... తెలుగు సినిమా 2017 (నా వ్యూ)

వంశీ కలుగోట్ల // ... తెలుగు సినిమా 2017 (నా వ్యూ) //
*******************************************************
తెలుగు సినిమా 2017 లో బాహుబలి సాక్షిగా వెలిగిపోయింది. కానీ, ఒక్క బాహుబలితోనే ఆగిపోలేదు. పెద్ద, చిన్న సినిమాలు మంచి విజయాలను నమోదు చేసి, తెలుగు సినిమా హద్దులను చెరిపేసే దిశగా అడుగులు పడ్డాయని చెప్పవచ్చు. నా దృష్టిలో ఈ సంవత్సరం తెలుగు సినిమా రంగంలోప్రస్తావించుకోదగ్గ సినిమాలుగా అనిపించిన చిత్రాలతో చిన్న సమీక్షలాంటిది ...  

బాహుబలి 2: 'బాహుబలి' అన్నది నిస్సందేహంగా ఒక్క తెలుగు సినిమా రంగాన్నే కాక భారతీయ సినిమా రంగాన్నే వాణిజ్యపరంగా, సాంకేతిక హంగుల పరంగా కొత్త అడుగులు వేయించిన సినిమా. ముఖ్యంగా సాంకేతికత విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే పరిమిత వనరులతో హాలీవుడ్ స్థాయికేమాత్రం తగ్గకుండా తయారైంది. ఆ కష్టం వృధా పోకుండా, వాణిజ్యపరంగా సంచలనాత్మక విజయం సాధించింది. భారతీయ సినిమా సాంకేతిక విలువలు బాహుబలికి ముందు, తరువాత అన్నట్లు తయారైంది. అంతేకాదు దక్షిణాది సినిమారంగం అంటే 'తమిళం' అనుకునేవారికి తెలుగు సినిమాను పరిచయం చేసింది. బహుశా, ఇప్పటికీ ఇంకా దక్షిణాది సినిమా అంటే తమిళ సినిమా అనుకునేవారు ఉండొచ్చు, కానీ ఆ భ్రమలను చెరిపేసిన సినిమాగా బాహుబలి చరిత్రలో నిలిచిపోతుంది. 
(నా రివ్యూ - http://vamsikalugotla-stories.blogspot.co.uk/2017/04/2.html)

అర్జున్ రెడ్డి: ఇది సినిమా, ఇదీ సినిమా ... ఇదీ అసలైన సినిమా. ఈ చిత్రం రివ్యూలో నేను రాసిన వాక్యం పునఃప్రస్తావిస్తున్నాను 'కథ అయితే ఎలా ఉందో చెప్పొచ్చు, కానీ ఒక జీవితాన్ని చూపిస్తే ... ఏం చెప్పాలి?'. ఎటువంటి రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించడంలో నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విజయం సాధించాడు. కథను సూటిగా, స్పష్టంగా, హత్తుకునేలా చెప్పడంలో ఎక్కడా వాణిజ్యపరమైన అదనపు హంగులు జొప్పించకుండా మన కళ్ళముందు చూసిన జీవితంలా అనిపించేలా తీశాడీ సినిమాని. అప్పట్లో ఒకసారి 'ప్రేమ్ నగర్' సినిమాలోని ' ... నేను నవ్వాను లోకం ఏడ్చింది; నేను ఏడ్చాను లోకం నవ్వింది; నాకింకా లోకంతో పని ఏముంది ...' అన్న పాట విని ఆ పాట రాసిన ఆత్రేయ గారిని ఎవరో అడిగారట 'ఏంటండీ ఆ పాట అర్థం పర్థం లేకుండానూ...' అని. దానికి ఆత్రేయ గారు 'చూడండి, సినిమాలో పాత్ర ఏంటి? ఒక తాగుబోతు తాగి ఆడుతూ పాడే పాట. తాగుబోతు తాగిన తరువాత మాట్లాడే మాటలకి, పాటలకి అర్థం ఏముంటుంది చెప్పండి' అన్నారట. ఇంకేం మాట్లాడతారు. ఈ 'అర్జున్ రెడ్డి' కూడా అంతే. 
(నా రివ్యూ - http://vamsikalugotla-stories.blogspot.co.uk/2017/09/blog-post_17.html)

ఘాజీ: ఇది మరో అద్భుతం. ఇటువంటి సినిమాలు హాలీవుడ్ లో అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్ తో రూపొందుతుంటాయి. కానీ, పరిమిత బడ్జెట్ తో నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు, బిగుతైన దృశ్యానువాదం (స్క్రీన్ ప్లే) ఈ చిత్రానికి బలం. ఎక్కడా ప్రాంతీయ చిత్రం చూస్తున్నట్టు అనిపించదు. పరిమిత బడ్జెట్ అనేది తెరపై అనిపించదు. సంకల్ప్ రెడ్డికి హాట్స్ ఆఫ్. 

