... ఆకాశం నీ హద్దురా

వంశీ వ్యూ పాయింట్ // ... ఆకాశం నీ హద్దురా //
****************************************
            "నుదుటినుండి స్వేదం చిందకుండా చేసేపనికి విలువ లేదు. భారతీయ మేధ ఏ ఒక్కరికీ తీసిపోదు. కానీ, మనకు ధైర్యం పాళ్ళు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తామన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించటం. విజయాభిలాషను పెంపొందించుకోవటం" అని సి.వి. రామన్ గారు చెప్పారు. మనలో అందరూ కలలు కంటారు, ఆ కలలను నిజం చేసుకోవడానికి అవసరమైన పోరాటం చేసే ధైర్యం మాత్రం అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. కలలు కనే మిగతా అందరూ, ఆ ధైర్యవంతుల గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు, తరతరాలుగా. అటువంటి ఒక ధైర్యవంతుడి కథ, కెప్టెన్ గోపినాథ్ గారి జీవితం ఆధారంగా సుధా కొంగర గారి దర్శకత్వంలో రూపొందిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా. మొదటి సన్నివేశం నుండి ఒక విధమైన ట్రాన్స్ లో నడుస్తుంది సినిమా. ఆ మూడ్ సినిమా అంతటా కొనసాగించడంలో సుధా కొంగర గారు విజయం సాధించారు అని చెప్పవచ్చు.
            ఆకాశయానాన్ని సామాన్యులకూ అందుబాటులోకి తీసుకురావాలని తపించి, పోరాడిన చంద్ర మహేష్ మరియు అతడి మిత్రుల కథ ఇది. ఆ ప్రయాణంలో ఎయిర్లైన్స్ బిజినెస్ లో దిగ్గజాలుగా ఉన్నవారితో అతడు తలపడటం; వారి ఆటలో భాగంగా అనేక కష్టాలు ఎదుర్కోవడం; ఆ పోరాటంలో అతడికి భార్య, మిత్రులు, గ్రామస్థులు అండగా నిలవడం ... చివరకు అతడు విజయం సాధించడం - స్థూలంగా ఇదీ కథ. మొదట్లో ఎవరి అప్పాయింట్మెంట్ కోసమైతే అతడు ప్రయత్నిస్తుంటాడో, చివర్లో ఆ గొప్ప వ్యక్తే చంద్ర మహేష్ కు ఫోన్ చేసి అప్పాయింట్మెంట్ ఇస్తాననడంతో సినిమాకు అవసరమైన సినిమాటిక్ ముగింపును ఇచ్చారు. కథ పరంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలెదురైనా, చివరకు ఖచ్చితంగా విజయం సాధించే హీరో కథే ఇది - నిజ జీవిత పాత్రల ఆధారంగా రూపొందినప్పటికీ, ఈ కథ బేసిగ్గా సినిమాటిక్ లిబర్టీస్ కి, కమర్షియల్ అంశాలకు లోబడే అంశమే. ఐతే సుధా కొంగర గారు దీన్ని పూర్తి కమర్షియల్ గా కాకుండా, పూర్తి ఆర్ట్ ఫిలింలా కాకుండా అన్ని వర్గాలనూ ఆకట్టుకోగలదు అనిపించే స్థాయిలో తీయడానికి ప్రయత్నించారు. కాకపోతే దాదాపు ఫ్లాట్ గా సాగే స్క్రీన్ ప్లేతో కొన్నిసార్లు సాగతీతలా అనిపిస్తుంది. టెక్నికల్ గా బావుంది. ఫోటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉంది. ఉన్న కొన్ని పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి, నేపథ్య సంగీతం మాత్రం కొన్ని సన్నివేశాల్లో పాత్రల సంభాషణలు సరిగా వినపడనీకుండా అడ్డుపడింది అనిపించింది.
            'ఆకాశం నీ హద్దురా' సినిమాను సూర్య తన భుజాలపై మోశాడు. ఇంతకంటే క్లిష్టమైన పాత్రలను కూడా అవలీలగా పోషించిన సూర్యకు ఇది సులువే. పాత్రలో ఉన్న సంఘర్షణ, ఇంటెన్సిటీ, ఆవేశం, అసహనం ... ఇలా అన్ని భావాలను అద్భుతంగా పోషించారు. మొదటి నుండి చివరివరకూ ఆ పాత్రలోని ఇంటెన్సిటీని అద్భుతంగా కారీ చేశారు. ఇక అపర్ణ బాలమురళి బేబీగా ఆకట్టుకున్నారు. మణిరత్నం 'గురు', సుధా కొంగర 'గురు' చిత్రాలలోని హీరోయిన్ పాత్రలను పోలి ఉండటంతో అనేక సందర్భాలలో ఆ పాత్రలు గుర్తొస్తాయి. అయితే అపర్ణ గారు కూడా ఆ పాత్రను అంతే సమర్థంగా పోషించారు. మిగతా నటీనటులు కూడా పాత్రలకు అవసరమైనంతమేరకు సమర్థంగా నటించారు (కొన్ని సన్నివేశాల్లో ఊర్వశి గారు తన సహజ తీరులో ఓవర్ ది బోర్డ్ తరహాలో అనిపించినా). ఈ సినిమా నిజానికి ఓటిటిలో రిలీజ్ అవడం, నిర్మాతల మంచికేనేమో, ఈ తరహా సినిమా థియేటర్ లో ఎంతవరకూ ఆడగలదనేది సందేహమే - కాకపొతే పరిమిత బడ్జెట్ లో తీయడం మంచి అంశం.
            ఈ సినిమాకు స్ఫూర్తి అయిన కెప్టెన్ గోపినాథ్ గారు ఈ సినిమా పట్ల స్పందిస్తూ “He carried off the part of an entrepreneur obsessed to the point of madness that makes dreams come true. Couldn’t help laughing on many family scenes. Dramatized but true to the undying spirit of the triumph of hope against struggles and tribulations of an entrepreneur with disadvantaged rural background over overwhelming odds” అని అన్నారు. ఆయన అన్నట్టుగా కొంత డ్రమటైజేషన్ ఉన్నప్పటికీ, దాన్ని సినిమాటిక్ లిబర్టీ కింద తీసుకోవచ్చు. ఇందులో రెండు సన్నివేశాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి చంద్ర మహేష్ (సూర్య) తండ్రితో వాదిస్తుంటే, తండ్రి అతడిని చెంపదెబ్బ కొడతాడు. అపుడు తండ్రితో 'అహింస గురించి మాట్లాడే నువ్వు, ఇపుడు ఎందుకు హింసకు పాల్పడ్డావు?' అని నిలదీస్తాడు; మరో సన్నివేశంలో పరేష్ గోస్వామి (పరేష్ రావల్) తన సహాయకుడితో 'మంచి ఏదైనా ఉంటే రేపైనా చెప్పు, చెడు ఏదైనా ఉంటే వెంటనే (నిద్రలోంచి లేపి అయినా సరే) వెంటనే చెప్పు' అంటాడు.
            ఓటిటి మాధ్యమాలలో కొంచం కొంచం బావుండే సినిమాలు వచ్చిన కరోనా టైమ్స్ లో, 'ఆకాశం నీ హద్దురా' సినిమా ఒక విందుభోజనం వంటిదే అని చెప్పవచ్చు. మహాద్భుతంగా, గొప్పగా అనిపిస్తుంది అని చెప్పకపోయినా చూశాక ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది ఈ సినిమా. ప్రైమ్ వీడియోలో ఉంది, చూడండి. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన