... ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు

వంశీ వ్యూ పాయింట్ // ... ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు //
************************************************************
            సాధారణంగా శాసనసభ సమావేశాలు వంటివి చూడను, వాటి గురించి వార్తాపత్రికలలో చదువుతాను. 2019 ఎన్నికల తరువాత కొంత ఆసక్తి కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఘోర ఓటమి తరువాత ఎలా వ్యవహరిస్తారు, ఊహించనంతటి విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ గారు ఎలా వ్యవహరిస్తారు అని ఆసక్తి కలిగింది. ముఖ్యంగా ఇంతకాలం వైరివర్గ ప్రోద్బలిత కష్టాలు అనేకం ఎదుర్కొన్న జగన్ గారు, ఈ విజయం తరువాత సహనంతో ఉండే తన తీరును అలానే ఉంచుకోగలరా అనే సంశయం కలిగింది. అదే సమయంలో అనేక దిగ్గజాలను ఎదుర్కొని నిలబడిన చంద్రబాబు గారు ఇపుడు దాదాపు తన అనుభవమంత వయసున్న జగన్ గారిని సభలో ఎలా ఎదుర్కొంటారు అని కూడా ఆసక్తి కలిగింది. ఇపుడు శాసనసభ సమావేశాలు చూస్తోంటే "ఇలాంటి శాసనసభ సమావేశాలు ఇలా చూసి ఎన్నేళ్ళయింది?" అని అనిపిస్తోంది ... 

నేను గమనించిన కొన్ని అంశాలు 
- ముందుగా సభాపతి స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారి గురించి చెప్పుకోవాలి. నేను సీరియస్ గా రాజకీయాలను గమనించటం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ సభను ఇంత హుందాగా నడిపినవారిని నేను చూడలేదు. ఈయన బాధ్యతలు స్వీకరించి అయినది అతి కొద్ది కాలమే కావచ్చు, రాబోవు రోజుల్లో ఆయన తీరు మారితే ఈ అభిప్రాయమూ మారుతుంది 
- అధికారపక్షం ఏమో చర్చ విషయం మీద జరిగేలా చూద్దాం అంటారు, అవతలి వాళ్ళు వివాదాలకు ప్రయత్నించినా, పక్కదారి పట్టకుండా విషయం వైపే చర్చ మళ్ళేలా ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా మంచి అంశం 
- ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షాన్ని అసలు విషయం మీద ప్రశ్నించడం మానేసి, చర్చను పక్కదోవ పట్టించాలని అహంభావ ప్రదర్శన చెయ్యాలని ప్రయత్నంచేస్తున్నారు. సహజంగా ఈ అహంభావ ప్రదర్శన అన్నది అధికార పక్షం వాళ్ళు చేస్తుంటారు 
- అధికార పక్షం మరియు ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలపై ఊరికే గాలివాటం ఆరోపణలు చెయ్యటం కాకుండా సంబంధిత శాఖల నుండి అధికారిక సమాచారంతో, గణాంకాలతో సహా ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. అవసరమైన చోట వీడియోలు, స్లైడ్స్ కూడా చూపుతూ గత ప్రభుత్వపు తీరును ఎత్తి చూపుతున్నారు
- ప్రతిపక్షానికి కూడా మాట్లాడటానికి తగిన సమయం ఇస్తూ, వారు మాట్లాడేప్పుడు సంయమనంతో వింటూ - ఆహా, ఇలా చూసి ఎన్నేళ్ళయిందో. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అడ్డుపడుతూ, అప్పట్లో జగన్ గారు ఏమడిగినా 'లక్షకోట్లు' అంటూ బల్లలు చరుస్తూ అడ్డుకున్న తీరు ఇంకా గుర్తుంది. ఈ తీరు దానికి చాలా భిన్నంగా ఉంది
- అధికార సభ్యులు మాట్లాడేటపుడు అనవసర అహంభావ ప్రదర్శన, ఊకదంపుడు ఉపన్యాసాలు వంటివి లేకుండా సూటిగా, స్పష్టంగా ఏమి చెప్పాలనుకుంటున్నారో అది చెబుతూ - దానికి తగిన గణాంకాలను చూపుతూ మాట్లాడుతున్నారు
- అధికార పక్షం ఇపుడు చూపుతున్న గణాంకాలన్నీ గత ప్రభుత్వం ఆయా సమయాల్లో ప్రకటించినవి, ఆయా విభాగాలలో పొందుపరచబడినవే కావడంతో ఇపుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న అప్పటి అధికార పక్షం వారికి సమాధానం ఇవ్వడం కష్టమవుతోంది 
- మొత్తంగా చెప్పాలంటే ఊకదంపుడు ఉపన్యాసాలు, అహంభావ ప్రదర్శనలు వంటివి లేకుండా చక్కగా జరుగుతున్నాయి. మిగతా సెషన్స్ కూడా ఇలాగే జరిగితే బాగుండునని అనిపిస్తోంది. 

ఇక్కడ అధికారపక్షం గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి 
- ఇప్పుడైతే చంద్రబాబు గారి గత హామీలు, అబద్ధాలు చూపి దెప్పిపొడవవచ్చు, ఎగతాళి చేయవచ్చు. కానీ, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి పరిస్థితి ఇలా ఉండదు. ఎందుకంటే అపుడు ఈ ప్రభుత్వం చేసిన లేదా చెయ్యలేని పనులు ఉండి ఉంటాయి. అపుడు చర్చ ఈ ప్రభుత్వపు పెర్ఫార్మన్స్ మీద ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, ఇకమీదట తాము చేయవలసిన పనుల మీద దృష్టి పెట్టాలి. 
-  వచ్చే సంవత్సరం సమావేశాల నాటికి అమలులో ఖచ్చితంగా ఎన్నో కొన్ని వైఫల్యాలు ఉంటాయి. ప్రతిపక్షానికి ఒక చిన్న ఈక దొరికినా చాలు, రచ్చ చేయటానికి. అపుడు కూడా ఇంతే సంయమనంతో, హుందాతనంతో వ్యవహరించగలగాలి. ముఖ్యంగా ఇప్పటిలానే చెవిరెడ్డి, రోజా వంటివారిని కాస్త అదుపులో ఉండేలా చూసుకోగలగాలి. 
- ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులు తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి వంటి వారిని చూసి ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి. రెచ్చగొట్టే తీరు కాకుండా, ప్రజాసమస్యలపై చర్చ జరిగేలా సంయమనంతో వ్యవహరించాలి

ప్రతిపక్షం గమనించవసిన కొన్ని అంశాలు 
- గతంలోలా ఊరికే దబాయించి తప్పించుకోలేరు అని గమనించాలి. తమ ప్రభుత్వ హయాంలో ఏమి జరిగిందన్నది వాస్తవ గణాంకాలతో సహా ఇప్పటి ప్రభుత్వపు చేతుల్లో ఉందన్నది గుర్తుంచుకోవాలి 
- అధికారపక్షమే చర్చకు స్థానం ఇస్తోంటే, చర్చను పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదు. విలువైన సమయాన్ని ప్రజాసమస్యలపై చర్చ జరిగేలా చూడాలి
- కాస్త సహనం అలవాటు చేసుకోవాలి. వచ్చే సంవత్సరం బడ్జెట్ సమావేశాల వరకూ ఎదురు చూడగలిగితే, అపుడు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనా దొరకవచ్చు. అపుడు వీరు కూడా వాస్తవ గణాంకాలతో సమర్థంగా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. 

నచ్చని కొన్ని అంశాలు 
- స్వయంగా జగన్ గారు లావుంటాడు, వయసు పెరిగింది కానీ అంటూ మాట్లాడటం నచ్చలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా, అధికార సభ్యులు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ సంయమనం కోల్పోకుండా వ్యవహరించిన తీరులోనే ఉంటే బావుటుంది. ముఖ్యంగా బాడీ షేమింగ్ వంటివి చేయకపోవటమే మంచిది. అదొక్కటీ వదిలేస్తే,, అత్యంత సమర్థంగా, అర్థవంతంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ప్రత్యర్థులు కూడా ప్రశంసించే తీరులో ఉంది ఆయన శైలి
- ఇంకా సమయం ఉంది, నూతనంగా ఎన్నికైన సభ్యులకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అందరూ సభలో మాట్లాడేలా అవకాశం వచ్చేలా చూడాలి . 

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 
- శాసనసభ సమావేశాలు చూస్తోంటే, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదయ్యిందేమో అనిపిస్తోంది. 

Comments

  1. చంబా చంచాలతో తిట్టించేవాడు. జగన్ గాడిదలు కాశాడా అని నేరుగానే తిట్టాడు. Jagan needs to talk in a dignified manner to show difference.

    ReplyDelete
  2. బరాక్ ఒబామా "లిప్పుస్టిక్కు పూసునుకున్నంత మాత్రాన పంది పంది కాకుండా పోదు" అంటే గవర్నర్ పేలిన్ మద్దతుదారులు "మహిళను పంది అంటారా" అని గగ్గోలు పెట్టారు. అది ఆంగ్ల భాష నానుడిరా బాబూ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడానికి ముఖ్యకారణం ఒబామా తోలు రంగు తప్ప ఇంకోటి కాదు.

    తిట్లకు సామెతలకు తేడా తెలువకపోతే ఎట్లా పచ్చ తమ్ముళ్లూ?

    ReplyDelete
  3. Replies
    1. అలానే అనిపిస్తుంది ... గత అయిదు సంవత్సరాల సెషన్స్ చూసి ఉంటే తేడా తెలుస్తుంది. అయినా ఇది నా వ్యూ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా నా పాయింట్ అఫ్ వ్యూ నుండి ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా నిష్పక్షపాతమైనది అని చెప్పలేను. నాకు తప్పుగా అనిపించింది తప్పు అంటాను, కాదంటే మెచ్చుకుంటాను అంతే. This article has got my views on going sessions and suggestions to both ruling n opposition parties. I respect your views too ...

      Delete
  4. మీరు వ్రాసే సినిమాలకు రివ్యూలు బాగుంటాయి. రాజకీయాల్లో biased గా వ్రాస్తున్నారు. పక్కా రాయలసీమ ... రెండు నెలలుగా చూస్తున్నాం...కనీసం కేసీఆర్ లాగా పరిపాలించినా చాలు అనుకుంటే వీధి రౌడీ బెటర్ అనిపిస్తున్నట్లు పరిపాలిస్తున్నారు. ఆ నవ్వు, 40 ఇయర్స్ అంటూ ఎద్దేవా చేయడం, కొండను తవ్వి ఎలుకని పట్టుకోవడం, అన్నీ గమనిస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ. ఎస్, ప్రస్తుత ప్రభుత్వ తీరులో కొన్ని లోపాలున్నాయి, వాటిని ఇంకా బ్లాగ్ లో ఆర్టికల్ గా రాయలేదు. ఒకటిరెండురోజుల్లో రాస్తాను, అదునులో ప్రస్తావిస్తాను. కానీ, వీరు అన్నిరకాలుగా కుదురుకోవటానికి కాస్త సమయం పడుతుంది అని భావిస్తున్నాను. నేను బయాస్డ్ అవునా కాదా అన్నది నేను చర్చించాలనుకోవట్లేదు, నేను స్పందిస్తుంటాను అంతే.

      Delete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన