... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - వామపక్షాలు
వంశీ వ్యూ పాయింట్ // ... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - వామపక్షాలు //
****************************** ****************************** ***********
రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఎవరెవరికి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది నాకు తెలిసినంతవరకూ, అర్థమైనంతవరకూ ఒక సిరీస్ గా రాస్తానని కొన్నాళ్ళ క్రితం చెప్పాను. అందులో భాగంగా మొదటగా వామపక్షాల గురించి - ఒకానొకపుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండిన వామపక్షాలు నేడు 'తోక పార్టీల' స్థాయికి దిగజారిపోయాయి అన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన వాస్తవం కాబట్టి దాని గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు.
గత ఎన్నికల్లోనే దాదాపు గల్లంతైపోయిన వామపక్షాల పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతోంది అన్నది ఇంకా ప్రస్నార్ధకంగానే ఉంది. చంద్రబాబు గారు వారికి కాసిని సీట్లు విదల్చటానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ, వారు 'పవన్' కళ్యాణ్ ను నమ్ముకుని ఎన్నికల నదిని ఈదాలని భావిస్తున్నారులాగుంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో 1 నుండి 2 శాతం వరకూ వామపక్షాలకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది (బహుశా ఉండేది అనాలేమో). కానీ, ఈ మధ్యకాలంలో వామపక్షాలు పోరాటాలను కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో గత అయిదు సంవత్సరాల కాలంలో పోరాటంలో కనబడింది ఎక్కువగా వైకాపా, విద్యార్ధి మరియు ప్రజాసంఘాలు మాత్రమే - ఇటీవలే పవన్ కళ్యాణ్ తన విశ్రాంతికి అపుడపుడూ విరామమిచ్చి జనాల్లోకి వస్తున్నారు. వామపక్షాల ఈ తీరు ప్రస్నార్ధకం మరియు అనుమానాస్పదంగానే ఉంది. ఒకప్పుడు వామపక్షాలు పోరాటానికి పిలుపునిస్తే, ప్రతిపక్షాలు తమ అవసరార్థం మద్దతు పలకాల్సి వచ్చేవి. అటువంటి స్థాయినుండి క్రియాశూన్యత ఆవహించేస్థాయికి ఎందుకు దిగజారారిపోయారో మరి.
రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వామపక్షాల అవకాశాల గురించిఅంచనాలు ఏర్పరుచుకోవాలంటే, ముందుగా కొన్ని విషయాలు చర్చించుకోవాలి ...
-> పొత్తుల ద్వారా వామపక్షాలు ఎన్ని స్థానాలు సాధించగలవు?
పొత్తుల ద్వారా వామపక్షాలు సాధించగలిగే సీట్ల గురించి నాకు తెలిసినంతవరకూ ఎవరికీ, వామపక్షాలతో సహా పెద్దగా అంచనాలు లేవనే చెప్పవచ్చు. వామపక్షాల ప్రస్తుత పరిస్థితి చూస్తే, ఎవరితో పొత్తుతో ఎన్నికలకు పోయినా ఒక సీట్ వస్తే గొప్ప, రెండు వస్తే అద్భుతం అన్నట్టుగా ఉంది.
-> తమ సాంప్రదాయక ఓటు బ్యాంకును భాగస్వామ్య పక్షాల వైపు ఎంతవరకూ సమర్థంగా మళ్ళించగలవు?
వామపక్షాలకు కాకపోయినప్పటికీ, భాగస్వామ్య పక్షాలకు ఇది అత్యంత ప్రధానమైన అంశం. ఇప్పటివరకూ వారు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే జనసేన - వామపక్షాలు పొత్తులో ఉండబోతున్నాయి. అటు జనసేనను కలుపుకుపోవాలని చంద్రబాబు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారు, అంతేకాక ఇపుడు కాకపోయినా ఎన్నికల తరువాతైనా జనసేన తమతోనే ఉంటుంది అన్న ఫీలర్స్ ని బాబుగారు సమర్థంగా వదులుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న వామపక్ష సానుభూతి వర్గాలు ఇటు వామపక్షాలకూ, అటు జనసేనకూ దూరం జరుగవచ్చు. ఇది ఒక 50% ఉండవచ్చు అనుకుంటే, ఆ 50% మొగ్గు ఓటుకు దూరంగా ఉంటారా లేక ప్రతిపక్షం వైపు మొగ్గుతారా అన్నది కూడా కీలకమే. ఇపుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వామపక్షాలు తమ సాంప్రదాయక ఓటు బ్యాంకు నుండి దాదాపు ఒక 30% నుండి 40% వరకూ మాత్రమే భాగస్వామ్య పక్షాలవైపు మళ్ళించగలవని అనిపిస్తోంది.
-> వామపక్షాలు ఇతరుల అవకాశాలను ఎంతవరకూ దెబ్బతీయగలవు?
దీనికి సమాధానం కూడా పై వివరణలో ఉంది. వామపక్షాల ఓటు బ్యాంకు షిఫ్ట్ బట్టి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష సానుభూతిపరులు తెదేపా వైపు మళ్లే అవకాశాలు కనబడటం లేదు, అలాగని పూర్తిగా వైకాపాకు మద్దతుగా మారే అవకాశమూ లేదు. కొంతమంది స్తబ్దుగా ఉండిపోవచ్చు. వామపక్ష వోట్ బ్యాంకులో చీలిక అన్నది ప్రతిపక్ష వైకాపాకు లాభకారిగా ఉండవచ్చునన్నది నా అంచనా.
-> ఒకవేళ ఒంటరిగా వెళ్ళాల్సి వస్తే, వారి పరిస్థితి ఏమిటి?
ఒక చిన్ననవ్వు నవ్వేసుకుని ఈ ప్రశ్నను వదిలేద్దాం, అంతకుమించి వివరించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
మరొక విషయం ఇతర పార్టీలలో వ్యక్తిపూజ గురించి, ఒకేవ్యక్తి సంవత్సరాల తరబడి పదవిలో కొనసాగడంలాంటి విషయాల గురించి విమర్శలు చేసే వామపక్షాలు రాష్ట్రంలో ఇంతవరకూ రాఘవులు, నారాయణ తప్ప వేరే పేర్లు ఎవరికీ తెలియని స్థాయిలో ఉంది. నాయకులూ సరిగా లేక, పెద్దగా పోరాటాలూ చేయక - పవన్ కళ్యాణ్ తో పొత్తు ద్వారా వీరు పవన్ కు ప్రయోజనకారి అవుతారా లేక పవన్ వీరికి ప్రయోజనకారి అవుతారా? పవన్ తీరును బట్టి చూస్తే ఏదో రెండు మూడు జిల్లాలపై (తెదేపా పూర్తిగా బలహీనంగా ఉందనుకునే జిల్లాలు కావచ్చు అని అంచనా - ఆ విషయాలు పవన్ గురించిన పూర్తి వ్యాసంలో చూద్దాం) మాత్రమే దృష్టి పెట్టేలా ఉన్నాడు. మిగతా చోట్ల, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్న తరహాలాగానే ఉంది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వామపక్షాలకు పవన్ కళ్యాణ్ లేదా తెదేపా మాత్రమే (కాంగ్రెస్ కూడా ఉందండోయ్) ఆప్షన్స్. మరొక విషయం పవన్ కళ్యాణ్ లేదా వామపక్షాలకు వేసే ఓటు పరోక్షంగా తెదేపాకు వేసినట్టే అనే భావన ఉంది. అయినా, వామపక్షాల ప్రస్తుత పరిస్థితి చూస్తే, ఎవరితో పొత్తుతో ఎన్నికలకు పోయినా పైన చెప్పుకున్నట్టు ఒక సీట్ వస్తే గొప్ప, రెండు వస్తే అద్భుతం. అంతకుమించి అంచనాలు అయితే ఇతరులకే కాదు వారికైనా ఉన్నాయా అన్నది సందేహమే.
గమనిక: ముందే చెప్పినట్టు, దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను గమనిస్తూ ఉన్నవాడిగా నా కోణంలో, నేను తెలుసుకున్న అంశాలను, నాకు అర్థమైన విషయాలను క్రోడీకరించుకుని - నా అంచనాలను చెబుతున్నాను. ఇక్కడ అభిమానం, ద్వేషం అన్నవేమీ లేవు. అలా కనబడితే, అది బహుశా మీ అభిమానపు దృక్కోణం నుండి నిజమే అనిపించవచ్చు - దానికి నన్ను బాధ్యుడిని చేయకండి, నా మీద ముద్ర వేయకండి. ఇందులో నేను చెప్పినవి/చెప్పబోయేవి బహుశా ఇప్పటికే అనేకమంది మేధావులు లేదా సర్వేలు తేల్చి చెప్పి ఉండవచ్చు. రాబోయే మిగతా వ్యాసాలు మరింత వివరణాత్మకంగా ఉండేలా చూసుకుంటాను. వామపక్షాల పరిస్థితిలాగే, వ్యాసాన్ని కూడా పెద్ద ప్రాముఖ్యత లేకుండా ముగించానని గమనించగలరు.
"వామపక్షాల పరిస్థితిలాగే, వ్యాసాన్ని కూడా పెద్ద ప్రాముఖ్యత లేకుండా ముగించానని గమనించగలరు"
ReplyDeleteఇంతబాగా విశ్లేషించాక కూడా మీరు "మిగతా వ్యాసాలు మరింత వివరణాత్మకంగా" అన్నారంటే భవిష్యత్ వ్యాసాలు ఇంకా లోతుగా ఉంటాయని అర్ధం అవుతుంది. వాటి కోసం కుతూహలంగా వేచి చూస్తాను.
Thank you :)
DeleteOne report, rather a rumour, says PK is still being steered by BJP. He may open up after poll results .
ReplyDeleteYeah, that I will discuss in article on janasena prospects
Delete