... కత్తిమీద సాము చేస్తున్న జగన్

వంశీ వ్యూ పాయింట్ // ... కత్తిమీద సాము చేస్తున్న జగన్ //
********************************************************
            ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు కారణమెవరు అన్నది పెద్ద ప్రశ్న కాదేమో - రాజకీయ గెలుపోటములు నేర నిర్ధారణలు కాకపోయినా ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రజలు బలంగా నమ్మారు కాబట్టే ఒకరు ఘోర ఓటమితో అవమానభారాన్ని ఎదుర్కొనగా, ఊహించని విజయాన్ని పొందిన మరొకరు అధికారపీఠం ఎక్కారు. పరిస్థితులకు కారణం ఎవరైనా సరే, ముందు పరిస్థితులు చక్కదిద్దబడాలి. వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలి. అదే సమయంలో గత ప్రభుత్వపు మితిమీరిన అవినీతిని తవ్వి తీయాల్సిందే. ఎందుకంటే ఇపుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని పనులు సాధ్యపడవు, కొన్ని చోట్ల అప్పులు పుట్టవు, కేంద్ర ప్రభుత్వం పాత ప్రభుత్వపు ఖర్చుల లెక్కలు అడుగుతోంది - అవి సమీకరించటానిక్ ఇసయం పట్టవచ్చు - అంతవరకూ కేంద్రం అదనపు నిధులు ఇవ్వకపోవచ్చు. ఇందుకు కారణం ఖచ్చితంగా గత ప్రభుత్వమే కదా, మరి వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. ఇపుడున్న పరిస్థితుల్లో ఇపుడు ప్రాధాన్యత క్రమం ఏది అని చెప్పటం బహు క్లిష్టమైన అంశం - అదుపు తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టటమా లేక గత ప్రభుత్వపు అవినీతిని, అసమర్థతను విచారించటమా? 
            ప్రస్తుతం జగన్ గారు వేస్తున్న అడుగులు చూస్తోంటే ఆ రెండింటిని సమ ప్రాధాన్యంలో తీసుకున్నట్టుగా కనబడుతోంది. బయటనుండి చూస్తే, గత ప్రభుత్వంపై విచారణ/చర్యలు వంటివి ఇపుడు అంతటి ప్రాధాన్యత ఉన్న అంశాలుగా కనబడకపోవచ్చు లేదా కక్ష సాధింపు చర్యలుగా అనిపించవచ్చు. కానీ, పరిశీలించి చూస్తే అది ఎంతటి సమంజసమైన చర్య అన్నది తెలుస్తుంది. ముందుగా చెప్పినట్టు ఇపుడు పలుచోట్ల కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వ తీరు అంత ఆశాజనకంగా లేదు కాబట్టి అనేక పనులు మందకొడిగా సాగవచ్చు లేదా వాయిదా వేయబడవచ్చు. మందకొడిగా సాగినా లేదా వాయిదా వేయవలసి వచ్చినా దానికి కారణం ఎవరు? ఇప్పటి ఒకటిన్నర నెల ప్రభుత్వమైతే కాదు (ప్రస్తుతానికి), ఖచ్చితంగా గత ప్రభుత్వమే. మరి ప్రజల ముందు వారిని దోషిగా నిలపాలంటే ఇపుడు చేస్తున్న చర్యలు, ప్రతిదాడి (దాడి కాదు) సమంజసమైనవే. ఒకవైపు పలు వర్గాలను (ముఖ్యంగా వ్యవసాయ దారులు, మహిళలు, ఉద్యోగులు) సంతృప్తి పరచే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు, హామీలు ఇవ్వడం - గత బడ్జెట్స్ తో పోల్చినపుడు ఈ బడ్జెట్ వ్యవసాయదారులు, ఉద్యోగులను తృప్తి విధంగా ఉంది అని చెప్పవచ్చు. బడ్జెట్ లోని వివిధ కేటాయింపుల గురించి మరొక విశ్లేషణాత్మక వ్యాసంలో చర్చించుకుందాం. 
            చెప్పినవి చేయలేకపోయారు కాబట్టి లేదా చేయలేకపోయారని నమ్మబట్టి; విపరీతమైన అవినీతి జరిగిందని నమ్మారు కాబట్టి; అనుభవజ్ఞుడని నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారని - ఇలా పలు కారణాల వల్ల తెదేపా తమ చరిత్రలో లేనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మిమ్మల్ని నమ్మి బాధ్యతలు ఇచ్చారుగా, దమ్ముంటే మీరు చేయండి మమ్మల్ని అనడమెందుకు అని ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కరెక్టే కానీ తెచ్చిన దాదాపు రెండు లక్షలకోట్లకు పైగా అప్పు, వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం ఏమైంది? ఒక్క శాశ్వత నిర్మాణమూ లేదు; దశ, దిశ మార్చే ప్రాజెక్ట్ ఒక్కటీ లేదు; ఒక్క సాగునీటి పారుదల ప్రాజెక్ట్ లేదు; ముఖ్యమంత్రి దాదాపు 38 దేశాలు తిరిగినా ఇన్వెస్ట్ చెయ్యటానికి పెద్ద స్థాయిలో ఎవరూ రాలేదు - చెప్పిన లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలకొద్దీ ఉద్యోగాల కల్పన వంటివన్నీ అభౌతికల్పనలుగా తేలినపుడు - మరి ఆ అప్పులు, నిధులు అన్నీ ఏమయ్యాయి? అలా దోషులను దోషులుగా నిలబెట్టలేకపోతే, రేపటి రోజున ప్రజలముందువ వీరు దోషులుగా నిలబడవలసి వస్తుంది. ఇపుడు ఈ రెండింటిని (రాష్ట్రాన్ని నడిపించటం, గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టటం) నిర్వహించటం అన్నది కత్తివాదర మీద నాట్యమాడటం వంటిదే. ఇప్పటి వరకూ చూస్తే, ప్రతి అంశంలో గణాంకాల సహితంగా తమ వాదన వినిపిస్తూ కొత్త ప్రభుత్వం, గత ప్రభుత్వాధినేతను కార్నర్ చేస్తోంది. నెలన్నరలోనే పాలనకు తాను కొత్త అయినా, వ్యూహాలలో చంద్రబాబు వంటి అత్యంత అనుభవజ్ఞుడు, అపర చాణక్యుడు కూడా గుక్కతిప్పుకోకుండా చేయగలనని జగన్ చూపుకుంటున్నారు. రాబోవు రోజుల్లో ఇవి ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన