... మేలుకోండి అధ్యక్ష్యా

# నదులు, చెరువులు అనుసంధానం అన్నది నిజంగానే చాలా చక్కటి ఆలోచన. ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నందుకు చంద్రబాబు నిజంగా అభినందనీయుడే. కాకపోతే ఈ ప్రచారకండూతితో రేపటికి చెయ్యాలి, ఎల్లుండికి చెయ్యాలి అన్న ఆతృత తప్పటడుగులు వేయిస్తోంది. అయ్యా, భవిష్యత్తుకు పనికి వచ్చే ఒకానొక మహత్తర కార్యాన్ని ఆతృతగా చెయ్యాలనే ప్రయత్నంలో చెడగొట్టకండి.
# వనం - మనం: హరితహారానికి బదులు అనుకోవాలేమో. కానీ, లక్షల ఎకరాల పంటభూమిని నాశనం చేసి ఇప్పుడు పర్యావరణం గురించి, మొక్కల గురించి మాట్లాడుతుంటే అదేదో ఎవరో వేదాలు వల్లించినట్టు ఉంది.
# ప్రతి పూజా కార్యక్రమంలో బూట్లు వేసుకుని కార్యక్రమం నిర్వహించడం బాగోలేదు. పచ్చ మీడియా పట్టించుకోకపోవచ్చు. తమరితో అంటకాగుతున్నారు కాబట్టి భాజపా వారు పట్టించుకోకపోవచ్చు. కానీ, తమరి విజ్ఞత ఏమైంది? సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలి కదా. ఏ దేశమేళితే అక్కడి సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారే ఇక్కడి సాంప్రదాయాలకు విలువ ఇవ్వరా? ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు నెత్తిన టోపీ మాత్రం మరిచిపోరు. కాస్త స్వసంప్రాదాయాలకు విలువ ఇవ్వడానికి ప్రయత్నించండి.
# మన దేశంలో, మన దేశపు సాంకేతిక నిపుణులు నిర్మించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. తమరికి నచ్చకపోతే నష్టమేమీ లేదు కానీ స్వదేశీ సాంకేతిక నిపుణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం తమరి స్థాయికి తగదు. మనవాళ్లతో కూచుంటే మురికివాడలు నిర్మిస్తారా అదే సింగపూర్, జపాన్, చైనా, కజకిస్తాన్ లాంటి దేశాల వారైతే అద్భుతాలు నిర్మిస్తారా? అలాగైతే మేము కూడా వారే బాగా పాలిస్తారు అని తమరిని తరిమేసి వాళ్లనే పాలించమంటాము అంటే తమరికెలా ఉంటుంది చెప్పండి? కాలుతుంది కదా ... కాస్త మేలుకోండి.
# చేసింది చెప్పుకోవాలి ఎవరూ కాదనట్లేదు. కానీ, ఆ గతంలోనే బతుకుతూ ఉండకూడదు. హైదరాబాద్ ముగిసిన కథ, తెలంగాణ విడిపోయిన రాష్ట్రం. అవి ఇంక మనకు అనవసరం. ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టటానికి 'నోట్ ఫోర్ వోట్' అవసరమయ్యింది. ఆ రాష్ట్రాన్ని పూర్తిగా మర్చిపోవడానికి ఇంకేం అవసరమో ...
# తమరు వందరోజుల్లోనో, రెండొందల రోజుల్లోనో అద్భుతాలు సాధించనక్కరలేదు. ప్రజలు తమరు అనుభవజ్ఞులు అని భావించి, ఈ సంధి సమయంలో తమరి అనుభవం పనికి వస్తుందనే ఉద్దేశంతో అధికారం కట్టబెట్టారు తప్ప తమరు వందరోజుల్లోనో రెండొందలరోజుల్లోనో అద్భుతాలు సాధిస్తారని కాదు. అనుభవానికి ప్రజలు ఇచ్చిన విలువ, తమరు ప్రజల నమ్మకానికి కూడా ఇవ్వటానికి ప్రయత్నించండి.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... మూడు బెత్తం దెబ్బలు

... ఎవరి తప్పులు/ఆశలకు ఎవరు బాధ్యులు?