మనలో ఒకడు - 1: విరించి

మనలో ఒకడు
************

ఉపోద్ఘాతం

గొప్పవాళ్ళు అంటే కేవలం స్వామి వివేకానంద, గాంధీ, బోస్, ఆజాద్, భగత్ సింగ్ ఇలా ప్రపంచానికంతా తెలిసిన వాళ్ళు మాత్రమె కాదు. గొప్పతనం అన్నది ఒక స్థాయి కూడా కాదు. మనం రోజూ పలకరించే, కలిసే వారిలో కూడా చాలా మంది గొప్పవాళ్ళు ఉంటారు. నోబెల్ బహుమతి వచ్చే వరకు సత్యార్థి అంటే ఎవరో మనలో చాలా మందికి తెలీదు కదా. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ తోచినంతలో సమాజ ఉన్నతికి తన వంతు కృషి తను చేస్తున్న ప్రతి ఒక్కరు గొప్పవారే. అలాంటి వారు మనలోనే, మన స్నేహితులలోనే చాలా మంది ఉన్నారు. 'సమాజంలోని సమస్యల పరిష్కారానికి ఎవరికోసమో వేచి చూడటం కాకుండా తమవంతు కృషి/ప్రయత్నం తాము చెయ్యాలన్న ఆలోచన' వారిని గొప్పవారిగా భావించేలా చేస్తోంది. పోరాడటం తెలిసిన వాడు ఏనాటికైనా గెలిచి తీరతాడు అంటారు. అలాంటి పోరాట యోధులు కూడా మనలో చాలా మంది ఉన్నారు. నేను రాసేది కాబట్టి నా ఇష్టానికి తగ్గట్టు రాయటమే కాబట్టి, పైన ఉదహరించిన రెండు లక్షణాలు నాకు విపరీతంగా నచ్చుతాయి కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్న వారి గురించి నేను 'మనలో ఒకడు' శీర్షిక పేర ధారావాహికంగా రాస్తున్నాను. వీరు వార్తలకెక్కినవారు కాకపోవచ్చు కానీ ప్రేరణ ఇవ్వగల స్థాయి వీరికి ఉంది. ఇలాంటి వారి గురించి రాయటం వల్ల నాకు వ్యక్తిగతంగా ఒనగూడే ప్రయోజనం కంటే ఇది చదివే పది/పాతిక మందిలో కనీసం ఒక్కరైనా తమ ఆలోచనల్లోంచి ఆచరణలోకి దిగితే నేను ఆశించిన ప్రయోజనం నెరవేరినట్టే. ఎక్కడో చదివాను "ఒక పిల్లి నీ పురోగమనాన్ని ఆపగలిగితే భగవంతుడు కూడా నిన్ను గమ్యానికి చేర్చలేడు" అని. మనందరికీ ఎన్నో మంచి ఆలోచనలు ఉన్నాయి, ఏదో చెయ్యాలన్న తపన ఉంది, అది చెయ్యకుండా అడ్డుపడుతోంది పరిస్థితులో లేక మరెవరో కాదు మనమే. ఆ అడ్డంకిని అధిగమించి తమ ఆలోచనలను ఆచరణ రూపలోకి మార్చిన వ్యక్తులే ఈ 'మనలో ఒకడు'.
ఇక్కడ నేను ఉదహరించిన, పరిచయం చేస్తున్న వ్యక్తులకంటే పెద్ద స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారు, గొప్పవారు చాలామంది ఉంది ఉంటారు. ఈ శీర్షిక రాయటంలో నా ప్రధాన ఉద్దేశం నేను స్వయంగా చూసిన వారి గురించి చెప్పటం/తెలియజేయటం. కొంతమందికి ఇది నేను నా మిత్రులను పొగడతానికో లేక వారిని ప్రమోట్ చేయ్యటానికో వేదిక అని కొందరు అనుకుంటున్నట్టుంది. వారికి సమాధానం కాదు కానీ ఇది ఒకరిని పొగడటానికి వేదికగా ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో మొదలు పెట్టింది కాదు. గొప్పవారు ఎవరూ పుట్టుకతో గొప్పవారు కాదు. ఒక వ్యక్తి అసాధారణ ప్రతిభ చూపుతెనో, లేక వివిధరంగాలలో ప్రతిభ చూపుతెనో మనం వెంటనే 'అది వాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో' అనో లేక 'వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో' అని ఒక ముద్ర వేసేసి ఆ వ్యక్తి కృషి/గొప్ప ఏమీ లేదు అని తీర్మానించేసి మనకు మనం సంతృప్తిపడిపోతాం తప్ప ఆ విజయం వెనుక ఉన్న కృషిని గుర్తించటానికి కాని స్ఫూర్తి పొందటానికి కాని చాలా మందిమి అంగీకరించం. ఆ దౌర్బల్యం/న్యూనత నుండి బయటపడగలిగిననాడు కనీసం పోరాడగలిగే దృక్పథం అలవడుతుంది. అలాంటి న్యూనతలను వదిలించుకుని గొప్ప అనిపించే లక్షణాలను తమలో అన్వేషించుకున్న మామూలు మనుషుల గురించి వివరించాలన్న ప్రయత్నమే ఇది. అంతే తప్ప మరేమీ కాదు. వీరిని పొగడాల్సిన అవసరమూ లేదు, ఒకరకంగా ఇది వారికి ప్రోత్సాహమివ్వడం లాంటిది.  నా పేస్ బుక్ పేజి లో నేను రాసేది చదివే వారిలో కనీసం ఒక్క శాతం కాకపోయినా ఒక్కరైనా స్ఫూర్తి పొందగలిగి ఆలోచన నుండి ఆచరణ వైపుగా సాగితే చాలు - ధ్యేయం నెరవేరినట్టే. అలాంటి ఆశతోనే మొదలెడుతున్నాను.
********************************************
 ఈ 'మనలో ఒకడు' లో మొదటి భాగంగా నేను చూసిన వారిలో విరించి గురించి వివరిస్తాను ...
విరించి
******
మనలో ఒకడు - విరించి. కొంతమందికి తీరని దాహం ఉంటుంది - తృష్ణ అంటారు దాన్ని. ఆ తృష్ణ నిలువెల్లా దహించివేస్తుంటుంది, ఏదో సాధించాలన్న తపన అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అది వారిని కుదురుగా ఉండనివ్వదు. నేను చూసిన అలాంటివారిలో విరించి ఒకడు. వ్రుత్తి పరంగా వైద్యుడు. ప్రవ్రుత్తి పరంగా సౌందర్యారాధకుడు, వ్యావ్రుత్తి పరంగా కవి, రచయిత, గాయకుడు, సమాజ సేవకుడు గట్రా గట్రా. వైద్యుడుగా తనకు వీలైనంత/చేతనైనంత వరకు వైద్యాన్ని పేదవారికి అందుబాటులో ఉంచటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. హైదరాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లోని వందకు పైగా గ్రామాలలో గుండె జబ్బులకు సంబంధించి అవగాహనా సదస్సులు నిర్వహించాడు. ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఏదో సాధించాలన్న తపన కనిపిస్తుంటుంది. ఆ తృష్ణ అతన్ని కుదురుగా ఉందనీదు.
సమాజం కోసం ఏదో చెయ్యాలి, చైతన్యం తీసుకురావాలి అన్నది విరించి తపన. తను రాసే కవితలలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. 'నిద్దురపోతున్న జాతిని మేల్కొలిపేదే కళ' అన్న నానుడిని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి విరించి. తనను చూసినపుడు నాకు 'హల్లాబోల్' (హిందీ - అజయ్ దేవగన్ చిత్రం) చిత్రంలోని పంకజ్ కపూర్ పాత్ర గుర్తుకు వస్తుంది. తనకు తెలిసిన కళను సమాజంలో సమస్యల పట్ల అవగాహన కల్పించటానికి, జనాన్ని జాగృతం చేయటానికి, ఉత్తేజితులను చేయటానికి ఉపయోగించే పాత్ర అది. విరించి కూడా అంతే తను వృత్తిగా స్వీకరించిన వైద్యాన్ని కానీ, అభిరుచిగా శ్వాసించే కవిత్వాన్ని కానీ, అబ్బిన వాక్పటిమను కానీ - ఇలా తనకు తెలిసిన విద్య(ల)ను సమాజంలో మంచిని పెంచటానికి, జనాలలో అవగాహన కల్పించటానికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్న విరించి లాంటి వారిని వ్యక్తిగతంగా అభినందించటం, తను చేస్తున్న దానికి తోచిన సహాయం చెయ్యటం చాలా సులువైన విషయం. కానీ అది అంతటితో ఆగకూడదు, 'సమాజానికి తిరిగి ఇవ్వటం' (Give back to society) అన్న భావన ఒక దావానలంలా వ్యాపించాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలగాలి. ఒక విరించితోనో, విరించి దగ్గరో ఇలాంటి భావాలు ఆగిపోకూడదు. తన కోరిక కూడా అదే. విరించి లేదా అలాంటి వారు ఆశించేది వారు చేసే పనుల్లో ఆర్ధిక సహకారం కాదు అంతకంటే ఎక్కువ. అది డబ్బుతో ఇవ్వగలిగేది కాదు. మీరు కూడా మీకు చేతనైంది చెయ్యాలి, 'సమజానికి తిరిగి ఇవ్వాలి'.
చెయ్యాలనుకునే మనసు ఉంటె తీరిక కూడా ఉంటుంది అన్న దానికి ఉదాహరణ విరించి. మనకైతే సినిమా చూడటానికి సమయం ఉంటుంది, బార్ కి వెళ్ళటానికి సమయం ఉంటుంది, ఉబుసుపోక కబుర్లు చెప్పుకోవటానికి సమయం ఉంటుంది; కానీ మన ఊరిలోనో, ప్రాంతంలోనో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోవటానికి, వాటి పరిష్కారానికి మన వంతుకృషి చెయ్యటానికి మాత్రం సమయం ఉండదు. ఎవరినీ కించపరచాలనో, వేలెత్తి చూపాలనో కాదు - నాతొ సహా మన తీరు గురించిన నిజం అది. విరించి లేదా అలాంటివారు ఈ నిజానికి అతీతులు అని చెప్పాలనుకోవట్లేదు - ఎక్కడిదాకానో ఎందుకు మేమిద్దరం కలిసి పనికిరాని గంటలు ఎన్నో గడిపాం. కానీ అది కొద్దికాలం మాత్రమే - తరువాత 'సమాజానికి తిరిగి ఇవ్వటం' అన్న అంశం పైనే ప్రధానంగా చర్చలు ఉండేవి, దాని తర్వాతి స్థానం మిగతా అంశాలు అంటే సినిమాలు, రాజకీయాలు, క్రీడలు లాంటివి ఆక్రమించాయి. మనసుంటే మార్గం ఉంటుంది, వాదన గెలవటానికి సవాలక్ష కారణాలు చెప్పొచ్చు, ముసుగులు ఎన్నైనా వేసుకోవచ్చు. నిజం మాత్రం అదే. ఆ నిజాన్ని అర్థం చేసుకున్న వారు ముసుగులు తీసేసి ఆచరణాత్మకతకు ప్రాధాన్యతనిస్తారు - అలాంటివారిలో విరించి ఒకడు.
"ఎంచుకునే అంశం సామాజిక సమస్యలు/రుగ్మతలు; తీరు ధిక్కారం/విప్లవాత్మకం; ఒరవడి/శైలి సంప్రాదాయ శైలి; లక్ష్యం సామాజిక చైతన్యం/స్పృహ. అంతరించిపోతున్న సంప్రదాయ శైలి, ఒరవడిలను భాషా ప్రయోగాలు, పదాలతో సహా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న నీ శైలి ప్రసంసనీయం మిత్రమా. దివ్వెని వెలిగించే ప్రయత్నం చేస్తున్నావు, దారి చూసుకునే బాధ్యత చదువరులది. గర్వంగా ఉంది ... సాగిపో మిత్రమా చైతన్యమే లక్ష్యంగా" - ఇది నేను తన కవిత్వం గురించి వ్యక్తీకరించిన భావాలు. కానీ అది తన వ్యక్తిత్వానికి కూడా వర్తిస్తాయి. విరించికి నా తరఫునుంచి ఒకటే సూచన, నా కోరిక కూడా 'సాగిపో మిత్రమా చైతన్యమే లక్ష్యంగా'.
కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారు, విరించి అభ్యుదయ కవిత్వం చదవాలనుకున్నవారు తన పేస్ బుక్ పేజి లో వాటిని చదవవచ్చు - విరివింటి విరించి తన ప్రొఫైల్ ఐ.డి. చదవగలిగే ఆసక్తి, అర్థం చేసుకోగలిగే స్థాయి ఉంటె ఆ కవితలు గుండెను తడిమి భావాలను నిద్ర లేపుతాయి, బాధ్యతలు గుర్తు చేస్తాయి.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన