... మూడు బలిపశువుల కథలు

వంశీ కలుగోట్ల // ... మూడు బలిపశువుల కథలు //
********************************************
1
            అనగనగా కథల్లో, పురాణాల్లో చదువుకుని ఉంటాం - ఎవరో ఒకరు ఏదో ఒక దాన్ని ఆశించి ఘోరతపస్సు చేస్తారు. అలా ఎవరు తపస్సు మొదలుపెట్టినా మొదట ఉలిక్కిపడేది ఇంద్రుడు. బహుశా పదునాలుగు లోకాలలో (నిజమా, అబద్ధమా అనేది వేరే విషయం) అత్యంత అభద్రతాభావంతో ఉండేది ఇంద్రుడు మాత్రమేనేమో (ఇపుడూ ఎవరో ఒకరు ఉండే ఉంటారు). ఎందుకంటే ఆ తపస్సు చేసేవారి కోరిక స్వర్గాధిపత్యమేమో లేకపోతే వారు కోరే వేరే కోరికల వల్ల తన పదవికి ముప్పు వస్తుందేమో అనే అనుమానాలు. ఇంద్రుడి తక్షణ కర్తవ్యం ఆ తపస్సును భగ్నం చేయడం - తనకు తెలిసిన అన్ని మార్గాలూ ప్రయత్నిస్తాడు. అవతలి వాడు గట్టి వాడైతే (ఎందుకంటే అప్పట్లో తపస్సులు చేసినోళ్ళందరూ మగోళ్ళే పురాణాల లెక్కల ప్రకారం) అన్నీ తట్టుకుని నిలబడతాడు. అపుడు ఇంద్రుడు చివరి అస్త్రం తీస్తాడు - అదే అప్సరసలను పంపడం. ఆ అప్సరసల మాయలో పడకుండా ఉన్నోళ్ళు బహు అరుదు. ఇక వాళ్ళ తపస్సు భగ్నం, ఇంద్రుడు హ్యాపీ. అప్సరసలతోనూ పని జరక్కపోతే - శివుడు ఏదొక వరం ఇవ్వడం, తరువాత విష్ణువు ఆ సమస్యను పరిష్కరించడం అలా జరిగిపోయేది (అలానే ఉండేది మరి, ఏంటో రాక్షసులందరూ పనిగట్టుకుని శివుడి గురించే తపస్సు చేస్తారు). ఇక్కడ ప్రధానంగా ప్రపంచశాంతికోసం (అంటే ఇంద్రుడి దృష్టిలో) సమిధలుగా 'వాడుకోబడేది' మాత్రం అప్సరసలు. మరో రకంగా చెప్పాలంటే ఇంద్రుడి పదవీ కాంక్షకు బలయ్యే బలిపశువులు.  

2
            తరువాత్తరువాత్తరువాత్తరువాత్తరువాత అంటే ఏదో యుగాలు అవీ మారిపోయాకనో లేక మరోటో అనుకుందాం - రాజుల్లో రాజ్యవిస్తరణా కాంక్ష విపరీతంగా పెరిగిపోయింది. లేదా వ్యక్తిగత పంతాలతో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకున్న మహారాజులు యుద్ధానికి సిద్ధమవుతారు. ఇరువైపుల సైన్యాలు యుద్ధభూమిలో మోహరిస్తాయి. ఇరువురు రాజులు యుద్ధరంగంలో ఉంటారు. అయినా రాజులు తమ ఆయుధాలను రాజువైపుకు ఎక్కు పెట్టరు, మొదటి దాడి సైన్యంపైనే. చివరకు సైన్యం అంతమయ్యాకనో లేక చేతులెత్తేశాకనో రాజు రాజీకొస్తాడు. రాజ్యాన్ని అప్పగించి, సామంతుడిగా ఉండటానికి అంగీకరించడమో లేదా అవతలి వాడు కౄరుడైతే తప్పించుకుపోవడమో (లేక చావడమో) జరుగుతాయి. యుద్ద్ధం ముగిశాక, శాంతికోసం రాజులు ఇరువురూ కలిసిపోతారు - అయితే గియితే కుటుంబాలలో పెళ్ళిళ్ళు చేసుకుని బంధువులూ అయ్యేవారు. ఇరువురు రాజుల అహం నిలబెట్టటానికి సైన్యం వాడుకోబడుతుంది. యుద్ధంలో బలిపశువులయ్యేది సైన్యమే. 

3
            దేవుళ్ళ కాలం, రాజుల కాలం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఒక జోక్ చదివాను. ఒక గొర్రెల కాపరి తమవైపుగా వస్తున్నా దొంగల గుంపును గమనించి, తన గొర్రెలతో 'దొంగలు వస్తున్నారు, నేను పారిపోతున్నాను మీరూ పారిపోండి' అంటాడు. అపుడు గొర్రెలు 'మాకు నువ్వైనా, ఆ దొంగలైనా తేడా ఏమీ ఉండదు. ఎవరైనా పెడితే ఇంత గడ్డి పెడతారు లేదా కోసి అమ్ముతారు. నీకంటే నీ దగ్గరున్న డబ్బు/నగలు చూసుకుని భయం, మాకేముంది బొచ్చు' అన్నాయట. అలా అప్సరసలు, సైన్యం పేరేదైతేనేం బలయ్యే జీవుల కథలన్నీ ఒకటే. ఇపుడు ఆ ప్లేస్ లోకి సామాజిక మాధ్యమ కార్యకర్తలు వచ్చారు. వీరికి పైసా ఆదాయం ఉండదు, స్వయంతృప్తి తప్ప. మా దార్శనిక నేత, మా ధైర్యం గల నేత, మా పోరాడిన నేత, మా 56 ఇంచుల ఛాతీ నేత ... అంటూ సామాజిక మాధ్యమాలలో తెగ గింజుకుంటుంటారు. వారి ఇష్టమైన నేత మీద ఈగ వాలనివ్వరు. నిజానికి వారు అత్యంతగా ఆరాధించే ఆయా నేతల పాలనలో వీరిలో చాలామందికి వ్యక్తిగతంగా ఎటువంటి లాభమూ ఉండి ఉండదు, ఎటువంటి పనులూ పెద్దగా జరిగి ఉండవు. వీరిలో చాలామందికి కుల/మత/ప్రాంత ఇత్యాది అంశాల ప్రాతిపదికన వారంటే ఇష్టం ఏర్పడి ఉంటుంది. నచ్చిన నేతను నచ్చడంతో తప్పేమీ లేదు, మోయనూ వచ్చు. కానీ సమస్య ఏంటంటే నచ్చని నేత అధికారంలో ఉన్నపుడు. అపుడు నేతలకు తమకు చెందిన ఇటువంటి 'జీతం లేని' సైన్యం గుర్తొస్తుంది. ఏవేవో మార్గాల ద్వారా వారిని ప్రేరేపిస్తారు. ఆ అభిమానపు వలలో భాషలో, విషయంలో హద్దులు మీరతారు కొందరు. వీళ్ళంతా ఎవరంటే అప్సరసలు, సైన్యం లాంటివారు. తమకు ఏ ప్రయోజనమూ కలగని యుద్ధంలో తామెందుకు పాల్గొంటున్నామో తెలియకపోయినా - రొమ్ములు విరుచుకుని నిలబడి, పోట్లగిత్త కొమ్ముల పోటుకు మొదట గురయ్యేది వీరే. 

ముక్తాయింపు: 
            ఒకరు, ఒక సమూహం, ఒక పార్టీ వర్గం అని ప్రత్యేకించి ఎవరినీ టార్గెట్ చేసి రాయలేదిది. నా కోపం ఎపుడూ రాజు మీద కాదు, రాజును గుడ్డిగా అనుసరించే సైన్యం మీద. కోపం మాత్రమే కాదు, జాలి కూడా. అభిమానం ఉంటే చేసిన మంచిని మెచ్చుకోండి, నచ్చని చెడు గురించి మౌనంగా ఉండండి (ఎందుకంటే నచ్చిన నేతకు నష్టం చేయడం మీకు ఇష్టం లేకపోవచ్చు - అలాంటివారికి మాత్రమే ఈ వాక్యం). అంతకుమించి ఆటలో పాల్గొనాలంటే, 'వాడుకోబడతారు'. వాడుకున్న తరువాత మిగిలేదేమీ ఉండదు, అంతా పిప్పి. 

Comments

  1. Good comment on the contempory situation Sundu.

    ReplyDelete
  2. అసలు గత ఐదేళ్లలో కరోనా రాకుండా ఆపిన బాబుబలి ఎవరు.

    ఇంటి నుంచి కూడా వైరస్ వ్యాపిస్తున్నది ఎవరు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన