... ఎవరో ఒకరు, ఎపుడో అపుడు
వంశీ కలుగోట్ల // ... ఎవరో ఒకరు, ఎపుడో అపుడు //
***************************************************
'మీ అందరి తరఫున నేను పోరాడతాను, నేను ముందుంటాను' అనేవారి అవసరం ఇవుడు (అసలు ఎపుడైనా) ఉందా? జరిగిందో లేదో అని సంవాదాలు జరుగుతున్న పురాణాల కాలం నుండి కూడా ఇంతే పోరాడతామంటూ వచ్చేవారు నాయకులుగా ఎదుగుతున్నారు తప్పించి పీడితులు అలానే ఉంటూనే ఉన్నారు. అధికారం లేదా పదవి ఉంటేనే మంచి చెయ్యగలం అన్నది భ్రమ కాదు - అంతర్లీనంగా ఆయా వ్యక్తులలో ఉన్న 'అధికార కాంక్ష లేదా పదవీ వ్యామోహం లేదా పవర్ పట్ల ఉన్న వ్యామోహం'. ఇంత మంచి చెయ్యాలి, అంత మంచి చెయ్యాలి అనే కొలబద్దలేమీ లేవు. నీకు చేతనైనంత చెయ్యి - నీతో కలిసి వచ్చేవారితో కలిసి పని చెయ్యి. నీ లక్ష్యం మార్పు అంటున్నావు అంటే అది ఎటువంటి మార్పు అన్నది ముందుగా నీకు నువ్వు ఒక అవగాహన తెచ్చుకో. మార్పు అన్నది గుప్పెడు మంది అధికారపదవుల్లో ఉన్న వ్యక్తులను మారిస్తే రాదు. లెక్కకు మిక్కిలిగా ఉన్న జనాల ఆలోచనల్లో వస్తేనే మార్పు సాధ్యమవుతుంది. అది అంత సులువైన విషయమూ కాదు, తొందరగా జరిగే పనీ కాదు. కానీ, ఎప్పుడైతే అసలు లక్ష్యం నుండి చూపు మరల్చి, అధికార సాధన మీద దృష్టి పెడతారో అపుడేమవుతుందంటే లక్ష్యం మారిపోతుంది. పోరాటమూ మారిపోతుంది. ఎందుకంటే రాజకీయంలో అప్పటికే పాతుకుపోయిన శక్తులు, ఈ కొత్త వర్గం యొక్క స్థాయిని బట్టి అణచివేయాలనే ప్రయత్నాలు మొదలుపెడతారు. అపుడు ఈ వర్గాలతో పోరాటం, వారితో పోరాడాలంటే ఒక స్థాయి కావాలి కాబట్టి కొన్ని అంశాలలో రాజీ పడటం ఇలా ఇక మెట్లు దిగటం మొదటలవుతుంది. ఒకసారి దిగటం మొదలయ్యాక ఇక ఆగటం ఉండదు. కొత్త లోతులను అన్వేషిస్తూ దిగజారిపోవటమే తప్పించి. అందుకే ఇపుడు కొత్త రాజకీయ పార్టీల అవసరం లేదు. ఎవరైనా కొత్త పార్టీ అని వస్తే నమ్మకండి, నమ్మి మరోసారి 'కొత్త దేవుడి' చేతిలో మోసపోవడమా వద్దా అన్నది ఆలోచించుకోవాలి. అలాగని అక్రమాలను సహించమనడం లేదు. చెప్పానుగా మార్పు అన్నది అధికారంలో ఉన్నవారు మారితే వచ్చేది కాదు, క్షేత్ర స్థాయి ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తేనే సాధ్యమవుతుంది. దానికోసం అడుగు మొదలుపెట్టాలి. లక్ష్యం నుండి దృష్టి మరల్చకూడదు. నీ వల్లనో, ఈ తరం ఆలోచనాపరుల వల్లనో వీలయ్యేది కాదు ఇది. అలాగని పయనం ఆపకూడదు. ఇపుడు కావలసింది కొత్త రాజకీయ పార్టీలు కాదు, కొత్త ఆలోచనలతో కూడిన కార్యాచరణ. చెప్పడం బహు సులువే, కానీ ఎంతవరకూ సాధ్యం అన్నది వెంటనే మొలకెత్తే ప్రశ్న. దానికి నేను చెప్పుకునే సమాధానం ఒక్కటే 'ఎంతటి దూరపు ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది'. అంకురం సినిమాలో చెప్పినట్టు 'ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు ఆటో ఇటో ఏటో ...'
Comments
Post a Comment