ఖైదీ నెంబర్ 150: దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమారంగంలో నెంబర్ వన్ గా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో విఫలతారగా మిగిలి మళ్ళీ సినిమారంగం ఒడికి చేరాడు. తిరిగొచ్చిన చిరంజీవిని తెరపై మళ్ళీ చూస్తారా, చూసినా గతంలోలా విజయాన్ని సాధించగలడా అని బహుశా ఆయన కూడా అనుకుని ఉండవచ్చు. కానీ, బాహుబలి తరువాత అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచి (ఇప్పటివరకు) చిరంజీవి సత్తాను చాటిన చిత్రంగా నిలిచింది. ఒక్క చిరంజీవి కం బ్యాక్ అని తప్పిస్తే ఎటువంటి ప్రత్యేకతలూ లేని సాధారణ చిత్రమైన ఖైదీ నెంబర్ 150 సాధించిన అసాధారణ విజయం చిరంజీవిని సై రా నరసింహారెడ్డి చిత్రం వైపు ధైర్యంగా అడుగులు వేయించింది. 
(నా రివ్యూ - http://vamsikalugotla-stories.blogspot.co.uk/2017/01/blog-post.html)

గౌతమీపుత్ర శాతకర్ణి: బాలకృష్ణ వందవ చిత్రంగా వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', బాలకృష్ణకు మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. చరిత్రను తెరకెక్కించే విధంలో తగిన జాగ్రత్తలు, మరికొంత సమయం తీసుకొని ఉంటే నిజంగానే ఒక మేలిమలుపుగా మిగిలిపోవాల్సిన చిత్రం అయినప్పటికీ హడావుడిగా తెరకెక్కించడంతో వాణిజ్యవిజయం సాధించి, అభిమానులను అలరించే సినిమాగా మిగిలిపోయింది. కానీ, చారిత్రిక చిత్రాలను అగ్రనటులు చేస్తే ఎలా ఉంటుందో చూపిందీ సినిమా. (బహుశా ఈ చిత్ర విజయం కూడా చిరంజీవిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంపై ఊగిసలాటను ఒక కొలిక్కి తెచ్చి ఉండవచ్చు.)  
(నా రివ్యూ - http://vamsikalugotla-stories.blogspot.co.uk/2017/01/blog-post_22.html)

గురు: రీ మేక్ అయినా సరే ఈ చిత్రం ఖచ్చితంగా ఒక మలుపు అని చెప్పవచ్చు. మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో కూడా ఒక మరచిపోలేని చిత్రం. చక్కటి కథ, బిగుతైన దృశ్యానువాదం బలాలుగా సుధ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులనూ ఆకట్టుకుని వాణిజ్య విజయం కూడా సాధించింది. 

పిఎస్స్వీ గరుడవేగ: ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా తన సత్తాను చూపిన చిత్రమిది. ఉన్నత సాంకేతిక విలువలతో, బిగుతైన దృశ్యానువాదంతో ప్రవీణ్ అద్భుతంగా తెరకెక్కించాడు. రాజశేఖర్ కెరీర్ కు ఊపిరులూదిన చిత్రంగా మాత్రమే కాక, 2017 లో విడుదలైన చిత్రాలలో ఉన్నతస్థాయి సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రంగా పిఎస్స్వీ గరుడవేగ మంచి విజయం సాధించింది. 

సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, సుధా కొంగర - ఈ సంవత్సరం తెలుగు సినిమా రంగానికి దొరికిన ముత్యాలు. సాధించిన విజయంతో నాలుగు డబ్బులు వెనకేసుకుందామనుకునేలా లేరు వీరు. కొత్త సంవత్సరం కొత్త చిత్రాలతో ఇదే తరహాలో సాగిపోతే బావుంటుంది. 

కేవలం విజయాల గురించే మాట్లాడుకోవాలంటే ఈ లెక్క చాలా చిన్నది కావొచ్చు. కానీ, పైన ప్రస్తావించిన చిత్రాలలో ఒక్క ఖైదీ నెంబర్ 150 తప్పించి మిగతా చిత్రాలన్నీ తెలుగు సినిమా హద్దులను, తెలుగు సినిమా అంటే ఇలా ఉంటుంది అనే అభిప్రాయాలను చెరిపేసిన సినిమాలు. (ఖైదీ నెంబర్ 150 అన్నది కేవలం చిరంజీవి పునఃప్రవేశం, చిరంజీవి స్థాయి చూపిన చిత్రం మాత్రమే.) 2018 కూడా మంచి విజయాలను, మంచి సినిమాలను అందించాలని కోరుకుందాం. విజయాలు మాత్రమే కాదు - బాహుబలి, అర్జున్ రెడ్డి, ఘాజీ లా నిలిచిపోయే చిత్రాలు, మలుపు తిప్పే చిత్రాలు రావాలి. తెలుగు సినిమా రంగమా ... 2018 కి శుభాకాంక్షలతో కూడిన అభినందన పూర్వక స్వాగతం. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన