మలోని పైత్యం పెరిగిపోతోంది. ఒకటి వర్మకి మళ్ళీ భారత్ షా లాంటి వ్యక్తి దొరికి బాలీవుడ్ కి వెళ్ళిపోవాలి. రెండు వర్మకి స్వస్థత చేకూరేలా అధికార స్థాయి వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి. ఆర్జీవీ అనబడే సెలబ్రిటీ అంటే ఇలా ఉంటాడు అనే అభిప్రాయాన్ని గెలిపించటానికి రాం గోపాల్ వర్మ అనబడే మనిషి ఓడిపోతూన్నట్టుగా అనిపిస్తోంది.
సమయం వృధా చేసుకుంటున్నావంటారా ...
బహుశా కావచ్చు. వర్మ గురించి రాయటం, మాట్లాడటం అన్నవి సమయం వృధా అనుకునేవారెంతమంది ఉన్నారో వర్మను ఒక మహానుభావుడిగా కీర్తించేవారు, అనుసరించేవారు అంతేముంది ఉన్నారు. ఇపుడు జరగాల్సింది వర్మ తీరు గురించి చర్చ. ఒక వ్యక్తిగా వర్మను విమర్శించేవారో, సమర్థించేవారో ఇక్కడకు రానక్కరలేదు. కేవలం విధానాల మీద మాత్రమే చర్చ అని నా అభిప్రాయం. అలాటి ఆసక్తి ఉంటే ... స్వాగతం. లేకపోతే వర్మ స్టైల్ లో 'ఏం హీక్కుంటారో హీక్కోండి'
Comments
Post a Comment